బుల్లీ బాయ్‌’ కేసు దర్యాప్తు ముమ్మరం | Sakshi
Sakshi News home page

బుల్లీ బాయ్‌’ కేసు దర్యాప్తు ముమ్మరం

Published Wed, Jan 5 2022 8:18 AM

Hyderabad Cyber Crime Police Investigate Bully Boy Affair - Sakshi

సాక్షి హైదరాబాద్‌: ఓ వర్గం వారిని టార్గెట్‌ చేసుకుని అశ్లీల, అభ్యంతరకర పోస్టులు చేస్తున్న, ఫొటోలు పొందుపరుస్తున్న ‘బుల్లీ బాయ్‌’ వ్యవహారాన్ని హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. దీనికి సంబంధించి టోలిచౌకికి చెందిన ఓ బాధితురాలి ఫిర్యాదు మేరకు నమోదైన కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ నేతృత్వంలోని బృందం ముంబై పోలీసులతో సంప్రదింపులు జరుపుతోంది. ఆ అధికారులు సోమవారం బెంగళూరుకు చెందిన విద్యార్థిని అరెస్టు చేయడంతో అతడి వ్యవహారాలను ఆరా తీస్తోంది.

గిట్‌హాబ్‌ అనే సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్‌లో గతంలో ‘సు.. డీల్స్‌’ పేరుతో ఖాతా నిర్విహించిన వారే దాన్ని బుల్లీ బాయ్‌గా మార్చినట్లు పోలీసులు గుర్తించారు. దీనిపై ముంబై, ఢిల్లీల్లోనూ కేసులు నమోదయ్యాయి. సాంకేతికంగా దర్యాప్తు చేసిన ముంబై పోలీసులు సోమవారం బెంగళూరులో దాడులు చేశారు. ఈ ఖాతా నిర్వాహకుడిగా అనుమానిస్తూ ఇంజినీరింగ్‌ విద్యార్థి విశాల్‌ ఝానును అరెస్టు చేశారు. ఇప్పటికే ముంబై పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్న సిటీ సైబర్‌ క్రైమ్‌ అ«ధికారులకు మంగళవారం ఈ విషయం తెలిసింది. దీంతో అతడికి సిటీలో నమోదై ఉన్న కేసుకు మధ్య సంబంధాలపై ముంబై అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రాథమిక ఆధారాలు లభిస్తే విశాల్‌ను పీటీ వారెంట్‌పై హైదరాబాద్‌కు తీసుకురానున్నారు. మరోపక్క అత్తాపూర్‌ ప్రాంతానికి చెందిన మరో మహిళ కూడా ఇలాంటి నేరం బారినపడినట్లు తెలిసింది 

Advertisement
Advertisement