సుశాంత్ అన్ని విష‌యాల్లో రియాదే నిర్ణ‌యం

Rhea Chakraborty Take Decisions For Sushant Singh Rajput : Shruti Modi - Sakshi

ఈడీ విచార‌ణ‌లో వెల్ల‌డించిన‌ శ్రుతి మోదీ

ముంబై: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్ ఆత్మ‌హ‌త్య కేసు మిస్ట‌రీని చేదించేందుకు సీబీఐ రంగంలోకి దిగిన విష‌యం తెలిసిందే. ఈ కేసులో రియా చ‌క్ర‌వ‌ర్తిని ఏ1 నిందితురాలిగా ప్ర‌క‌టించ‌గా, ఏ2గా రియా తండ్రి ఇంద్రజిత్ చక్రవర్తి, ఏ3గా తల్లి సంధ్య చక్రవర్తి, ఏ4గా సోదరుడు షోవిక్ చక్రవర్తి, ఏ5గా సుశాంత్ ఇంటి మేనేజరు శామ్యూల్ మిరిండా, ఏ6గా సుశాంత్ బిజినెస్ మాజీ మేనేజరు శ్రుతి మోదీని నిందితులుగా చేర్చింది. అటు మ‌నీలాండ‌రింగ్ కేసు ద‌ర్యాప్తులో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్(ఈడీ) ఇప్ప‌టికే రియాను రెండుసార్లు విచారించింది. ఆమె సోద‌రుడు, తండ్రిపై కూడా ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురింపింది. తాజాగా ఈడీ ఎదుట సుశాంత్ బిజినెస్‌ మాజీ మేనేజ‌ర్‌గా వ్య‌వ‌హ‌రించిన‌ శ్రుతి మోదీ రెండోసారి విచార‌ణ‌కు హాజర‌య్యారు. (సుశాంత్‌ కేసు: అసలు ఎవరీ శ్రుతి మోదీ?)

మంగ‌ళ‌వారం ముంబైలోని ఈడీ కార్యాల‌యానికి వ‌చ్చిన ఆమె సుశాంత్‌కు సంబంధించిన ఓ ఆస‌క్తిక‌ర‌ విష‌యాన్ని వెల్ల‌డించారు. అత‌నికి సంబంధించిన ప్ర‌తి విష‌యాల్లోనూ రియానే నిర్ణ‌యం తీసుకునేద‌ని తెలిపారు. సుశాంత్ సైన్ చేసే ప్రాజెక్టుల‌తో పాటు ఆర్థికప‌ర‌మైన అంశాల్లో కూడా రియానే ప్ర‌ధానంగా నిర్ణ‌యాలు తీసుకునేద‌ని పేర్కొన్నారు. కాగా సుశాంత్-రియా డేటింగ్‌లో ఉన్న స‌మ‌యంలో శ్రుతి ఆయ‌న‌కు మేనేజ‌ర్‌గా ప‌ని చేశారు. కాగా రియాతో క‌లిసి సుశాంత్ ప్రారంభించిన కంపెనీ ఐపీ చిరునామా సుశాంత్ మ‌ర‌ణానికి ఏడు రోజుల‌ ముందు మార్చిన‌ట్లు వెల్ల‌డైంది. అనంత‌రం ఆగ‌స్టు 7న కూడా మ‌రోసారి కూడా ఐపీ అడ్ర‌స్‌ను మార్చివేసిన‌ట్లు తెలిసింది. దీంతో ఈడీ అధికారులు ఇప్పుడీ కంపెనీ లెక్క‌లు తేల్చే పనిలో ప‌డ్డారు. మ‌రోవైపు ఈ కేసులో మ‌రిన్ని వివ‌రాలు రాబ‌ట్టేందుకు ఈడీ అధికారులు రియాతోపాటు, ఆమె సోద‌రుడు, తండ్రి మొబైల్ ఫోన్ల‌ను స్వాధీనం చేసుకుని కాల్ డేటాను ప‌రిశీలిస్తున్నారు. (సుశాంత్ తండ్రికి హ‌ర్యానా సీఎం పరామర్శ)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top