నా చావుకు కానిస్టేబుల్‌, ఆయన భార్యే కారణం.. యువతి ఆత్మహత్య | IICT Student Deepthi Selfie Suicide At Nacharam | Sakshi
Sakshi News home page

నా చావుకు కానిస్టేబుల్‌, ఆయన భార్యే కారణం.. యువతి ఆత్మహత్య

Dec 27 2024 9:26 AM | Updated on Dec 27 2024 10:53 AM

IICT Student Deepthi Selfie Suicide At Nacharam

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో యువతి ఆత్మహత్య తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చేయని తప్పునకు కానిస్టేబుల్‌ వేధింపులు భరించలేక తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సెల్ఫీ వీడియో తీసుకొని చనిపోయింది. తన చావుకు కానిస్టేబుల్‌, ఆయన భార్యే కారణమని కన్నీరు పెట్టుకుంది. ఈ ఘటన నాచారం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది.

ఈ ఘటనపై బాధిత కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాచారంలోని బాపూజీనగర్‌ సరస్వతి కాలనీకి చెందిన పులివర్తి దీప్తి హబ్సిగూడలోని ఐఐసీటీ (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ)లో ప్రాజెక్టు అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. దీప్తి తండ్రి సంగీతరావు ఐఐసీటీలో పని చేసి రిటైర్‌ అయ్యారు. తండ్రితో వేరుగా దీప్తి రెండు సంవత్సరాల నుండి తన తల్లితో కలిసి ఉంటోంది. సంగీతరావుకు డీజీపీ కార్యాలయంలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న బెల్లా అనిల్‌తో పరిచయముంది.

అయితే, బిల్ల అనిల్ అనే వ్యక్తి తన భార్య కోసం ఐఐసీటీలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగం కోసం, దీప్తి తండ్రి సంగీత రావుకు రూ.15 లక్షలు డబ్బులు ఇచ్చినట్లు సమాచారం. రెండేళ్ల క్రితమే ఈ డబ్బులు ఇచ్చినట్టు సమాచారం. అయితే, తన తండ్రి సంగీతరావు.. అనిల్ వద్ద డబ్బు తీసుకున్న విషయం దీప్తికి తెలియదు. కాగా, ఈ సంవత్సరం సెప్టెంబర్ వరకూ ఉద్యోగం ఇప్పించలేదు. దీంతో అనిల్‌ తన డబ్బు తిరిగివ్వాలని దీప్తిని అడిగేవాడు. డబ్బు తన తండ్రి తీసుకున్నాడని, ఆయన తమతో చాలా ఏళ్ల నుంచి కలిసి ఉండటం లేదని, తనను డబ్బులు అడగవద్దని అనిల్‌కు సమాధానం చెప్పింది. ఆయన పట్టించుకోకుండా నాచారం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయించాడు. దీంతో, దీప్తి, సంగీత రావుపై ఛీటింగ్ కేసు నమోదైంది. అనిల్‌ దంపతులు న్యాయస్థానంలో సివిల్‌ దావా కూడా వేశారు.

ఈ నేపథ్యంలో మనస్తాపానికి గురైన దీప్తి, బుధవారం రాత్రి 10 గంటల సమయంలో చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తల్లి వచ్చి చూసేసరికి దీప్తి మృతి చెందింది. ఆమె ఫోన్‌ చూడగా సెల్ఫీ వీడియో ఉంది. సెల్ఫీ వీడియో ప్రకారం ఆమె మాటలు.. ‘నేను చనిపోవడానికి అనిల్‌, ఆయన భార్య అనిత, ఆమె తండ్రి సోమయ్య కారణం. మా నాన్న డబ్బులు తీసుకుంటే నన్ను అడిగి నా మీద నకిలీ కేసు పెట్టారు. నా జీవితం నాశనం చేశారు. ఈ కేసుల మీద పోరాడే స్తోమత లేదు. నా మరణంతోనైనా కుటుంబానికి న్యాయం జరుగుతుంది. నా చావునకు కారణమైన వాళ్లకు శిక్షపడాలి. నా మృతదేహాన్ని వైద్య పరిశోధనకు ఇచ్చేయండి అంటూ కన్నీరు పెట్టుకుంది. అనంతరం, పోలీసులు అనిత, అనిల్‌, సోమయ్య, సైదులు మీద కేసు బుక్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement