నీటి తొట్టిలో 12 రోజుల పసికందు మృతదేహం, అసలు ఏం జరిగింది..?

New Born Baby Found Dead In Water Tank Suspiciously In Eluru Town - Sakshi

నీళ్ల తొట్టిలో విగతజీవిగా తేలిన 12 రోజుల పసికందు  

ఏలూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఘటన    

ఏలూరు టౌన్‌: ఓ ప్రైవేట్‌ ఆస్ప్రతిలో చికిత్స కోసం వచ్చి, అమ్మ ఒడిలో ఉండాల్సిన ఓ పసికందు.. అదే ఆస్పత్రి ఆవరణలో ఓ నీళ్ల తొట్టెలో అనుమానాస్పద స్థితిలో నిర్జీవంగా పడి ఉంది. ఏలూరు నగరంలోని సాయి చిల్డ్రన్‌ హాస్పిటల్‌లో బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. కృష్ణాజిల్లా బాపులపాడు మండలం రేమల్లికి చెందిన కలపాల నాగేశ్వరరావు కుమారుడు హరికృష్ణకు ఆరేళ్ల క్రితం చాట్రాయి మండలానికి చెందిన సీతామహాలక్ష్మితో వివాహమైంది. ఇద్దరూ వ్యవసాయ పనులు చేస్తుంటారు. సీతామహాలక్ష్మి ఏలూరులోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో జూలై 30న ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉండడంతో డిశ్చార్జ్‌ చేశారు.

అయితే బిడ్డకు అనారోగ్యంగా ఉండటంతో ఈనెల 8న ఏలూరు శంకరమఠం వీధిలోని సాయి చిల్ట్రన్‌ హాస్పిటల్‌లో చేర్పించారు. చిన్నారికి గొంతులో ఇన్‌ఫెక్షన్‌ ఉండడంతో ఈఎన్‌టీ వైద్యునితో చికిత్స చేయించారు. పరిస్థితి మెరుగుపడటంతో బుధవారం డిశ్చార్జ్‌ చేస్తామని చెప్పారు. హాస్పిటల్‌లో సీతామహాలక్ష్మి, ఆమె తల్లి, భర్త హరికృష్ణ ఉన్నారు. హరికృష్ణ తండ్రి నాగేశ్వరరావు రేమల్లి నుంచి బస్సులో ఏలూరు ఫైర్‌స్టేషన్‌ సెంటర్‌లో దిగి కుమారుడికి ఫోన్‌ చేసి చెప్పగా బుధవారం మధ్యాహ్నం 3.15 గంటలకు హరికృష్ణ వెళ్లి తండ్రిని హాస్పిటల్‌కు తీసుకువచ్చాడు.

అయితే అప్పటికే పసిబిడ్డ కనిపించటంలేదని సీతామహాలక్ష్మి భర్తకు చెప్పడంతో ఆందోళనకు గురైన హరికృష్ణ, అతని తండ్రి గాలించగా హాస్పిటల్‌ ఆవరణలోని నీటితొట్టెలో పసికందు మృతదేహం కనిపించింది. దీనిపై పోలీసులకు సమాచారం ఇవ్వటంతో డీఎస్పీ డాక్టర్‌ దిలీప్‌కిరణ్‌ పర్యవేక్షణలో టూటౌన్‌ సీఐ బోనం ఆదిప్రసాద్, ఎస్‌ఐ నాగబాబు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసుల విచారణలో హరికృష్ణ తండ్రిని తీసుకురావడానికి వెళ్లిన సమయంలో తాను బాత్‌రూమ్‌కి వెళ్లానని సీతామహాలక్ష్మి చెప్పగా, ఆమె తల్లి తాను హాస్పిటల్‌ పైకి వెళ్లానని చెప్పినట్లు తెలిసింది.    

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top