breaking news
bijinepalli
-
ఆ ఇంట అన్నీ విషాదాలే.. ఆరు నెలల్లో నలుగురు మృతి
సాక్షి, నాగర్‌కర్నూల్: ఆ ఇంట అన్నీ విషాదాలే. ఆరు నెలల క్రితం అన్న, ఐదు నెలల క్రితం చిన్నారి, నేడు తండ్రి, కొడుకుల మరణం.. ఇలా ఆ కుటుంబంలో నలుగురు మగవారు అందులో ముగ్గురు ఇంటికి పెద్దదిక్కుగా ఉండగా మృత్యువాత పడటం గ్రామస్తులను కలిచివేసింది. వివరాల్లోకి వెళితే.. నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని వట్టెం గ్రామానికి చెందిన సరళమ్మ, చిన్నబాలయ్యగౌడ్ (60) దంపతులకు దివ్యాంగుడు బాలరాజ్ (40), శివకుమార్ (35) కొడుకులు ఉన్నారు. పెద్ద కుమారుడికి వివాహం కాలేదు. గద్వాల మున్సిపల్ కార్యాలయంలో నాలుగో తరగతి ఉద్యోగిగా పనిచేసేవాడు. అనారోగ్యంతో ఆరు నెలల క్రితమే చనిపోయాడు. చిన్నబాలయ్యగౌడ్ (ఫైల్), శివకుమార్ (ఫైల్) ఈయనకు చెందిన మెడికల్ బిల్లులు తీసుకుని శుక్రవారం ఉదయం చిన్నబాలయ్యగౌడ్, శివకుమార్ బైక్‌పై గద్వాలకు బయలుదేరారు. బిజినేపల్లి పోలీస్‌స్టేషన్ సమీపంలోకి చేరుకోగానే మరో బైక్‌పై ఎదురుగా వస్తున్న కొటాల్‌గడ్డకు చెందిన వినోద్‌కుమార్, రాఘవేందర్ ఢీకొన్నారు. దీంతో తండ్రీకొడుకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటనలో తీవ్ర గాయాలపాలైన మరో ఇద్దరు యువకులను జిల్లా ఆస్పత్రికి తరలించారు. అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ విషయమై శివకుమార్ భార్య సంధ్య ఫిర్యాదు మేరకు ఎస్ఐ వెంకటేష్ కేసు దర్యాప్తు జరుపుతున్నారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. మృతదేహాలను పరిశీలించిన ఎమ్మెల్యే రోడ్డు ప్రమాదంలో చనిపోయిన చిన్నబాలయ్యగౌడ్, శివకుమార్‌ల మృతదేహాలను జిల్లా ఆస్పత్రిలోని మార్చురీలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి పరిశీలించారు. అనంతరం మృతుల కుటుంబసభ్యులను ఓదార్చి తక్షణ ఆర్థిక సహాయం కింద రూ.20 వేలు అందజేసి, కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. వరుస సంఘటనలతో విషాదం కాగా, చిన్నబాలయ్యగౌడ్ మనవడు ఐదు నెలల క్రితమే గుండె సంబంధిత వ్యాధితో మృతి చెందాడు. ఆరు నెలల క్రితం పెద్ద కుమారుడు, ఇప్పుడు తండ్రి, చిన్న కొడుకు మృతి చెందడంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. అలాగే సంధ్య ప్రసుతం ఏడు నెలల గర్భిణి. ఇలా వరుస సంఘటనలతో ఆరు నెలల వ్యవధిలో ఆ కుటుంబంలో నలుగురు మృత్యువాత పడటంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
ఇసుక డంపుల సీజ్
► తరలింపును అడ్డుకున్న అధికారులు ► 200ట్రాక్టర్ల ఇసుక డంపుల స్వాధీనం ► ఏడు ఇసుక ట్రాక్టర్లు, ఇటాచీ స్వాధీనం ► కేసు నమోదుచేసిన పోలీసులు బిజినేపల్లి (నాగర్‌కర్నూల్): నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం నందివడ్డెమాన్‌లో బీమసముద్రం చెరువు నుంచి అక్రమంగా చేపట్టిన ఇసుక తరలింపును రెవెన్యూ, పోలీసు అధికారులు సోమవారం దాడిచేసి అడ్డుకున్నారు. గ్రామ సమీపంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమీపంలోని పౌల్ట్రీఫామ్స్ వద్ద పెద్ద మొత్తంలో గుట్టుచప్పుడు కాకుండా ఇసుక డంపులను చేస్తున్న సమాచారం అందుకున్న అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రత్యక్షంగా దాడులు నిర్వహించి ఇటాచీతో పాటు ఏడు ఇసుక ట్రాక్టర్లను స్వాధీనం చేసుకొని పోలీసుస్టేషన్‌కు తరలించారు. గ్రామానికి మంజూరైన సీసీరోడ్ల నిర్మాణం కోసం ఇసుకను అనుమతులు లేకుండా పొట్టల బాబుసాగర్ తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. డంపు చేసిన 200ట్రాక్టర్ల ఇసుకను సీజ్ చేస్తున్నట్లు తహసీల్దార్ శ్రీనివాస్ తెలిపారు. ట్రాక్టర్లు, ఇటాచి సీజ్ ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ల యజమాను లు కాశమోని రవి వాహనం ఏపీ 22ఎక్స్ 2151, అస్కని పెద్ద పాండు.. టీఎస్ 06 ఈఎఫ్ 7537, కసరి చెన్నయ్య.. ఏపీ 22డబ్ల్యూ 1789, పొట్టల అమీర్‌బాబు.. ఏపీ 22 ఏఈ 4857, సంగిశెట్టి వెంకటయ్య ఏపీ 22 ఏడీ 2254, టి.చంద్రశేఖర్‌రెడ్డి.. ఏపీ 36 ఏజెడ్ 3943, ద్యావరి బాలయ్య.. టీఎస్ 06 ఈఎఫ్ 8151లతో పాటు పొట్టల బాబుసాగర్కు చెందిన ఇటాచీని సీజ్‌చేసి యజమానులపై కేసులు నమోదు చేస్తున్నట్లు ఎస్ఐ ప్రదీప్‌కుమార్ తెలిపారు. రెవెన్యూ అధికారులకు మెమోలు బీమ సముద్రం నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న విషయాన్ని గోప్యంగా ఉంచడంపై అధికారులు చర్యలు తీసుకున్నారు. వీఆర్వో వహీద్‌తో పాటు వీఆర్ఏలు నాగిరెడ్డి, నర్సింహ, యాదయ్యకు మోమోలు జారీ చేస్తున్నట్లు తహసీల్దార్ శ్రీనివాస్ తెలిపారు. -
దిగుబడులు!
–తీవ్ర వర్షాభావంతో పంటలకు నష్టం ∙–వందశాతం కోల్పోయిన మొక్కజొన్న ∙ ఆలస్యంగా వేసిన వాటికి ఈ వర్షంతో మేలు – పత్తి, ఆముదం, జొన్న పంటల్లో 20శాతం తగ్గనున్న దిగుబడి ∙–తక్కువ వర్షపాతం నమోదు కావడమే ప్రధాన కారణం –పాలెం శాస్త్రవేత్తల విశ్లేషణలో తేలిన ఫలితాలు – వ్యవసాయ అధికారులతో కలిసి పంటనష్టం వివరాల సేకరణ బిజినేపల్లి: మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా తయారైంది పాలమూరు రైతన్న పరిస్థితి. తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది పత్తిపంట తగ్గించేందుకు ‘మన తెలంగాణ –మన వ్యవసాయం’ పేరుతో పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలను నిర్వహించింది. రైతులు పత్తి సాగు చేయకుండా ప్రత్యామ్నాయం పంటలు వేసుకోవాలని అధికారులు గ్రామాల్లో సూచించారు. దీంతో రైతులు పత్తి సాగును తగ్గించి మొక్కజొన్నకు మొగ్గుచూపారు. ఈ పంట ఎట్టిపరిస్థితుల్లోనూ జిల్లా వాతావరణ పరిస్థితులకు అనుకూలమైంది కాదు. దీనికితోడు వరుణుడు కరుణించకపోవడంతో ఈ పంట సాగు చేసిన రైతులు నిండా మునిగిపోయారు. వందకు వందశాతం పంటకు నష్టం వాటిల్లింది. ఇదీ..వ్యవసాయ శాస్త్రవేత్తల పరిశీలనలో తేలిన వాస్తవం. ఈ ఏడాది ఖరీఫ్‌లో జిల్లా వ్యవసాయ అధికారులతో పాటు శాస్త్రవేత్తల సలహాలు సూచనల మేరకు పత్తిసాగు చేసే రైతులు ప్రత్యామ్నాయంగా కంది, జొన్న, సజ్జ, పెసర, ఉలువ వంటి పంటలను సాగు చేశారు. మొదట వర్షం పడడంతో అందరూ సంతోషపడారు. కానీ ఆ తర్వాత చినుకు జాడ లేదు. ఈ ఏడాది ఖరీఫ్‌లో మొత్తం జిల్లాలో మొక్కజొన్న సాధారణ సాగు 1,53,976 హెక్టార్లు కాగా, 1,98,309 హెక్టార్లలో సాగుచేశారు. అంటే 44,333 హెక్టార్ల మేర ఎక్కువ సాగు చేశారు. పత్తి 2,36,021 హెక్టార్లలో సాధారణ సాగు కాగా, 1,23,370 హెక్టార్లలో సాగుచేశారు. గత యేడాదితో పోలిస్తే పత్తి 52శాతం తగ్గింది. వీటితోపాటు జొన్న 30,170 హెక్టార్లలో, వరి 52,487, ఆముదం 41,233 హెక్టార్లతోపాటు ఇతర పంటలు కలిపి మొత్తం 7,01,437 హెక్టార్లలో సాగుచేశారు. ఇప్పటివరకు జిల్లాలో 446.8 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా 306.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణంతో పోలిస్తే –31.4శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. శాస్త్రవేత్తల పరిశీలనలో తేలినవి.. జిల్లాలోని భూములు మొక్కజొన్నకు అంతగా అనుకూలమైనవి కావు. రైతులు పెద్దఎత్తున ఈ పంటను సాగు చేయడంతో నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. కొన్నిచోట్ల భూసార పరీక్షలు చేయించుకోకుండా సాగుచేయడం. ఎరువులు వాడాల్సిన మోతాదులో వాడకపోవడం మరోకారణం. రైతులు జిల్లాకు అనువైన కంది, ఆముదం, సజ్జ, రాగి, జొన్న పంటలను వేసుకున్నట్లయితే మెట్ట పరిస్థితుల్లో దిగుబడి సాధించేవారు. శాస్త్రవేత్తల అంచనా మేరకు.. పాలెం వ్యవసాయ పరిశోధన కేంద్రంలో లెక్కించిన వర్షపాతం ఇలా ఉంది. జూన్‌లో కురవాల్సిన వర్షపాతం కంటే ఈ ఏడాది 20 నుంచి 30శాతం తగ్గింది. ఎక్కువగా జూలై నెలలో 30 నుంచి 40 శాతం, ఆగస్టు నెలలో 75 నుంచి 80శాతం వర్షపాతం తగ్గింది. మొత్తంగా 35నుంచి 40శాతం వర్షపాతం తగ్గిపోవడం, ఎండలతోపాటు, ఈదురుగాలులు కూడా తోడవడంతో మొక్కలు ఎండుదశకు చేరినట్లు శాస్త్రవేత్తలు అంచనాకు వచ్చారు. ఆగస్టు పంటలు ఎదిగే సమయం. ఈ సమయంలో వర్షం లేకపోవడంతో పెద్దదెబ్బ పడినట్లు తెలుస్తోంది. వర్షపాతం తక్కువ పడడమే పంటల నష్టానికి ప్రధాన కారణమని పాలెం శాస్త్రవేత్త ఒకరు ‘సాక్షి’కి చెప్పారు. ఈ సారి శాస్త్రవేత్తలు ఎందుకంటే.. ఈ యేడాది కరువు పరిస్థితులను అధ్యయనం చేసేందుకు జిల్లావ్యాప్తంగా వ్యవసాయ అధికారులతోపాటు బిజినేపల్లి మండంలోని పాలెం వ్యవసాయ పరిశోధనస్థానం శాస్త్రవేత్తలు పంటపొలాల బాట పట్టారు. పంటలు నష్టపోవడానికి కొన్ని కారణాలను గుర్తించగలిగారు. ఆయా ప్రాంతాల పరిస్థితులకు అనుగుణంగా ఉన్న పంటలను కాపాడుకునేందుకు రైతులకు తగిన సలహాలు, సూచనలు ఇచ్చారు. శాస్త్రవేత్తలే స్వయంగా రైతులకు సూచనలు సలహాలు ఇవ్వడంతో ఉన్న పంటలనైనా కాపాడుకునే ప్రయత్నం చేస్తారన్న ఆలోచనతో వీరిని క్షేత్రస్థాయిలోకి పంపించారు. ఈ మేరకు వ్యవసాయ కమిషనర్ నుంచి ఆదేశాలు కూడా వచ్చాయి. పంటనష్టంపై శాస్త్రవేత్తల అంచనాలివీ.. జిల్లాలో సాగుచేసిన మొక్కజొన్న 1,98,309 హెక్టార్లకు పూర్తిగా వంద శాతం నష్టపోయినట్లు అంచనా వేశారు. 1,23,370 హెక్టార్లలో పత్తి సాగు చేయగా 20శాతం నష్టం వాటిల్లుతుందని లెక్కగట్టారు. ఆముదం జొన్న పంటల్లోనూ 20శాతం దిగుబడులు తగ్గుతాయని శాస్త్రవేత్తల పరిశీలనలో తేలింది. శాస్త్రవేత్తల సలహాలు -జిల్లాలో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు అక్కడక్కడా ఆలస్యంగా సాగు చేసిన మొక్కజొన్న పంటలో కంకిదశలో ఉన్నందున ఎరువులు వేసి కాపాడుకోవాలి. కనీసం 25–50శాతం దిగుబడులు వచ్చే అవకాశం ఉంది. మెట్ట పరిస్థితుల్లో ఉన్న మొక్కజొన్న పంటను కోసుకొని పశువులను మేతగానైనా వాడుకోవాలి. - జొన్న పంట పాలుపోసుకునే దశలో, పంట బెట్ట పరిస్థితుల్లో వర్షం లేక ఎండిపోవడంతో దిగుబడులు తగ్గే అవకాశం ఉంది. అక్కడక్కడా గింజ కుళ్లు తెగులు గుర్తించారు. అందుకు గాను ప్రోపికొనజోల్ 1.0ఎంఎల్ లీటరు నీటికి కలిపి పంటకు పిచికారీ చేసుకోవాలి. -సజ్జలో ప్రస్తుతం కురిసిన వర్షాలకు పంట దిగుబడులు వచ్చే అవకాశం ఉంది. - పత్తిలో గూడ కట్టే దశలో ఉన్నందున ప్రస్తుతం కురిసిన వర్షాలకు పైపాటుగా 30–35కిలోల యూరియా ఎకరాకు 20కిలోల మ్యూరెట్ ఆఫ్ పొటాష్ వేసుకోవాలి. వరుసగా వర్షాలు కురిసి ఆకు ఎర్రగా మారడం, వేరుకుళ్లు తెగులు సోకితే సీఓసీ 5గ్రాములు లీటరు నీటికి కలిసి మొక్క తడుపుకోవాలి. పూత రాలిపోతే ప్లానోపిక్స్ పది లీటర్ల నీటికి 2.5ఎంఎల్ కలిపి పిచికారీ చేసుకోవాలి. - ఆముదంలో ప్రస్తుతం మొదటి కంకి దశలో ఉన్నందున వాటికి ఉన్న శాఖలు విరిగిపోకుండా 15కిలోల యూరియా ఎకరాకు వేసుకోవాలి. ∙ కందిలో ప్రస్తుతం కురిసిన వర్షాలకు ఎకరాకు పది కిలోల చొప్పున యూరియా వేసుకోవాలి. కందిలో ఎండు తెగులు గుర్తిస్తే లీటరు నీటికి కార్బండిజమ్ కలిపి మొక్క మొదళ్ల వద్ద పోయాలి.