అప్పులు తీర్చేందుకు దొంగయ్యాడు!

Police Chase Wine Shop Loot Case In Chittoor - Sakshi

మద్యం దుకాణం చోరీ కేసు ఛేదన

సేల్స్‌ మెన్, అతని స్నేహితుడిని అరెస్ట్‌ చేసిన పోలీసులు

క్యాష్‌ చెస్ట్‌ లాకర్‌ సహా రూ.8,99,720 లక్షలు రికవరీ

సాక్షి, మదనపల్లె టౌన్‌: మద్యం షాపులో చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఆ షాపులో పనిచేసే సేల్స్‌మెన్‌ ఈ చోరీకి పాల్పడినట్లు తేలింది. మదనపల్లె–పుంగనూరు రోడ్డులోని ప్రభుత్వ మద్యం దుకాణం (దినేష్‌ వైన్స్‌)లో ఈ నెల 28న అర్ధరాత్రి దొంగలు చోరీకి పాల్పడటం విదితమే. కేసు నమోదు అనంతరం సీఐ శ్రీనివాసులు, ఎస్‌ఐ దిలీప్‌కుమార్, క్లూస్‌ టీం బృందం సేకరించిన ఆధారాలతో ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేసినట్లు బుధవారం డీఎస్పీ రవిమనోహరాచారి స్థానిక రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో విలేకరులకు వెల్లడించిన వివరాలు..మద్యం షాపు చోరీ కేసులో ఆరోగ్యవరం తురకపల్లెకు చెందిన పి.సుజిత్‌(23) ప్రధాన నిందితుడు అని తేలింది.

ఇతడు మద్యం షాపులో సేల్స్‌మెన్‌గా పనిచేస్తూ చోరీకి స్కెచ్‌ వేశాడు. నాలుగు రోజులుగా బ్యాంకులో మద్యం షాపు సొమ్మును జమ చేయకపోవడంతో దీనిని చోరీ చేసి అప్పులు తీర్చాలని తలపోశాడు. అదే ఊరులో ఉంటున్న తన స్నేహితుడు ఎస్‌. అబ్దుల్‌ కలాం అలియాస్‌ రంజాని(20) సహకారం తీసుకున్నాడు. ఇద్దరూ కలిసి 28న రాత్రి మద్యం షాపు తాళాలు చాకచక్యంగా తెరచి క్యాష్‌ చెస్ట్‌లాకర్‌తో పాటు రూ.8,99,720 లక్షల నగదును చోరీ చేశారు. ఆ తర్వాత లాకర్‌ను మాత్రం తురకపల్లె సమీపంలోని ఓ వ్యవసాయ బావిలో పడేశారు. చోరీ సొమ్ముతో అప్పులు తీర్చడానికి రుణదాతల వద్దకు వెళ్తుండగా స్థానిక సీటీఎం రోడ్డులోని తట్టివారిపల్లె జంక్షన్‌లో వారిని సీఐ, ఎస్‌ఐల బృందం మంగళవారం ఉదయం అరెస్ట్‌ చేసింది. కేసును ఛేదించిన సిబ్బందికి డీఎస్పీ రివార్డులు ప్రకటించారు.

నాన్న కోసం..! 
ఆరోగ్యవరం తురకపల్లెకు చెందిన ప్రశాంత్‌ బాబుకు ఏకైక కుమారుడు పి.సుజిత్‌. డిగ్రీ వరకు చదివాడు. ప్రశాంత్‌బాబు అనారోగ్యం బారిన పడడంతో చేసిన వైద్యపరీక్షల్లో గుండె వాల్వులు చెడిపోయాయని తేలింది. దీంతో డాక్టర్లు గుండెకు స్టంట్‌ ఏర్పాటు చేశారు. సుజిత్‌ చేసిన అప్పులకు తోడు తన తండ్రి గుండె ఆపరేషన్‌కు చేసిన అప్పులు తీర్చడం భారమయ్యాయి. ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కెందుకు ప్రభుత్వ మద్యం దుకాణంలో సేల్స్‌మెన్‌ ఉద్యోగం పొందాడు. వచ్చే జీతంతో అప్పులు తీర్చలే క, మద్యం దుకాణం సొమ్ముపై కన్నేశాడు. చోరీకి స్కెచ్‌ వేసి, చివరకు అరెస్టయి, తన స్నేహితుడిని కూడా కటకటాల పాల్జేశాడు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top