ఉపాధ్యాయుడి హత్య: భార్యే హంతకురాలు.. వివాహేతర సంబంధంతో..

Husband Assassinated by his Wife in Oanyam Nandyal District - Sakshi

ఉపాధ్యాయుడి హత్య కేసును ఛేదించిన పోలీసులు 

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని దారుణానికి పాల్పడిన భార్య 

హత్య చేసి ఆస్తమాతో చనిపోయినట్లు నమ్మించిన వైనం  

పోస్టుమార్టం రిపోర్ట్‌తో హత్యగా వెలుగులోకి 

హతుడి భార్య, ఆమె తమ్ముడు, ప్రియుడు అరెస్ట్‌

పాణ్యం (నంద్యాల జిల్లా):  మండల కేంద్రమైన పాణ్యంలో గత నెల 14వ తేదీ జరిగిన ఉపాధ్యాయుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని సొంత భార్యనే దారుణంగా హత్యకు పాల్పడినట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది. సోమవారం నంద్యాల డీఎస్పీ మహేశ్వరరెడ్డి పాణ్యం సర్కిల్‌ కార్యాలయంలో నిందితులను మీడియా ఎదుట హాజరుపరిచి కేసు వివరాలను వెల్లడించారు.

పాణ్యంకు చెందిన షేక్‌ జవహర్‌ హుసేన్‌ బనగానపల్లె మండలం చెరువుపల్లె ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేసేవారు. ఇతనికి భార్య షేక్‌ హసీనా, కుమారుడు తమీమ్, కుమార్తె ఆర్పియా ఉన్నారు. కొంత కాలంగా హసీనాకు అదే ప్రాంతానికి చెందిన మహబూబ్‌బాషాతో వివాహేతర సంబంధం కొనసాగుతుంది. అయితే ఈ విషయం తెలిసి జవహార్‌ హుసేన్‌ పెద్దల సమక్షంలో మందలించి మహబూబ్‌బాషాను గ్రామం నుంచి ఓర్వకల్లు మండలం హుసేనాపురం పంపించారు.

చదవండి: (భార్యను కడతేర్చి బకెట్‌లో పెట్టి.. ఆపై నాంపల్లికి వెళ్లి..)

అయినా హసీనా, మహబూబ్‌బాషలు తరచూ ఫోన్‌లో మాట్లాడుకోవడం గమనించిన జవహర్‌ హుసేన్‌ భార్యను వేధించాడు. దీంతో భర్తను అడ్డుతొలగించుకోవాలని ఆమె తమ్ముడు ఇద్రూస్, ప్రియుడు మహబూబ్‌బాషాతో కలసి కుట్ర పన్నింది. గత నెల 13వ తేదీన చంపాలని పథకం రూపొందించారు. ఇందులో భాగంగానే ఇద్దరి పిల్లలను తన తల్లి ఇంటికి పంపించింది. ఆ రోజు జవహర్‌ ఉసేన్‌ పాణ్యం మండలం మద్దూరులో ఇస్తెమాకు వెళ్లి రాత్రి 10 గంటలకు ఇంటికి చేరుకుని నిద్రించాడు. అప్పటికే ఇంటిపైన ఉన్న ఇద్రూస్, మహబూబ్‌బాషా అర్ధరాత్రి ఇంట్లోకి వెళ్లి హసీనాతో కలసి జవహర్‌ హుసేన్‌ కాళ్లకు తాడు కట్టి గొంతునొక్కి చంపేశారు.

వివరాల వెల్లడిస్తున్న నంద్యాల డీఎస్పీ మహేశ్వరెడ్డి

ఆ తర్వాత ఎవ్వరికీ అనుమానం రాకుండా జవహర్‌ ఉసేన్‌కు ఆస్తమా ఉందని ఊపిరాడక పలకడం లేదని బంధువులకు సమాచారం ఇచ్చి శాంతిరాం ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి డాక్టర్లు చనిపోయినట్లు ధ్రువీకరించారు. అయితే తన అన్నకు ఆస్తమా ఉన్నా మందులు సక్రమంగా వాడుతుండటంతో చనిపోయే తీవ్రత లేదని, మృతికి ఇతర కారణాలు ఉండవచ్చని జవహర్‌ హుసేన్‌ తమ్ముడు కరిముల్లా అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోస్టుమార్టం నివేదిక మేరకు పోలీసులు దర్యాప్తు చేయగా భార్యనే హత్యకు పాల్పడినట్లు తేల్చారు. ముగ్గురు నిందితులను అరెస్ట్‌ చేసి వారి వద్ద నుంచి మూడు సెల్‌ఫోన్లు, హత్యకు ఉపయోగించిన తాడును స్వాధీనం చేసుకున్నారు. ఉపాధ్యాయుడి హత్య కేసును ఛేదించిన సీఐ వెంకటేశ్వరరావు, ఎస్‌ఐ సుధాకర్‌రెడ్డి, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.       

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top