భర్త వేధింపులు తట్టుకోలేక..  ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య

Married Woman Commits Suicide With Her 3 Children At Medchal - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  భర్త వేధింపులు తట్టుకోలేక ఓ మహిళ ముగ్గురు పిల్లలతోపాటు చెరువులో దూకి ఆత్మహత్యకు యత్నించిన ఘటనలో ఆమెతోపాటు ఇద్దరు పిల్లలు మరణించగా, అదృష్టవశాత్తు కుమారుడు మృత్యువు అంచులవరకు వెళ్లి బయటపడ్డాడు. వివరాలిలా ఉన్నాయి.. మేడ్చల్‌ జిల్లా రాజబొల్లారం గ్రామానికి చెందిన బ్రాహ్మణపల్లి భిక్షపతి, మమత దంపతులు. భిక్షపతి ప్లంబర్‌ పనులు చేస్తున్నాడు.పెళ్లయిన నాటి నుంచే భిక్షపతి మమతపై అనుమానం పెట్టుకుని ఆమెను శారీరకంగా, మానసికంగా హింసించసాగాడు. తరచూ భార్యా భర్తల మధ్య గొడవలు జరుగుతుండడంతో పెద్ద మనుషులు సర్ది చెప్పారు.

వారికి జగదీశ్‌ (6), ప్రణతి (3), దీక్షిత్‌ (1) అనే పిల్లలు ఉన్నారు. ముగ్గురు పిల్లలు పుట్టినా భిక్షపతి తీరు మారలేదు. గత రెండు నెలలుగా రోజూ మద్యం తాగి భార్య మమతను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడు. మంగళవారం రాత్రి కూడా భిక్షపతి, మమతను చితకబాది హింసించాడు. దీంతో మనస్తాపం చెందిన మమత.. తాను చెరువులోకి దూకి చనిపోతానని ఇరుగుపొరుగు వద్ద వాపోయింది. బుధవారం ఉదయం పిల్లలను అంగన్‌వాడీ కేంద్రానికి పంపకుండా వారితోపాటే ఆమె ఇంటి వద్ద ఉంది.
చదవండి: ఏఎస్పీ ‘ముని రామయ్య’ కేసులో మరో అరెస్టు 

పిల్లలను అంగన్‌వాడీ కేంద్రానికి ఎందుకు పంపలేదని భిక్షపతి ఉదయం మళ్లీ గొడవ పడ్డాడు. దాంతో అంగన్‌వాడీ కేంద్రానికని బయలు దేరిన మమత.. అక్కడికి వెళ్లకుండా ముగ్గురు పిల్ల లను వెంట పెట్టుకుని తమ పొలం వద్ద ఉన్న చెరువు వద్దకు వెళ్లి పిల్లలను తోసి, తానూ దూకింది. దీంతో నీట మునిగి మమత, ప్రణతి, దీక్షిత్‌ మృతి చెందారు. మరో కుమారుడు జగదీశ్‌ అదృష్టవశాత్తు ఒడ్డుకు చేరుకుని బతికాడు.

కాగా, మమత ఎంతకూ తిరిగి రాకపోవడంతో ఆమె మరిది, ఆయన భార్య.. అంగన్‌వాడీ కేంద్రం వద్దకు వెళ్లి చూడగా మమత, పిల్లలు అక్కడ లేరు. చెరువు వద్దకు వెళ్లి చూడగా జగదీశ్‌ చెరువు ఒడ్డున అపస్మారక స్థితిలో పడిఉండటం గమనించారు. దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు నీటిలో మునిగిన మృతదేహాలను వెలికి తీశారు. మమత తల్లిదండ్రులు భిక్షపతిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. 

ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. 
ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top