ఆ ఇంట అన్నీ విషాదాలే.. ఆరు నెలల్లో నలుగురు మృతి

Nagar Kurnool: In Last Six Months Four Of A Family Lost Life - Sakshi

ఎదురెదురుగా 2 బైక్‌లు ఢీ

తండ్రి, కొడుకు దుర్మరణం

మరో ఇద్దరి పరిస్థితి విషమం

ఆరు నెలల్లో నలుగురిని కోల్పోయిన కుటుంబం   

సాక్షి, నాగర్‌కర్నూల్‌: ఆ ఇంట అన్నీ విషాదాలే. ఆరు నెలల క్రితం అన్న, ఐదు నెలల క్రితం చిన్నారి, నేడు తండ్రి, కొడుకుల మరణం.. ఇలా ఆ కుటుంబంలో నలుగురు మగవారు అందులో ముగ్గురు ఇంటికి పెద్దదిక్కుగా ఉండగా మృత్యువాత పడటం గ్రామస్తులను కలిచివేసింది. వివరాల్లోకి వెళితే.. నాగర్‌కర్నూల్‌ జిల్లా బిజినేపల్లి మండలంలోని వట్టెం గ్రామానికి చెందిన సరళమ్మ, చిన్నబాలయ్యగౌడ్‌ (60) దంపతులకు దివ్యాంగుడు బాలరాజ్‌ (40), శివకుమార్‌ (35) కొడుకులు ఉన్నారు. పెద్ద కుమారుడికి వివాహం కాలేదు. గద్వాల మున్సిపల్‌ కార్యాలయంలో నాలుగో తరగతి ఉద్యోగిగా పనిచేసేవాడు. అనారోగ్యంతో ఆరు నెలల క్రితమే చనిపోయాడు.


చిన్నబాలయ్యగౌడ్‌ (ఫైల్‌), శివకుమార్‌ (ఫైల్‌)    

ఈయనకు చెందిన మెడికల్‌ బిల్లులు తీసుకుని శుక్రవారం ఉదయం చిన్నబాలయ్యగౌడ్, శివకుమార్‌ బైక్‌పై గద్వాలకు బయలుదేరారు. బిజినేపల్లి పోలీస్‌స్టేషన్‌ సమీపంలోకి చేరుకోగానే మరో బైక్‌పై ఎదురుగా వస్తున్న కొటాల్‌గడ్డకు చెందిన వినోద్‌కుమార్, రాఘవేందర్‌ ఢీకొన్నారు. దీంతో తండ్రీకొడుకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటనలో తీవ్ర గాయాలపాలైన మరో ఇద్దరు యువకులను జిల్లా ఆస్పత్రికి తరలించారు. అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ విషయమై శివకుమార్‌ భార్య సంధ్య ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ వెంకటేష్‌ కేసు దర్యాప్తు జరుపుతున్నారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు.   

మృతదేహాలను పరిశీలించిన ఎమ్మెల్యే  
రోడ్డు ప్రమాదంలో చనిపోయిన చిన్నబాలయ్యగౌడ్, శివకుమార్‌ల మృతదేహాలను జిల్లా ఆస్పత్రిలోని మార్చురీలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి పరిశీలించారు. అనంతరం మృతుల కుటుంబసభ్యులను ఓదార్చి తక్షణ ఆర్థిక సహాయం కింద రూ.20 వేలు అందజేసి, కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.  

వరుస సంఘటనలతో విషాదం  
కాగా, చిన్నబాలయ్యగౌడ్‌ మనవడు ఐదు నెలల క్రితమే గుండె సంబంధిత వ్యాధితో మృతి చెందాడు. ఆరు నెలల క్రితం పెద్ద కుమారుడు, ఇప్పుడు తండ్రి, చిన్న కొడుకు మృతి చెందడంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. అలాగే సంధ్య ప్రసుతం ఏడు నెలల గర్భిణి. ఇలా వరుస సంఘటనలతో ఆరు నెలల వ్యవధిలో ఆ కుటుంబంలో నలుగురు మృత్యువాత పడటంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top