ప్రాణం తీసిన ‘ప్రేమ’ పంచాయితీ

Love Problem: Mother And Son Suicide Attempt Jangaon - Sakshi

సాక్షి, జనగామ: ప్రేమించిన అమ్మాయితో వివాహానికి ఎకరం భూమి ఇవ్వాలని ఆమె తండ్రి డిమాండ్‌ చేయడంతో మనస్తాపానికి గురైన ప్రేమికుడు, అతని తల్లి పురుగుల మందు తాగారు. ఈ సంఘటనలో ప్రేమికుడు కన్నుమూయగా..అతని తల్లి ప్రాణాపాయం నుంచి బయట పడింది. పోలీసులు చెప్పిన వివరాల మేరకు..జనగామ జిల్లా పెద్దపహాడ్‌ గ్రామానికి చెందిన దండు సాయికుమార్‌(24), గోపిరాజుపల్లికి చెందిన అమ్మాయి ప్రేమించుకున్నారు. గత మే 13న పెళ్లి చేసుకున్నారు. అమ్మాయి తండ్రి తన కూతురు కనిపించడం లేదని పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. దీంతో సాయికుమార్‌ దంపతులు రక్షణ కోసం పోలీసులను ఆశ్రయించగా ఉభయుల తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చారు.

దీంతో అమ్మాయి కుటుంబసభ్యులు.. తన ఇంటి దగ్గరే వివాహం ఘనంగా చేస్తామని చెప్పి కూతుర్ని తీసుకెళ్లారు. ఈనెల 1న అమ్మాయి భర్తకు ఫోన్‌చేసి తనను తీసుకెళ్లాలని కోరగా, 3న సాయికుమార్‌ వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు అమ్మాయి తల్లిదండ్రులను స్టేషన్‌కు పిలిపించగా.. తన కూతురును సాయి పోషించలేడని, పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకుంటామని చెప్పి అక్కడినుంచి వెళ్లిపోయారు. ఈనెల 4న సాయికుమార్‌ అన్న దండు బాబు, అమ్మాయి తరఫు కుటుంబసభ్యులు, పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టారు. తన కూతురు పేరిట ఎకరం పొలం రిజిస్ట్రేషన్‌ చేయాలని తండ్రి డిమాండ్‌ చేయగా, అందుకు సాయికుమార్, అతని అన్న బాబు అంగీకరించారు.

కాగా, పెద్ద మనుషుల మాటలతో మనస్తాపానికి గురైన సాయి తల్లి అక్కమ్మ సోమవారం అర్ధరాత్రి ఇంట్లో పురుగు మందు తాగింది. దాంతో వేదనకు గురైన సాయి సైతం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబసభ్యులు ఇద్దరిని ఆస్పత్రికి తరలించగా సాయికుమార్‌ చికిత్స పొందుతూ మృతి చెందగా, తల్లి ప్రాణా పాయం నుంచి బయటపడింది. ఈ ఘటనతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో.. సాయికుమార్‌ దహన సంస్కారాలు పూర్తయ్యే వరకు పోలీసులు పెద్దపహాడ్‌ గ్రామంలోనే ఉన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top