డైరెక్ట్‌ సెల్లింగ్‌ పేరిట రూ.1000 కోట్ల దందా! | Sakshi
Sakshi News home page

డైరెక్ట్‌ సెల్లింగ్‌ పేరిట రూ.1000 కోట్ల దందా!

Published Wed, May 31 2023 2:13 AM

Scam in the name of direct selling - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: డైరెక్ట్‌ సెల్లింగ్‌ పేరుతో ప్రారంభమైన ఈ–స్టోర్‌ ఇండియా సంస్థ దేశవ్యాప్తంగా రూ. 1,000 కోట్ల దందా సాగించినట్లు హైదరాబాద్‌ పోలీసులు గుర్తించారు. ప్రధానంగా రెండు రకాలైన స్కీములతో అమాయకులను ఆకర్షించి భారీ స్కామ్‌కు పాల్పడినట్లు తేల్చారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న హైదరాబాద్‌ నేర పరిశోధన విభాగం (సీసీఎస్‌) పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు నగర కొత్వాల్‌ సీవీ ఆనంద్‌ తెలిపారు.

డీసీపీ డాక్టర్‌ పి.శబరీష్, ఏసీపీ ఎన్‌.అశోక్‌ కుమార్‌లతో కలసి మంగళవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పూర్తి వివరాలు వెల్లడించారు. యాక్సస్‌ ఈ–కార్ప్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అండ్‌ ఆయుర్‌కేర్‌ హెల్త్‌ ప్రోడక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ ఈ–స్టోర్‌ ఇండియాను నిర్వహిస్తోంది.

దీనికి హిమాయత్‌నగర్, మలక్‌పేట ప్రాంతాలకు చెందిన మనీష్‌ కత్తి, సయ్యద్‌ అజ్మల్‌ సజ్జద్‌ మార్కెటింగ్‌ ఇన్‌చార్జులుగా వ్యవహరిస్తున్నారు. రిజిస్ట్రార్ ఆఫ్‌ కంపెనీస్‌ వద్ద నమోదు చేసుకున్న యాక్సస్‌ ఈ కార్ప్‌ సంస్థ తమ స్కీమ్‌లకు ప్రభుత్వ అనుమతి ఉందని నమ్మబలుకుతూ నిరుద్యోగులకు ఎర వేస్తోంది. 

ఈ రెండు స్కీముల పేరుతో... 
ఇండివిడ్యువల్‌ డి్రస్టిబ్యూషన్‌ స్కీమ్‌ కింద అనేక మందిని ఈ–స్టోర్‌ ఇండియా సభ్యులుగా చేర్చు­కుంది. ఎవరైనా రూ. 8,991 చెల్లించి సభ్యుత్వం తీసుకుంటే వారికి సంస్థ రూ. 9 వేల విలువైన ఆయుర్వేద ఉత్పత్తులు, కంపెనీ పేరుతో ఉన్న బోర్డు అందిస్తుంది. బోర్డును తమ ఇల్లు, దుకా­ణం ముందు తగిలించి ఆ ఫొటోను సంస్థకు పంపాలి. అప్పటి నుంచి కంపెనీ 36 నెలలపాటు నెలకు రూ. 1,100 చొప్పున ఇస్తామని చెప్పి పన్ను మినహాయింపుల తర్వాత రూ. 825 కొంతకాలం చెల్లిస్తుంది.

ఈ సభ్యుడికి ఓ గుర్తింపు నంబర్‌ ఇచ్చి మరో రూ.9 వేల విలువైన ఈ–స్టోర్‌ ఉత్పత్తులను కొనేలా చేస్తుంది. అందుకు ప్రతిగా కొంతకాలం సభ్యుడికి చెల్లింపులు చేసి ఆపై బోర్డు తిప్పేస్తుంది. ఇక సూపర్‌ మార్కెట్‌ స్కీమ్‌లో పెట్టుబడి భారీగా ఉంటుంది. ఒక్కో వ్యక్తి రూ. 25 లక్షల చొప్పున చెల్లించి సూపర్‌ మార్కెట్‌ ఏర్పాటు చేసుకోవాలి. దీనికి అద్దె, మౌలికవసతులు, ఉద్యోగులను తామే ఏర్పాటు చేస్తామని కంపెనీ నమ్మబలుకుతుంది. 

వందల మంది నుంచి రూ. కోట్లు..
ఈ సంస్థ స్కీముల్లో చేరి దేశవ్యాప్తంగా అనేక మంది రూ. వందల కోట్లు నష్టపోయారు. ఇప్పటివరకు రూ. 1000 కోట్ల దందా చేసిన ఈ–స్టోర్‌ ఇండియా 300 మందిని ముంచింది. వారిలో రాష్ట్రానికి చెందిన 44 మంది కూడా ఉన్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న సీసీఎస్‌ పోలీసులు 9 మందిని నిందితులుగా గుర్తించి మనీష్, అజ్మల్‌ సజ్జద్‌లను అరెస్టు చేశారు.  

Advertisement
 

తప్పక చదవండి

Advertisement