రాజన్న కోడెలు పక్కదారి!

Police bust Illegal Cows Transport in Station Ghanpur - Sakshi

ఇతర గోశాలల నిర్వాహకులు కొందరు అమ్ముకుంటున్నారనే ఆరోపణలు

అసలు గోశాలలే లేకుండా ఫెడరేషన్‌ లేఖతో తీసుకెళ్తున్నారనే అనుమానాలు

స్టేషన్‌ఘన్‌పూర్‌లో 24 కోడెలతో పట్టుబడిన వ్యాన్‌

‘శ్రీ సోమేశ్వర గోసంరక్షణ’ పేరిట అసలు గోశాలే లేదని తేలిన వైనం

వేములవాడ అర్బన్‌: వేములవాడ రాజన్న కోడెలు పక్కదారి పడుతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజన్న భక్తులు శివుడికి అత్యంత భక్తి శ్రద్ధలతో కోడెలను, ఆవులను అందజేస్తుంటారు. తమ కోరికలు నెరవేరితే కోడెమొక్కు చెల్లించుకుంటామని మొక్కుకున్న భక్తులు పలువురు కోడెలను ఆలయ గోశాలకు అప్పగిస్తుంటారు. ప్రధానంగా రైతులు తమ ఇంట్లో శుభకార్యాలు జరిగితే కోడెను తీసుకొచ్చి రాజన్న ఆలయానికి అప్పగించడం అనాదిగా జరుగుతోంది.

అయితే ఈ కోడెలు, ఆవుల పోషణ ఇబ్బందిగా మారడంతో ఆలయ అధికారులు ఇటీవల వివిధ ప్రాంతాల్లోని ఇతర గోశాలల నిర్వాహకులకు కొన్ని కోడెలు, ఆవులను అందజేస్తున్నారు. వారు వాటిని పోషించడం లేదా రైతులకు అందజేయాల్సి ఉండగా.. కొందరు నిర్వాహకులు ఇతరులకు విక్రయిస్తున్నారని ఆరోపణలు విన్పిస్తున్నాయి. అలాగే అసలు లేని గోశాలల పేరిట కూడా కొందరు కోడెలు తీసుకెళ్తున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల స్టేషన్‌ఘన్‌పూర్‌లో కోడెలతో వెళ్తున్న వ్యాన్‌ పట్టుబడడం, వారు చెప్పిన గోశాల అసలు లేనట్లు తేలడం ఈ అనుమానాలను బలపరుస్తోంది.

పోషణ భారం తగ్గించుకునేందుకు..
వేములవాడ రాజన్న ఆలయ గోశాలలు స్థానిక తిప్పాపూర్‌లో ఒకటి, గుడిచెరువు కట్టకింద ఒకటి ఉన్నాయి. తిప్పాపూర్‌ గోశాలలో సుమారు 150 కోడెలు, వేములవాడ కట్టకింద గోశాలలో 150 కోడెలు, ఆవులు ఉన్నాయి. వేములవాడ కట్టకింద గోశాలలోని కోడెలను ఆలయంలో కోడె మొక్కుల కోసం తీసుకెళ్తుంటారు. ఆవులను స్వామి వారి పూజకు ఉపయోగపడే పాల కోసం వినియోగిస్తున్నారు.

తిప్పాపూర్‌ గోశాలలో భక్తులు అప్పగించిన కోడెలు ఉంటాయి. ఇక్కడి కోడెలు ఎక్కువైనప్పుడు నిర్వహణ భారం తగ్గించుకునేందుకు ఇతర గోశాలలకు అప్పగిస్తున్నారు. గతంలో ఈ ప్రాంతంలో భూమి పట్టా పాస్‌బుక్కు ఉన్న రైతులకు పెంచుకునేందుకు ఉచితంగా అందజేసేవారు. తర్వాత కాలంలో వేలం ద్వారా రైతులకే అమ్మేవారు. అయితే 2012 నుంచి తెలంగాణ గోశాల ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో లేఖ తెచ్చుకున్నవారికి ఉచితంగా ఇస్తున్నారు.

అధికారుల పర్యవేక్షణ లోపంతో..
ఈనెల 2న తిప్పాపూర్‌ గోశాలలోని 20 కోడెలను ఫెడరేషన్‌ లేఖ తెచ్చుకున్న మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు మండలం దుబ్బాతండాలోని శ్రీ సోమేశ్వర గోసంరక్షణ సేవా సంఘానికి అందజేశారు. ఈ కోడెలతో బయలుదేరిన వ్యాన్‌ను జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో బజరంగ్‌దళ్‌ కార్యకర్తలు అడ్డుకుని తనిఖీ చేశారు. 20 కోడెలు ఉండాల్సి ఉండగా 24 కనిపించడంతో అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు.

విచారణలో దుబ్బాతండాలో ఈ పేరుతో గోశాల లేదని తేలింది. దీంతో ఈ వ్యాన్‌ను నేరుగా స్టేషన్‌ఘన్‌పూర్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించి సీజ్‌ చేశారు. ముగ్గురిపై కేసు నమోదు చేశారు. కోడెలను ధర్మసాగర్‌ మండలంలోని గోశాలకు తరలించారు. గోశాల ఫెడరేషన్‌ సూచించిన గోశాలలకు కోడెలను అప్పగిస్తున్న అధికారులు.. ఈ కోడెలు గోశాలలకు వెళ్తున్నాయా.. లేదా? అని  పరిశీలించకపోవడంపై భక్తులు, స్థానికుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

అక్రమాలపై విచారణ చేపట్టాలి
రాజన్న ఆలయ కోడెలను ఈ ప్రాంత రైతులకు అప్పగించాలని మేము ఎప్పటి నుంచో కోరుతున్నాం. కోడెల అప్పగింతలో అక్రమాలపై అధికారులు విచారణ చేపట్టాలి. హిందువుల మనోభావాలను కాపాడాలి. – గడప కిశోర్, విశ్వహిందూ పరిషత్‌ జిల్లా సహాయ కార్యదర్శి

ఫెడరేషన్‌ లెటర్‌ మేరకే ఇచ్చాం
ఎప్పటిలాగానే తెలంగాణ గోశాల ఫెడరేషన్‌ నుంచి వచ్చిన లేఖ మేరకే కోడెలను అందించాం. కానీ అక్కడ గోశాల ఉందో.. లేదో మాకు తెలి యదు. ఈ విషయం ఫెడరేషన్‌ వారు చూసుకోవాలి.    – శ్రీనివాస్, రాజన్న ఆలయ ఏఈవో

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top