Malkajgiri SI Suspension: ఎస్సై లీలలు.. పెళ్లి చేసుకుంటానని పదేళ్లుగా సహజీవనం, మరొక మహిళతో..

Malkajgiri SI Suspended Vijayakumar In Rape Case - Sakshi

పోలీసులకు బాధితురాలి ఫిర్యాదు

ఎస్సైపై అత్యాచారం, చీటింగ్‌ కేసు నమోదు

సస్పెండ్‌ చేసి విచారణకు ఆదేశించిన సీపీ మహేశ్‌ భగవత్‌

మిర్యాలగూడ అర్బన్‌: కణతపై తుపాకీ గురిపెట్టి వివాహితను ఓ పోలీసు అధికారి అత్యాచారం చేసిన ఘటన ఇంకా మరువక మునుపే పెళ్లి చేసుకుంటానని నమ్మించి పదేళ్లపాటు సహజీవనం చేసి మోసం చేసిన మరో పోలీసు అధికారి అరాచకం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో ఆదివారం చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. మిర్యాలగూడ మండలం కాల్వపల్లితండాకు చెందిన ధీరావత్‌ ఝాన్సీ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తుంది.

తన దూరపు బంధువైన సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం దురాజ్‌పల్లికి చెందిన ధరావత్‌ విజయ్‌తో పదేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. విజయ్‌ హైదరాబాద్‌లోని మల్కాజ్‌గిరిలో సీసీఎస్‌ ఎస్‌ఐగా విధులు నిర్వర్తిస్తున్నారు. వీరి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి పదేళ్లుగా హైదరాబాద్‌లోని ఎల్‌బీనగర్‌లో ఆమెతో సహజీవనం చేశారు. 

మేనమామ కూతురుతో వివాహం
ఝాన్సీతో సహజీవనం చేస్తూనే ఆరేళ్ల క్రితం విజయ్‌ తన మేనమామ కూతురును వివాహం చేసుకోగా..వీరికి సంతానం కూడా కలిగింది. ఈ విషయం ఝాన్సీకి తెలిసి ఆమె వేరే వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు సంబంధాలు వెతుకుతుండగా.. మరో వివాహం చేసుకోవద్దని విజయ్‌ బెదిరిస్తూ ఉండేవాడు. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో సదరు మహిళ ఎల్‌బీనగర్‌ నుంచి వచ్చి చైతన్యనగర్‌లో నివాసం ఉంటోంది.

అయినా విజయ్‌ బెదిరిస్తుండటంతో తనను మోసగించడమే కాకుండా వివాహం చేసుకోవద్దని, పెళ్లి సంబంధాలు చెడగొడుతూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఈనెల 8వ తేదీ రాత్రి మిర్యాలగూడ పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు విజయ్‌పై అత్యాచారం, చీటింగ్‌ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. విజయ్‌ను సస్పెండ్‌ చేయడంతో పాటు దీనిపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశిస్తూ రాచకొండ సీపీ మహేశ్‌భగవత్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలా ఉండగా సదరు ఎస్‌ఐని అదుపులోకి తీసుకునేందుకు పోలీసు బృందాలు తీవ్రంగా గాలిస్తున్నట్లు తెలిసింది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top