దాబాకు వెళ్లి.. వెంటనే వచ్చేస్తామని చెప్పి

Road Accident In East Godavari District - Sakshi

రాజమహేంద్రవరం‌: స్నేహితులందరూ కలిసి సరదాగా దాబాకు వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన కారు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. నగరంలోని వీఎల్‌ పురానికి చెందిన చలుమూరి నరేష్, జేఎన్‌ రోడ్డు ప్రాంతానికి చెందిన హితకారిణి సమాజం ఉద్యోగి కైరం విష్ణు (31), గాంధీపురం–2కు చెందిన పండా కిషోర్‌ (31), లంకా ఉమామహేశ్వరరావు, బొప్పే నాగరాజు, గొన్నూరి సత్యశివకుమార్‌ స్నేహితులు. వీరందరూ కలిసి ఆదివారం రాత్రి సత్యశివకుమార్‌ కారులో దివాన్‌చెరువులోని ధాబాకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో సత్యశివకుమార్‌ కారు నడుపుతున్నాడు. దివాన్‌చెరువు శివాలయం ఎదుటకు చేరుకున్న సమయంలో శివకుమార్‌ పక్కన కూర్చున్న ఉమామహేశ్వరరావు స్టీరింగ్‌ను టచ్‌ చేశాడు. అప్పటికే అతివేగంగా ప్రయణిస్తున్న కారును శివకుమార్‌ అదుపు చేయలేకపోయాడు.

దీంతో కారు డివైడర్‌ను ఢీకొని, పల్టీలు కొట్టి అవతలి వైపు ఉన్న పొదల్లో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కైరం విష్ణు అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన పండా కిషోర్, లంకా ఉమామహేశ్వరరావులను రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పండా కిషోర్‌ మృతి చెందాడు. ఉమామహేశ్వరరావు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మిగిలిన ముగ్గురూ సురక్షితంగా ఉన్నారు. చలుమూరి నరేష్‌ ఫిర్యాదు మేరకు బొమ్మూరు ఇన్‌స్పెక్టర్‌ కె.లక్ష్మణరెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు. విష్ణు, కిషోర్‌ మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం సోమవారం సాయంత్రం బంధువులకు అప్పగించారు. 

మృతుల కుటుంబాల్లో విషాదం 
కైరం విష్ణు స్వగ్రామం అమలాపురం సమీపంలోని తాండవపల్లి. ఎండోమెంట్‌ ఉద్యోగి కావడంతో హితకారిణి సమాజంలో పని చేస్తూ జేఎన్‌ రోడ్డులోని కేఎల్‌ఎం సమీపాన నివసిస్తున్నారు. ఆయనకు భార్య తేజస్వి, రెండున్నరేళ్ల కుమారుడు ఉన్నారు. ధాబాకు వెళ్లి, వెంటనే వచ్చేస్తామని చెప్పిన భర్త దుర్మరణం పాలవుతాడనుకోలేదని తేజస్వి, కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు. రాజమహేంద్రవరం గాంధీపురానికి చెందిన పండా కిషోర్‌ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో రికవరీ ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున్నాడు. అతడికి భార్య సృజన, ఆరు నెలల కుమారుడు ఉన్నారు.

బయటకు వెళ్లిన భర్త తిరిగి వస్తాడని సృజనకు, అతడి కోసం ఎదురు చూస్తున్న తల్లిదండ్రులకు కిషోర్‌ రోడ్డు ప్రమాదంలో మరణించాడన్న విషయం తెలియడంతో గుండెలవిసేలా విలపించారు. ఇక తమకు ఎవరు దిక్కంటూ కన్నీటిపర్యంతమవుతున్నారు. రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి వద్దకు అధిక సంఖ్యలో కుటుంబ సభ్యులు చేరుకోవడంతో ఆ ప్రాంతంతా ఒక్కసారిగా ఆక్రందనలు మిన్నంటాయి.

చదవండి: పోలీసులనూ వదలని సైబర్‌ నేరగాళ్లు..  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top