Hyderabad Mohammed Abdul Kaleem Most Dangerous Terrorist - Sakshi
Sakshi News home page

ఖతర్నాక్‌ ఖలీమ్‌! మానవ బాంబు డాలిన్‌ను సిటీకి తీసుకొచ్చింది ఇతడే.. 

Published Sat, Feb 18 2023 11:37 AM

Hyderabad Mohammed Abdul Khalim Most Dangerous Terrorist - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: నగరంలో గత ఏడాది దసరా ఉత్సవాల నేపథ్యంలో హ్యాండ్‌ గ్రెనేడ్లతో విధ్వంసాలకు కుట్ర పన్నిన కేసులో హైదరాబాద్‌ సిట్‌ పోలీసులు గురువారం అరెస్టు చేసిన మహ్మద్‌ అబ్దుల్‌ ఖలీమ్‌ సామాన్యుడు కాదని అధికారులు చెబుతున్నారు. లష్కరేతోయిబా (ఎల్‌ఈటీ) ఉగ్రవాదులు అబ్దుల్‌ జాహెద్, మహ్మద్‌ సమీయుద్దీన్, మాజ్‌ హసన్‌ ఫారూఖ్‌లకు సంబంధించిన కేసులోనే సిట్‌ ఇతడినీ కటకటాల్లోకి పంపింది. తదుపరి విచారణ నిమిత్తం ఖలీమ్‌ను తమ కస్టడీలోకి తీసుకోవాలని పోలీసులు నిర్ణయించారు.  

బిలాల్‌ ద్వారానే ఉగ్రబాట... 
ఎల్బీనగర్‌ సమీపంలోని ఎన్టీఆర్‌ నగర్‌కు చెందిన ఖలీమ్‌ అక్కడే వెల్డింగ్‌ దుకాణం నిర్వహిస్తుంటాడు. ముసరాంబాగ్‌ ప్రాంతానికి చెందిన, పాకిస్థాన్‌లోని కరాచీలో ఎన్‌కౌంటర్‌ అయిన ఎల్‌ఈటీ ఉగ్రవాది షాహెద్‌ అలియాస్‌ బిలాల్‌ ద్వారా ఉగ్రవాద బాట పట్టాడు. 2004లో నగరం నుంచి పారిపోయి సౌదీ అరేబియాలో తలదాచుకున్న బిలాల్‌ ఆదేశాల మేరకు 2005లో అతడి సోదరుడు జాహెద్‌తో కలిసి పని చేయడానికి అంగీకరించాడు. అప్పట్లో ఈ లష్కరేతోయిబా ఉగ్రవాదులు గ్రీన్‌ల్యాండ్స్‌లో ఉండే హైదరాబాద్‌ పోలీసు కమిషనర్, టాస్‌్కఫోర్స్‌ కార్యాలయాన్ని టార్గెట్‌ చేశారు. వరుసగా ఉగ్రవాదులను అరెస్టు చేస్తుండటంతో పోలీసులను నైతికంగా దెబ్బతీయడానికే దీన్ని ఎంచుకున్నారు. ఈ కుట్ర మొత్తం సౌదీ నుంచి బిలాల్‌ అమలుపరిచాడు.  

అప్పటి నుంచి జాహెద్‌తో కలిసే..
దసరా రోజు కావడంతో పెను ముప్పు తప్పగా ఓ హోంగార్డు మాత్రం అమరుడయ్యాడు. ఈ కేసులో అదే ఏడాది అక్టోబర్‌ 18న అరెస్టైన ఖలీమ్‌ 2017 వరకు జాహెద్‌తో కలిసి జైల్లోనే ఉన్నాడు. టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయంపై మానవబాంబు దాడి కేసు వీగిపోవడంతో విడుదలయ్యాడు. అప్పటి నుంచి జాహెద్‌తో సన్నిహితంగానే ఉంటున్నాడు. ‘దసరా విధ్వంసాల’ కోసం పాకిస్థాన్‌లో ఉన్న ఫర్హాతుల్లా ఘోరీ జాహెద్‌కు మొత్తం రూ.40 లక్షల వరకు పంపాడు. ఈ మొత్తం వివిధ హవాలా ఆపరేటర్లతో పాటు ఖలీమ్‌ ద్వారానూ ఇతడికి అందింది. రూ.10 లక్షలు అందించిన ఖలీమ్‌ నగరంలో రెక్కీ చేయడానికి సహకరించాడు. దసరా ఉత్సవాలు జరిగే మైదానాలే వీరి టార్గెట్‌లో ఉన్నాయి.

ఖలీమ్‌ను సిట్‌ పోలీసులు టాస్‌్కఫోర్స్‌ అధికారుల సాయంతో గురువారం చంద్రాయణగుట్టలోని అతడి అత్తగారింటి వద్ద అరెస్టు చేశారు. ఆ సమయంలో అతడి బంధువులు, కుటుంబీకులు పోలీసులకు అడ్డుకోవడానికి ప్రయత్నించారు. జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించిన అధికారులు తదుపరి విచారణ నిమిత్తం తమ కస్టడీకి కోరుతూ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ కేసు ఇప్పటికే ఎన్‌ఐఏకు బదిలీ కావడంతో ఖలీమ్‌ విచారణ తర్వాత పూర్తి స్థాయిలో ఆ విభాగానికి అప్పగించనున్నారు. 

ఆ ఆపరేషన్‌లోనూ కీలకపాత్ర..
శ్రీలంకకు చెందిన ఎల్‌టీటీఈకి, కాశ్మీర్‌లోని ఉగ్రవాద సంస్థలకు మాత్రమే పరిమితమైన మానవ బాంబు విధానాన్ని టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయంపై వాడాలని ఈ ఉగ్రవాదులు నిర్ణయించుకున్నారు. బంగ్లాదేశ్‌లోని ఢాకాకు చెందిన మౌథసిమ్‌ బిల్హా అలియాస్‌ డాలిన్‌ను మానవ బాంబుగా మార్చారు. ఇతడిని తీసుకురావడానికి అప్పట్లో ఖలీమ్‌ సరిహద్దులు దాటి అక్రమంగా బంగ్లాదేశ్‌ వెళ్లడంతో పాటు కొన్నాళ్లు ఉగ్రవాద శిక్షణ తీసుకున్నాడు.

డాలిన్‌ను తీసుకుని నగరానికి చేరుకుని ఎన్టీఆర్‌ నగర్‌లోని తన ఇంట్లోనే అతడికి ఆశ్రయం ఇవ్వడం, టాస్క్‌ఫోర్స్‌ ఆఫీస్‌ వద్ద రెక్కీ చేయించడంలో కీలక పాత్ర పోషించాడు. నాటి బాంబు కూడా ఖలీమ్‌ ఇంట్లోనే తయారైంది. తనను తాను పేల్చుకోవడానికి సిద్ధమైన డాలిన్‌ను 2005 అక్టోబర్‌ 12 (దసరా రోజు) టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయం వద్దకు తీసుకువెళ్లి వదిలాడు.
చదవండి: అపరిచితులు ఆహారం పెట్టినా ముట్టవు.. చిటికెలో జాడ పట్టేయగలవు..

Advertisement
Advertisement