అంతర్రాష్ట్ర కార్ల దొంగలు అరెస్టు

Interstate car thieves arrested at Andhra Pradesh - Sakshi

మదనపల్లె టౌన్‌: నలుగురు అంతర్రాష్ట్ర కార్ల దొంగలను అరెస్టు చేసినట్లు అన్నమయ్య జిల్లా మదనపల్లె డీఎస్పీ రవిమనోహరాచారి తెలిపారు. శనివారం ఆయన వివరాలు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లె గోపీనగర్‌కు చెందిన మహ్మద్‌ ఇయాజ్‌ అలియాస్‌ అయాజ్‌ (23), జామీ ప్రసాద్‌(28), అన్నమయ్య జిల్లా రాయచోటి  పొద్దుటూరువారిపల్లెకి చెందిన నందలూరు రాజానర్మదారెడ్డి (36), రాయచోటి టౌన్‌ మాసాపేటకు చెందిన పగిడిపల్లె సుబహాన్‌ (50) హైదరాబాద్‌లో కార్లు అద్దెకు ఇచ్చేవారి వద్ద డ్రైవర్లుగా చేరేవారు.

అక్కడ నమ్మకంగా ఉంటూ కార్ల యజమానుల వద్ద  నెల, రెండు నెలల పాటు వాహనాలను బాడుగకు తీసుకునేవారు. తర్వాత తప్పుడు పత్రాలతో వాటిని మదనపల్లెకు తీసుకొచ్చి కొందరు వడ్డీ వ్యాపారులకు రూ.5 నుంచి 8 లక్షలకు అమ్మేసేవారు. యజమానులు వాహనాలు అడిగినప్పుడు అమ్మిన కార్లకు జీపీఎస్‌ ఉండడంతో తిరిగి మదనపల్లెకు వచ్చి ఆచూకీ తెలుసుకుని దాని రెండో తాళం సహాయంతో వడ్డీ వ్యాపారులకు తెలియకుండా తీసుకెళ్లి యజమానులకు ఇచ్చేసేవారు.  

ఈ క్రమంలో శనివారం దొంగలు మదనపల్లెకు వచ్చినట్లు తెలుసుకుని వలపన్ని ఎస్‌బీఐ కాలనీవద్ద పట్టుకున్నారు. అత్యంత ఖరీదైన తొమ్మిది కార్లను స్వాధీనం చేసుకున్నామని, వాటి విలువ సుమారు రూ.5కోట్లు ఉంటుందని.. మిగిలిన మూడు కార్లను త్వరలోనే స్వాధీనం చేసుకుంటామని డీఎస్పీ తెలిపారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top