ఫిర్యాదు చేస్తే అంతు చూస్తాం | Eenadu Ramoji Rao Gang Threats To Margadarshi Victims, Making Warning Calls To Victim Community - Sakshi
Sakshi News home page

Margadarsi Chit Fund Scam: ఫిర్యాదు చేస్తే అంతు చూస్తాం

Published Wed, Feb 28 2024 5:43 AM

Ramoji gang threats to Margadarshi victims - Sakshi

‘మార్గదర్శి’ బాధితులకు రామోజీ ముఠా బెదిరింపులు

సీఐడీకి ఫిర్యాదు చేసినవారి ఇళ్లకు వెళ్లి హెచ్చరికలు

బాధితుల సంఘానికి సైతం బెదిరింపు ఫోన్‌ కాల్స్‌

అక్రమాల డొంక కదులుతుండటంతో రాజగురివింద బెంబేలు

సీఐడీ ఏర్పాటు చేసిన వాట్సాప్‌ నంబర్‌కు భారీగా బాధితుల ఫిర్యాదులు

‘మార్గదర్శి చిట్‌ఫండ్స్‌పైనే ఫిర్యాదు చేస్తారా ... మీ సంగతి తేలుస్తాం’ 
‘మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ బాధితులు.. అని సంఘం పెట్టేంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది’
‘మీ ష్యూరిటీ పత్రాలు మా దగ్గర ఉన్నాయి.. మీ ఆస్తులు వేలం వేయిస్తాం..’

ఇవీ రాజగురివింద రామోజీ­రావు ఆర్థిక అక్రమాల పుట్ట.. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ నుంచి చందాదారులకు కొన్ని నెలలుగా వస్తున్న బెదిరింపులు. నేరుగా చందాదారుల ఇళ్లకే వచ్చి బెదిరిస్తుండటంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. మరికొందరికి రామోజీ ముఠా ఫోన్లు చేసి వేధిస్తోంది. కొందరిని తమ చిట్‌ఫండ్‌ కార్యాలయాలకు పిలిపించుకుని మరీ బెదిరిస్తోంది. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ అక్రమాల పుట్ట బద్దలు కావడంతో రామోజీరావు బెంబేలెత్తుతున్నారు.

దశాబ్దాల తరబడి ఆయన, ఆయన కోడలు శైలజ వేధింపులు భరించిన చందాదారులు ప్రస్తుతం ధైర్యం చేసి ఫిర్యాదులు చేస్తుండటంతో రామోజీ ముఠా బెదిరింపుల పర్వానికి బరితెగించింది. దీంతో చందాదారుల భద్రతే లక్ష్యంగా ఫిర్యాదులు చేసేందుకు సీఐడీ ప్రత్యేక వాట్సాప్‌ నంబరును అందుబాటులోకి తెచ్చింది. తాజాగా కొందరు చందాదారులు ‘మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ బాధితుల సంఘాన్ని’ ఏర్పాటు చేసి రిజిస్టర్‌ చేయించడంతో ఈ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. 

ధైర్యంగా బాధితుల ముందడుగు.. 
మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ కేసును విచారిస్తున్న సీఐడీ.. బాధితులు ఫిర్యాదు చేసేందుకు 94931 74065తో వాట్సాప్‌ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ వాట్సాప్‌ నంబరుకు ఇప్పటికే వేల సంఖ్యలో చందాదారులు ఫిర్యాదులు చేశారు. తమ అనుమతి లేకుండా చిట్టీలు పాడటం, చిట్‌ పాడుకున్న నగదు ఇవ్వకుండా రశీదు డిపాజిట్లుగా జమ చేయడం, ష్యూరిటీలు ఇచ్చినా తిరస్కరించి వేధించడం, తమ సంతకాలు ఫోర్జరీ చేయడం వంటి అక్రమాలపై బాధితులు ఆధారాలతో సహా ఫిర్యాదులు చేస్తున్నారు. వీటిని సీఐడీ ప్రత్యేక విభాగం నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది.

వేధింపులకు పాల్పడ్డ పలువురు మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ బ్రాంచ్‌ మేనేజర్లు, ఇతర సిబ్బందిని సీఐడీ విచారిస్తుండటంతో రామోజీ బెంబేలెత్తుతున్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం, సీఐడీ కార్యాచరణతో చందాదారులు ధైర్యంగా ముందుకు వస్తున్నారు. విజయవాడ కేంద్రంగా మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ బాధితుల సంఘాన్ని ఏర్పాటు చేశారు. బాధితులు తమ సమస్యలను చెప్పుకునేందుకు ప్రత్యేకంగా 99481 14455 ఫోన్‌ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చారు.

దీంతో కేవలం మూడు రోజుల్లోనే వందల సంఖ్యలో బాధితులు ఈ సంఘాన్ని సంప్రదించి తమ గోడు వెళ్లబోసుకున్నారు. అందరి ఫిర్యాదులను నమోదు చేస్తూ అటు సీఐడీ ద్వారా, ఇటు న్యాయపరంగా చర్యలు తీసుకునేందుకు ఆ సంఘం సన్నద్ధమవుతోంది. 

బాధితులపై మార్గదర్శి వేధింపుల పర్వం
మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ఆర్థిక అక్రమాల పుట్ట బద్దలు కావడంతో రామోజీరావు హడలిపోతున్నారు. సీఐడీ అధికారులు కేసు నమోదు చేయడం, ఏకంగా తన ఇంటికే వచ్చి మరీ విచారించడంతో ఆయన బెంబేలెత్తుతున్నారు. ఇవి చాలవన్నట్టు ఇప్పుడు బాధితులు కూడా దూకుడు పెంచడంతో ఏక్షణం ఏం జరుగుతుందోనని రామోజీ బేజారెత్తుతు­న్నారు. దీంతో కేసు దర్యాప్తును ప్రభావితం చేసేందుకు తన ముఠాలను ఆయన రంగంలోకి దించారు.

సీఐడీ అధికారులు, బాధితుల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నవారిని లక్ష్యంగా చేసుకుని వారికి ఫోన్లు చేసి రామోజీ ముఠా వేధిస్తోంది. సీఐడీకి ఫిర్యాదు చేసిన చందాదారులను మొదట లక్ష్యంగా చేసుకుంది. సీఐడీ దర్యాప్తునకు సహకరించవద్దని వారిని బెదిరిస్తోంది. ఏకంగా మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ఎండీ శైలజ కిరణ్‌ ఆఫీసు నుంచే చందాదారులకు ఫోన్లు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతుండటం గమనార్హం.

రామోజీ కోడలు శైలజ కిరణ్‌ పీఏ శశికళ, మార్గదర్శి బ్రాంచ్‌ మేనేజర్లు స్వయంగా ఫోన్లు చేసి మరీ బెదిరిస్తుండటం ఆ సంస్థ దిగజారుడుతనానికి నిదర్శనం. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ బాధితుల సంఘం అందుబాటులోకి తెచ్చిన ఫోన్‌ నంబరుకు కూడా ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. ‘అసలు సంఘాన్ని ఎందుకు ఏర్పాటు చేశారు.. మీ వెనుక ఎవరు ఉన్నారు.. ఎవరున్నాసరే మిమ్మల్ని కాపాడలేరు.. మీ సంగతి చూస్తాం.. అంతు తేలుస్తాం’ అంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు.  – సాక్షి, అమరావతి

న్యాయపోరాటానికి బాధితులు సిద్ధం..
మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ సిబ్బంది కాల్‌మనీ రాకెట్‌ గూండాల మాదిరిగా చందాదారుల ఇళ్లపై పడుతున్నారు. వారి ఇళ్లకు వెళ్లి మరీ బెదిరిస్తున్నారు. ప్రధానంగా ప్రైవేటు వ్యక్తులకే తెలియకుండా తాము ఘోస్ట్‌ చందాదారులుగా నమోదు చేసిన వారి ఇళ్లకు వెళ్లి దౌర్జన్యం చేస్తున్నారు. అసలు మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో తాము చందాదారులుగా చేరిన విషయమే తమకు తెలియదనివారు ఎంతగా చెబుతున్నా వినిపించుకోవడం లేదు.

‘సీఐడీ అధికారులు అడిగితే మీరే చందాదారులుగా చేరారని చెప్పండి.. మీకు ఇబ్బందిరాకుండా చూస్తాం.. అంతేగానీ తెలియదని చెబితే మాత్రం మీరు మాకు భారీగా బకాయిలు ఉన్నారని కోర్టులో కేసులు వేస్తాం’ అని హడలెత్తిస్తున్నారు. దాంతో తమకు తెలియకుండానే తమ పేరుతో మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ సాగిస్తున్న ఆర్థిక అవకతవకలపై వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇక చందాదారుల కోసం ష్యూరిటీ సంతకాలు చేసిన వారి ఇళ్లకు మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ సిబ్బంది వెళ్లి వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు.

‘మీరు ఇచ్చిన ఖాళీ చెక్కులు మా వద్ద ఉన్నాయి.. వాటిపై భారీ మొత్తం రాసి బ్యాంకులో జమ చేసి బౌన్స్‌ అయ్యేలా చేస్తాం. తరువాత కేసు పెట్టి అరెస్ట్‌ చేయిస్తాం’ అని కొందరిని బెదిరించడంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మరికొందరు చందాదారుల ఇళ్లకు వెళ్లి ‘మీరు భారీగా బకాయి పడ్డారు...అందుకు ప్రతిగా మీ ఇళ్లు, ఆస్తులు వేలం వేయిస్తాం’ అని వేధింపులకు దిగారు. చందాదారుల తరపున మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ సిబ్బందే ఫోర్జరీ సంతకాలు చేసేసి.. తిరిగి చందాదారులపైనే ఫోర్జరీ కేసు పెడతామని బెదిరిస్తున్నారు.

ఈ పరిణామాలతో మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ చందాదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఏర్పాటు చేసిన మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ బాధితుల సంఘం ద్వారా అటు సీఐడీని ఆశ్రయించడంతోపాటు మరోవైపు న్యాయపోరాటం చేసేందుకు ఉద్యుక్తమవు­తున్నారు. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో కీలక పరిణామాలు సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

Advertisement
 
Advertisement