
తిరువొత్తియూరు: కోయంబత్తూరు పీలమేడు సమీపంలోని వి.కె.రోడ్, చేరన్ నగర్, 4వ బస్టాప్ ప్రాంతానికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు జయపాల్(47). ఇతని భార్య వాలెంటినా(40). వీరికి ఒక కుమారుడు ఉన్నారు. ఈ నేపథ్యంలో వాలెంటినా తన కొడుకుతో కలిసి మధురైలోని బంధువుల ఇంటికి వెళ్లింది. సంఘటన జరిగిన రాత్రి జయపాల్ తన భార్యకు సెల్‌ఫోన్‌లో వీడియో కాల్ చేసి మాట్లాడాడు. అప్పుడు, అతను తన భార్యతో తాను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు చెప్పాడు. అంతేకాకుండా వీడియో కాల్‌లో భార్యతో మాట్లాడుతూనే ఇంట్లో ఉన్న తన భార్య చుడీదార్ ప్యాంటు తీసుకుని ఫ్యాన్‌కు తగిలించి ఉరి వేసుకున్నాడు.
వీడియో కాల్‌లో ఇది చూసి దిగ్భ్రాంతి చెందిన అతని భార్య, వెంటనే కోయంబత్తూరులోని తమ ఇంటి సమీపంలో నివశిస్తున్న బంధువులకు ఫోన్ చేసి, తమ ఇంటికి వెళ్లి చూడాలని కోరింది. వారు అక్కడికి వెళ్లి జయపాల్‌ను రక్షించడానికి ప్రయత్నించారు. అతను ఉన్న గది తలుపు పగలగొట్టి లోపలికి వెళ్లి ఉరి వేసుకున్న అతన్ని కిందకు దించారు. ఆ తర్వాత అంబులెన్స్‌లో సింగనల్లూరు ఈఎస్‌ఐ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన డాక్టర్లు అతను ఆసుపత్రికి వచ్చే మార్గంలోనే మరణించినట్లు తెలిపారు. భర్త ఉరి వేసుకుని వేలాడుతుండడం చూసిన వాలెంటీనా వెంటనే కోయంబత్తూరుకు తిరిగి వచ్చింది. ఆమె కుమారుడితో కలసి మరణించిన జయపాల్ మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. దీనిపై వాలెంటినా కోయంబత్తూరు పీళమేడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.