పింఛన్‌ తొలగించారని.. దివ్యాంగుడి ఆత్మహత్యాయత్నం | Sakshi
Sakshi News home page

పింఛన్‌ తొలగించారని.. దివ్యాంగుడి ఆత్మహత్యాయత్నం

Published Tue, Dec 6 2022 3:05 AM

People worry and Committing Suicide For many collectorates Telangana - Sakshi

సాక్షి, యాదాద్రి/ కొండపాక(గజ్వేల్‌)/ సాక్షి, రంగారెడ్డిజిల్లా /మంచిర్యాల అగ్రికల్చర్‌: పింఛన్లు, డబుల్‌ బెడ్రూం ఇళ్లు, ఇతర పథకాలు అందడం లేదంటూ.. అధికారులు ఇబ్బందిపెడుతున్నారంటూ.. బాధితులు ఆందోళనకు దిగుతున్నారు. తమ బాధలు చెప్పుకొనేందుకు కలెక్టరేట్లలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాలకు వస్తున్నారు. తమ సమస్య ఎప్పుడు తీరుతుందోననే మనస్తాపంతో ఆత్మహత్యా యత్నాలు చేస్తున్నారు. సోమవారం పలు జిల్లా కలెక్టరేట్లలో నలుగురు ఇలాంటి ప్రయత్నాలు చేయడం కలకలం రేపింది. 

పింఛన్‌ తొలగించారంటూ.. దివ్యాంగుడు..
యాదాద్రి భువనగిరి జిల్లా హన్మాపురం గ్రామానికి చెందిన నాగపురి యాదగిరికి ఆగస్టులో ప్రభుత్వం వికలాంగుల పింఛన్‌ మంజూరు చేసింది. ఒక నెల పింఛన్‌ తీసుకున్న యాదగిరికి తర్వాతి నెలలోనే ఆపేశారు. తాను కృత్రిమకాలుతో నడుస్తున్నానని, భార్య కూలి పనిచేసి పోషిస్తోందని, తనకు పింఛన్‌ పునరుద్ధరించి ఆదుకోవాలని అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు.

ఈ క్రమంలోనే యాదగిరి సోమవారం కలెక్టర్‌లో ప్రజావాణి కార్యక్రమానికి వచ్చాడు. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పింఛన్‌ పునరుద్ధరించడం లేదంటూ వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ ఒంటిపై పోసుకుని నిప్పంటించుకోబోయాడు. ఇది గమనించిన కలెక్టర్‌ సీసీ సోమేశ్వర్, సిబ్బంది ఆయనను ఆపారు. ఆస్పత్రికి తరలించి, చికిత్స చేయించిన అనంతరం యాదగిరికి కౌన్సెలింగ్‌ చేసి ఇంటికి పంపించారు. అయితే యాదగిరి కుమారుడికి ట్రాక్టర్‌ ఉండటంతో పింఛన్‌ తొలగించినట్టు అధికారులు చెప్తున్నారు.

భూమిని తమకు కాకుండా చేస్తున్నారంటూ.. మహిళ
అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం కవాడిపల్లికి చెందిన బి.జయశ్రీ తండ్రి సుర్వి భిక్షపతికి ఇదే రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్‌ 67లో 1.35 ఎకరాల భూమి ఉంది. ఆయన భూమిని ముగ్గురు కుమార్తెలకు రిజిస్ట్రేషన్‌ చేశారు. అయితే తమ భూమిపై రెండు రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు కన్నేశాయని.. తాము విక్రయించబోమని చెప్తున్నా తహసీల్దార్‌ అనితారెడ్డితో కలిసి తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నాయని జయశ్రీ అనే మహిళా రైతు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ ఎదుట ఆందోళనకు దిగారు.

ధరణి పోర్టల్‌లో భూమి వివరాలు మార్చి కాజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. తహసీల్దార్‌ అనితారెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ బ్లేడుతో చేతులు కోసుకున్నారు. అక్కడే ఉన్న పోలీసులు, కాంగ్రెస్‌ నేతలు ఆమెను అడ్డుకుని.. అదనపు కలెక్టర్‌ వద్దకు తీసుకెళ్లారు. ఈ అంశాన్ని పరిశీలించి, న్యాయం చేస్తామని అదనపు కలెక్టర్‌ తిరుపతిరావు హామీ ఇచ్చారు.

దుకాణం ఖాళీ చేయాలని వేధిస్తున్నారంటూ.. యువకుడు
మంచిర్యాల అగ్రికల్చర్‌: అద్దె దుకాణం తొలగించొద్దని మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రొయ్యలపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి సంతోష్‌ సోమవారం మంచిర్యాల కలెక్టరేట్‌ ఎదుట ఆత్మహత్యాయత్నం చేశాడు. ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకునే క్రమంలో అక్కడే ఉన్న పోలీసులు అప్రమత్తమై అతడిపై నీళ్లు పోశారు. బాధితుడి వివరాల ప్రకారం.. చెన్నూర్‌ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలోని దుకాణ సముదాయంలో ఓ షటర్‌ను పదేళ్లుగా అద్దెకు తీసుకుని టైర్ల దుకాణం నిర్వహిస్తున్నాడు.

దుకాణం తొలగించాలని మూడు నెలల క్రితం ఎంపీడీవో, ఎంపీపీలు షటర్‌కు తాళం వేయించారు. ఎంపీ, ఎమ్మెల్యేకు గోడు వినిపించినా ఫలితం లేకపోయిందని పేర్కొన్నాడు. సోమవారం సాయంత్రానికి ఖాళీ చేయాలని చెప్పడంతో కలెక్టరేట్‌కు వచ్చానని తెలిపాడు. ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేయగా పోలీసులు నీళ్లు చల్లి అడ్డుకున్నారు. అదుపులోకి తీసుకుని ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం పోలీసు స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేశారు.
సంతోష్‌పై నీళ్లు పోస్తున్న పోలీసులు   

ఇల్లు మంజూరైన అడ్డుకుంటున్నారని ఆత్మహత్య 
పురుగుల మందు తాగుతూ సెల్ఫీ వీడియో
సిద్దిపేట జిల్లాలో కలకలం 
కొండపాక(గజ్వేల్‌): డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల అర్హుల జాబితాలో పేరు వచ్చాక కూడా కేటాయించకుండా అడ్డుకుంటున్నారని మనస్థాపానికి గురైన ఆటో డ్రైవర్‌ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని కలెక్టరెట్‌ కార్యాలయం ఆవరణలో సోమవారం చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట పట్టణంలోని గణేశ్‌ నగర్‌లో నివాసం ఉంటున్న శీలసాగరం రమేశ్‌ ఆటో డ్రైవర్‌. పట్టణ శివారులో నిర్మించిన డబుల్‌ ఇల్లు కోసం భార్య లత పేరిట దరఖాస్తు చేసుకున్నాడు.

మూడు పర్యాయాలు లబ్ధిదారుల జాబితాలో లత పేరు వచ్చింది. అయినా ఇల్లును కేటాయించలేదు. ఈ విషయమై పలుమార్లు అధికారులను అడిగినా ఫలితం లేకుండాపోయింది. దీంతో సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు. అర్హుల జాబితాలో పేరు ఉన్నా.. 26వ వార్డు కౌన్సిలర్‌ ప్రవీణ్‌ ఇల్లు రాకుండా అడ్డుకుంటున్నారంటూ ఆరోపణలు చేస్తూ పురుగుల మందు తాగుతున్న సెల్ఫీ వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. ఈ క్రమంలోనే కలెక్టరెట్‌ ఆవరణలో ఉన్న వాహనాల పార్కింగ్‌ వద్ద పడిపోయాడు.

వెంటనే అక్కడున్న స్థానికులు 108 అంబులెన్స్‌ సిబ్బంది మహేందర్, శ్రీనివాస్‌కు సమాచారం అందించారు. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని అపస్మారక స్థితిలో ఉన్న రమేశ్‌ను అంబులెన్సులో సిద్దిపేటలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడని అంబులెన్సు సిబ్బంది మహేందర్‌ తెలిపారు. మృతుడి భార్య లత ఇల్లు మంజూరైనా పట్టా ఇవ్వకుండా కౌన్సిలర్‌ ప్రవీణ్‌ అడ్డుకుంటుడటంతో డబ్బులు కూడా ఇచ్చామని ఆరోపించింది. తన భర్త మరణానికి కారణమైన వారిని అరెస్ట్‌ చేయాలని కన్నీరుమున్నీరుగా విలపిస్తూ వేడుకుంది. ఈ విషయమై ఎలాంటి ఫిర్యాదు అందలేదని సీఐ భాను ప్రకాష్‌ తెలిపారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement