పెళ్లికి ఒప్పుకోలేదని హత్య | Lover Cut The Woman Throat With A Knife In Peddapalli | Sakshi
Sakshi News home page

పెళ్లికి ఒప్పుకోలేదని హత్య

Nov 10 2021 3:09 AM | Updated on Nov 10 2021 1:57 PM

Lover Cut The Woman Throat With A Knife In Peddapalli - Sakshi

యైటింక్లయిన్‌కాలనీ:  ప్రేమోన్మాదానికి మరో యువతి బలైపోయింది. తనకు దక్కని ప్రేమ మరొకరికి దక్కవద్దనే ఉన్మాదంతో ఓ యువకుడు పట్టపగలే ఓ యువతిని గొంతుకోసి చంపేశాడు. పెద్దపల్లి జిల్లా యైటింక్లయిన్‌కాలనీలో మంగళవారం ఈ దారుణం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు చెప్పిన వివరాల మేరకు.. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం వెంకట్రావుపల్లికి చెందిన గొడుగు అంజలి (20), యైటింక్లయిన్‌కాలనీలోని తారకరామానగర్‌కు చెందిన ట్రాక్టర్‌ కూలీ చాట్ల రాజు (21) గతంలో కొంతకాలం ప్రేమించుకున్నారు. ఇద్దరి సామాజికవర్గాలు వేరు కావడంతో పెద్దలు అభ్యంతరం తెలిపారు.

ఇరువర్గాల మధ్య పంచాయితీ కూడా జరిగిందని, అప్పటినుంచి ఇద్దరు దూరంగా ఉంటున్నా.. అప్పుడప్పుడు సెల్‌ఫోన్‌లో చాటింగ్‌ చేసుకునే వారని స్థానికులు చెప్తున్నారు. అయితే అంజలి కొద్దిరోజులుగా రాజును పూర్తిగా దూరం పెట్టింది. తనను పెళ్లిచేసుకోవాలని రాజు పలుమార్లు ఒత్తిడి తీసుకురాగా.. కుదరదని స్పష్టం చేసింది. దీనితో ఆమెపై ఆగ్రహం పెంచుకున్న రాజు.. రెండు రోజులుగా ఆమెకు ఫోన్‌ చేస్తూ, తనను పెళ్లిచేసుకోవాలని లేకుంటే చంపేస్తానని బెదిరిస్తూ వచ్చాడు. మంగళవారం అంజలి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో అక్కడికి వచ్చి.. ఆమెతో వాగ్వాదానికి దిగాడు. కాసేపటికే ఆగ్రహం పట్టలేక తన వెంట తెచ్చుకున్న కత్తితో అంజలి గొంతు కోశాడు. అంతటితో ఆగకుండా ఇంట్లో ఉన్న కత్తిపీటతో గొంతునరికి పరారయ్యాడు.

కొంతసేపటి తర్వాత అదే ప్రాంతానికి వెంకటేశ్‌ అనే యువకుడు జాబ్‌కార్డు ఇచ్చేందుకు ఆ ఇంటికి వెళ్లగా.. రక్తపు మడుగులో అంజలి మృతదేహం కనిపించింది. దీంతో స్థానికులకు, పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పెద్దపల్లి డీసీపీ రవీందర్, గోదావరిఖని ఏసీపీ గిరిప్రసాద్, గోదావరిఖని టూటౌన్‌ సీఐ శ్రీనివాస్‌రావు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు ప్రారంభించారు. తనకు దక్కని అంజలి మరోవ్యక్తికి దక్కకూడదనే ఉద్దేశంతోనే రాజు ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. కాగా.. అంజలి తండ్రి కొన్నాళ్ల క్రితమే చనిపోగా.. కుటుంబం ఆలనాపాలనా తల్లి లక్ష్మి చూసుకుంటోంది. కూతురు ఇలా హత్యకు గురికావడంతో ఆమె కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. 

పోలీసుల అదుపులో నిందితుడు? 
నిందితుడు రాజు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయినట్లు సమాచారం. స్థానికులు దీనిపై చర్చించుకుంటున్నారు. అయితే రాజు లొంగిపోయినట్టుగానీ, అరెస్టు చేసినట్టుగానీ పోలీసులు ధ్రువీకరించలేదు.  

Advertisement
 
Advertisement
Advertisement