దారుణం: ఆస్తి కోసం తల్లిని హత్య చేశాడు

Man Assassinated Mother For Property In Kurnool - Sakshi

బనగానపల్లె మండలం మిట్టపల్లెలో దారుణం  

సాక్షి, బనగానపల్లె(కర్నూల్‌): పెంచిన మమకారాన్ని మరచి, ఆస్తి కోసం తల్లినే హత్య చేశాడు ఓ కుమారుడు. ఈ దారుణం బనగానపల్లె మండలం మిట్టపల్లె గ్రామంలో గురువారం వెలుగు చూసింది. డోన్‌ డీఎస్పీ నరసింహారెడ్డి తెలిపిన వివరాల మేరకు..నార్పరెడ్డిగారి పుల్లమ్మ(58)కు ఎనిమిది ఎకరాల పొలం ఉంది. ఈమె భర్త రామచంద్రారెడ్డి అనారోగ్యంతో 18 ఏళ్ల క్రితం మృతి చెందాడు. కుమారుడు, ఇద్దరు కుమార్తెలను పుల్లమ్మ పెంచి, పోషించి..వివాహం చేసింది. వృద్ధాప్యంలో కుమారుడు ప్రసాద్‌ రెడ్డి వద్ద ఉంటోంది. తల్లి పేరున ఉన్న పొలంలో మూడు ఎకరాలను ఇటీవల ప్రసాద్‌ రెడ్డి ఎకరా రూ.35 లక్షల చొప్పున విక్రయించాడు.

వచ్చిన డబ్బుతో నిత్యం మద్యం తాగేవాడు. ఆస్తంతా తన పేరున రాయాలని తల్లితో వాగ్వాదానికి దిగేవాడు. ప్రసాద్‌ రెడ్డి  భార్య అపర్ణ కాన్పుకోసం ఇటీవల పుట్టినిల్లు అయిన అవుకు మండలం మెట్టుపల్లెకు వెళ్లింది. ఇంటిలో ఎవరూ లేకపోవడంతో బుధవారం మధ్యాహ్నం  తలుపు వేసి తల్లి పుల్లమ్మను దారుణంగా కత్తితో పొడిచాడు. తల్లి మృతి చెందడంతో ఇంటికి తలుపు వేసి పరారయ్యాడు. ప్రసాదరెడ్డి కోసం గురువారం బనగానపల్లె నుంచి మిట్టపల్లెకు వచ్చిన ఒక వ్యక్తి ఇంటి తలుపు తట్టి చూడగా.. పుల్లమ్మ రక్తపు మడుగులో కనిపించింది.

ఇరుగు పొరుగు వారికి తెలియజేయగా..వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ సురేష్‌ కుమార్‌రెడ్డి, ఎస్‌ఐ మహేష్‌కుమార్‌ అక్కడికి చేరుకున్నారు. హత్యకు పాల్పడిన ప్రసాదరెడ్డి తనకు ఏమీ తెలియనట్లు ఇంటి వద్దకు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు తమదైన శైలిలో ఆయనను ప్రశ్నించగా తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బనగానపల్లె ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ నరసింహారెడ్డి తెలిపారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top