బాలుడిని మింగిన ‘డ్రగ్‌’ డ్రైవింగ్‌

Road Accident: American Woman Hit Car Under The Influence Of Drugs - Sakshi

డ్రగ్స్‌ మత్తులో కారును గుద్దిన అమెరికా మహిళ

కుమారుడి మృతి.. కూతురు పరిస్థితి విషమం

చికిత్స పొందుతున్న తల్లిదండ్రులు

అమెరికాలోని లాస్‌ఏంజిల్స్‌లో ఘటన

లింగాలఘనపురం: అమెరికాలోని లాస్‌ఏంజిల్స్‌లో శనివారంరాత్రి (అమెరికా కాలమానం ప్రకారం) 11 గంటలకు జరిగిన రోడ్డుప్రమాదం జనగామ జిల్లాకు చెందిన ఓ కుటుంబంలో విషాదం నింపింది. ఒకరు దుర్మరణం చెందగా, ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. లింగాల ఘనపురం మండలం బండ్లగూడెంకు చెందిన శెట్టిపల్లి రామచంద్రారెడ్డి కుటుంబం లాస్‌ఏంజిల్స్‌లో నివసిస్తోంది. రామచంద్రారెడ్డి కారులో తన భార్య రజని, కొడుకు ఆర్జిత్‌రెడ్డి, కూతురు అక్షితారెడ్డితో కలసి మిత్రుడి ఇంట్లో జరిగిన విందుకు వెళ్లారు.

తిరుగు ప్రయాణంలో ఓ ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద వీరి కారు ఆగగా, డ్రగ్స్‌ తీసుకున్న ఓ అమెరికా మహిళ కారు అతివేగంగా వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది. దీంతో వీరి కారు నుజ్జునుజ్జు కాగా, వెనుక సీట్‌లో కూర్చున్న ఆర్జిత్‌రెడ్డి (14) అక్కడికక్కడే మృతి చెందాడు. రామచంద్రారెడ్డి, రజని, అక్షితారెడ్డిలకు తీవ్రగాయాలయ్యాయి. వీరిని స్థానిక ఆస్పత్రిలో చేర్చగా, అక్షితారెడ్డి ప్రాణాపాయస్థితిలో ఉన్నట్టు కుటుంబసభ్యులు పేర్కొన్నారు. 

ఐదు నిమిషాల్లో ఇంటికి చేరుకుంటారనగా.. 
రామచంద్రారెడ్డి 20 ఏళ్ల క్రితమే యూఎస్‌ఏ వెళ్లారు. అక్కడి ఫామావైట్‌ కంపె నీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తున్నారు. ఆర్జిత్‌రెడ్డి ఎనిమిదో తరగతి, అక్షితారెడ్డి ప్లస్‌ 2 చదువుతున్నారు. ఘటనాస్థలానికి వారి ఇల్లు కొద్దిదూరంలో నే ఉంది. మరో ఐదు నిమిషాల్లో ఇంటికి చేరుకోవాల్సి ఉండగా, అంతలోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసిందని బండ్లగూడెం గ్రామస్తులు తెలిపారు.  

తాతా.. మేం ఫంక్షన్‌కు వెళ్తున్నామని చెప్పి.. 
రామచంద్రారెడ్డి కుటుంబం మిత్రుడి ఇంట్లో జరిగే ఓ ఫంక్షన్‌కు వెళ్లే ముందు అతని కూతురు అక్షితారెడ్డి జనగామలో ఉంటున్న తాత (రజిత తండ్రి) బేతి నర్సింహారెడ్డికి ఫోన్‌ చేసింది. ‘తాతా.. అమ్మనాన్న, అందరం ఇక్కడే నాన్న స్నేహితుడి కూతురు చీర కట్టించే ఫంక్షన్‌కు వెళ్తున్నాం’అని చెప్పింది. ఈ విషయం గుర్తు చేసుకుంటూ నర్సింహారెడ్డి కన్నీరుమున్నీరుగా విలపించాడు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top