మొదట తక్కువ ధరకు అమ్ముతారు.. బానిసగా మారిన తర్వాత..

Police Arrest Drug Peddlers In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరానికి చెందిన ముగ్గురు స్నేహితులు డ్రగ్స్‌ దందాను ‘వ్యూహాత్మకంగా’ నిర్వహించారు. తాము విక్రయించే హష్‌ ఆయిల్‌కు ఎదుటి వారు బానిసలయ్యే వరకు తక్కువ రేటుకు అమ్మారు. ఇది తీసుకోకుండా ఉండలేని స్థితికి వాళ్లు చేరిన తర్వాత భారీ మొత్తానికి విక్రయించడం మొదలెట్టారు. వీరి వ్యవహారాలపై సమాచారం అందుకున్న దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సోమవారం రాత్రి దాడి చేశారు. ఇద్దరిని పట్టుకుని వీరి నుంచి హష్‌ ఆయిల్‌తో కూడిన 25 చిన్న డబ్బాలు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ చక్రవర్తి గుమ్మి మంగళవారం వెల్లడించారు. 

దందా అంతా ఓ ప్లాన్‌ ప్రకారం
► బోరబండ పద్మావతి నగర్‌కు చెందిన మహ్మద్‌ మహబూబ్‌ అలీకి ఘరానా నేరచరిత్ర ఉంది. గతంలో కొందరిపై కాల్పులు జరపడంతో ఇతడికి షూటర్‌ ఎజాజ్‌ అనే పేరూ వచ్చింది. ఇతగాడిపై విజయవాడలోనూ కేసు ఉంది. దాని విచారణ కోసం నిత్యం అక్కడి కోర్టుకు వెళ్లేవాడు. అక్కడే ఇతడికి అరకు ఏజెన్సీ ప్రాంతానికి చెందిన వ్యక్తితో పరిచయమైంది. అతడు ఇచ్చిన సమాచారంతో గంజాయి, దాని నుంచి తీసే హష్‌ ఆయిల్‌ ఏజెన్సీలో దొరుకుతాయని తెలిసింది.  
► ఇతడి స్నేహితులైన బోరబండ వాసి మహ్మద్‌ ఇబ్రహీం ఖాన్, యూసుఫ్‌గూడ వాసి మహ్మద్‌ ఖాజా ముబీనుద్దీన్‌తో కలిసి వీటిని తీసుకువచ్చి వినియోగించేవాడు. ఆపై తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం ఈ ముగ్గురూ వాటి దందా మొదలెట్టారు. 
► వ్యక్తిగత వాహనాలు లేదా పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌లో అక్కడకు వెళ్లే ఈ త్రయం హష్‌ ఆయిల్‌ను ఖరీదు చేసి తీసుకువస్తోంది. అక్కడ 5 ఎంఎల్‌ రూ.వెయ్యికి కొని.. నగరంలో రూ.2,500 వరకు విక్రయిస్తోంది. ఒక్కోసారి రూ.5 వేలకు అమ్ముతోంది. తమ వద్దకు కొత్తగా వచ్చిన కస్టమర్‌కు వీళ్లు హష్‌ ఆయిల్‌ను తక్కువ రేటుకు అమ్ముతారు. అలవాటు పెరిగి అతడు దీనికి బానిసగా మారిన తర్వాత హఠాత్తుగా ఎక్కువ మొత్తానికి విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటారు.  
► భారీస్థాయిలో ఈ దందా చేస్తుండటంతో హైదరాబాద్, సైబరాబాద్‌ పరిధుల్లో నివసించే అనేక మంది డ్రగ్స్‌ వినియోగదారులకు వీరి పేర్ల సుపరిచితంగా మారాయి. దీంతో యథేచ్ఛగా హష్‌ ఆయిల్‌ విక్రయాలు చేస్తున్నారు. దీనిపై సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌.రాఘవేంద్రకు సమాచారం అందింది. ఆయన నేతృత్వంలో ఎస్సైలు ఎన్‌.శ్రీశైలం, వి.నరేందర్, మహ్మద్‌ థకియుద్దీన్, కె.చంద్రమోహన్‌ సోమవారం వలపన్నారు. 
► ఇబ్రహీం ఖాన్, ఖాజా చిక్కగా.. షూటర్‌ ఎజాజ్‌ పరారయ్యాడు. చిక్కిన ద్వయంతో పాటు వీరి నుంచి స్వాధీనం చేసుకున్న హష్‌ ఆయిల్‌ను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఎస్సార్‌ నగర్‌ ఠాణాకు అప్పగించారు. 

చదవండి: ఇద్దరితో యువకుడి ప్రేమ.. వధువు కోసం లాటరీ!

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top