మంచాన పడ్డ భార్యను చూసేందుకు బైక్‌పై; 20 మీటర్లు ఎగిరి చెట్టు కొమ్మకు

Rash Driving Leads To Accident Person Lost Life Hanging To 12m Tree - Sakshi

కారు ఢీకొట్టడంతో చెట్టుపై ఎగిరిపడి యువకుడు దుర్మరణం 

ప్రమాదాలు చెప్పి రావు.. రోడ్డుపై మనం జాగ్రత్తగా వెళ్తున్నా.. అవతలి వాహనదారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే.. ఇక చెప్పేదేముంది? సోయం మాన్కు (30) విషాదాంతమే అందుకు నిదర్శనం. పుట్టింట్లో మంచాన ఉన్న భార్యను చూసేందుకు బైక్‌పై బయల్దేరిన ఈ యువకుడిని ఎదురుగా రాంగ్‌ రూట్‌లో, మితిమీరిన వేగంతో వచ్చిన కారు ఢీకొట్టింది. మాన్కు.. ఆ ధాటికి ఏకంగా 20 మీటర్ల దూరంమేర ఎగిరిపడి.. 12 అడుగుల ఎత్తయిన చెట్టు కొమ్మకు చిక్కుకుని దుర్మరణం పాలయ్యాడు. ఈ సంఘటన నిర్మల్‌ జిల్లా కడెం మండలం దోస్త్‌నగర్‌ అటవీ ప్రాంతంలోని నిర్మల్‌–మంచిర్యాల ప్రధాన రహదారిపై బుధవారం జరిగింది.  

కడెం (ఖానాపూర్‌): కారు డ్రైవర్‌ నిర్లక్ష్యం, అతివేగానికి ఓ యువకుడి ప్రాణం గాల్లో కలిసింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూర్‌ మండలం నీలగొండి (హస్నాపూర్‌)కి చెందిన సోయం మాన్కు.. కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తుంటాడు. భార్య సోయం జంగుబాయికి కాలు విరగడంతో పుట్టింటి వద్ద ఉన్న ఆమెను చూడటానికి నిర్మల్‌ జిల్లా కడెం మండలం నచ్చెన్‌ ఎల్లాపూర్‌కు బైక్‌పై బయల్దేరాడు. దోస్త్‌నగర్‌ సమీపంలోని అటవీ ప్రాంతానికి రాగానే నిర్మల్‌ నుంచి మంచిర్యాల వైపు వెళ్తున్న కారు ఎదురుగా వచ్చి వేగంగా బైకును ఢీకొట్టింది. దీంతో మాన్కు ఎగిరి పడ్డాడు.  

చెట్టుపైనే మృతదేహం.. 
కారు వేగం ధాటికి మాన్కు 20 మీటర్ల దూరం ఎగిరి.. 12 అడుగుల ఎత్తున్న చెట్టుపై పడ్డాడు. తల, కాళ్లు, చేతులు, ఛాతీకి తీవ్ర గాయాలు కావడంతో మాన్కు చెట్టుపైనే మృతి చెందాడు. చెట్టు కొమ్మకు అతడి చొక్కా చిక్కుకోవడంతో మృతదేహం వేలాడుతూ ఉంది. పోలీసులు ఘటనాస్థలానికి వచ్చి మృతదేహాన్ని చెట్టుపై నుంచి దింపి పంచనామా నిర్వహించారు. ప్రమాదంలో బైక్‌ పూర్తిగా దెబ్బతినగా, కారు నుజ్జునుజ్జయింది. కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి కాలుకు గాయమైనట్లు సమాచారం. కారు రాంగ్‌రూట్‌లో రావడంతోనే ప్రమాదం జరిగినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య జంగుబాయి, కూతురు, కుమారుడు ఉన్నారు.  
చదవండి: కడుపులో కత్తితోనే పోలీస్‌స్టేషన్‌కు పరుగు 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top