ప్రవీణ్‌...  ఎ డ్రగ్‌ డిస్ట్రిబ్యూటర్‌!!

Hash Oil Peddling Network Busted In Hyderabad - Sakshi

నగరం నుంచి ఏజెన్సీకి పెట్రోలియం ఈథర్‌ సరఫరా

హష్‌ ఆయిల్‌ తయారీలో ఈ రసాయనం వినియోగం

అది తీసుకువచ్చి స్థానికంగా ఉన్న పెడ్లర్లకు విక్రయం

సిటీతో పాటు బెంగళూరులోనూ నిందితునికి నెట్‌వర్క్‌

మొత్తం నలుగురిని పట్టుకున్న హెచ్‌–న్యూ బృందం

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని కెమికల్‌ షాపుల నుంచి అక్రమంగా పెట్రోలియం ఈథర్‌ ఖరీదు చేయడం... దీన్ని విశాఖ ఏజెన్సీకి తరలించి హష్‌ ఆయిల్‌ తయారీదారులకు విక్రయించడం... వాళ్ల నుంచి హష్‌ ఆయిల్‌ కొనుగోలు చేసి హైదరాబాద్‌తో పాటు బెంగళూరులో ఉన్న పెడ్లర్లకు సరఫరా చేయడం... కొన్నాళ్లుగా ఈ పంథాలో రెచ్చిపోతున్న ‘డ్రగ్‌ డిస్ట్రిబ్యూటర్‌’ ఎన్‌.ప్రవీణ్‌ కుమార్‌ హైదరాబాద్‌ నార్కోటిక్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌ (హెచ్‌–న్యూ) అధికారు లకు చిక్కాడు. ఇతడితో పాటు ముగ్గురు పెడ్లర్స్‌ను పట్టుకున్నట్లు డీసీపీ చక్రవర్తి గుమ్మి మంగళవారం వెల్లడించారు.

మూడేళ్ల క్రితం పెడ్లర్‌గా  మొదలెట్టి...
కుత్బుల్లాపూర్‌ ప్రాంతానికి చెందిన ప్రవీణ్‌ కుమార్‌ దాదాపు మూడేళ్ల క్రితం గంజాయి పెడ్లర్‌గా మారాడు. ఇతడికి విశాఖ ఏజెన్సీలోని గూడెం మాడుగుల మండలం అలగాం ప్రాంతానికి చెందిన గంజాయి పండించే గిరిజనులతో పరిచయమైంది. కొన్నాళ్లుగా వాళ్లు గంజాయి నుంచి తీసే హష్‌ ఆయిల్‌ ఉత్పత్తి చేస్తున్నారు. దీంతో ప్రవీణ్‌ అదే దందా చేశాడు. హష్‌ ఆయిల్‌ తయారీకి పెట్రోలియం ఈథర్‌ అవసరం. ఇది ఏజెన్సీలో దొరకట్లేదనే విషయం తెలుసుకున్న ఇతగాడు తాను సరఫరా చేస్తానంటూ గిరిజను లతో ఒప్పందం చేసుకున్నాడు. దాన్ని వినియో గించి తనకు హష్‌ ఆయిల్‌ తయారు చేసి ఇవ్వాలంటూ షరతు పెట్టాడు.

రెండు ఏజెన్సీల నుంచి అక్రమంగా...
పెట్రోలియం ఈథర్‌ను పారిశ్రామిక అవసరాల కోసం మాత్రమే విక్రయించాలి. అదీ అధీకృత పత్రాలు సేకరించిన తర్వాతే అమ్మాలి. అయితే నగరంలోని కూకట్‌పల్లి ప్రశాంతినగర్‌కు చెందిన నర్మద ట్రేడర్స్, మహాలక్ష్మీ కెమికల్‌ ట్రేడర్స్‌ ఈ నిబంధనను తుంగలో తొక్కాయి. ఎలాంటి పత్రాలు లేకుండా ప్రవీణ్‌కు భారీ మొత్తంలో విక్రయిస్తున్నాయి. దీని రవాణా కోసం ఓ వాహ నం ఖరీదు చేసిన ఇతను డ్రైవర్‌ను నియమించుకున్నాడు. ఈథర్‌ను ఇక్కడ లీటర్‌ రూ.100కు కొని, అలగాం తరలించి అక్కడి వారికి రూ.400కు అమ్ముతున్నాడు. ఇలా ఇప్పటి వరకు ఈ రెండు ఏజెన్సీల నుంచి 1400 లీటర్లు కొనుగోలు చేశాడు. 

హష్‌ ఆయిల్‌ ‘డిస్ట్రిబ్యూటర్‌’గా మారి...
పెట్రోలియం ఈథర్‌తో తయారు చేసిన హష్‌ ఆయిల్‌ను ప్రవీణ్‌ గిరిజనుల నుంచి తక్కువ రేటుకు కొనుగోలు చేస్తున్నాడు. లీటర్‌ గరిష్టంగా రూ.30 వేలకు కొని, తీసుకువచ్చి హైదరాబాద్‌ లోని 15 మంది పెడ్లర్స్‌తో పాటు బెంగళూరులో ఉన్న వారికీ సరఫరా చేస్తున్నాడు. నగరంలో లీటర్‌ రూ.70 వేల నుంచి రూ.80 వేలకు, బెంగళూరులో రూ.1.2 లక్షలు నుంచి రూ.1.4 లక్ష లకు విక్రయిస్తున్నాడు. చిన్న చిన్న డబ్బాల్లో ప్యాక్‌ చేసి డబ్బాల్లో అమ్మితే ప్రవీణ్‌కు లీటర్‌కు రూ.2 లక్షల వరకు ఆదాయం వస్తోంది. ఇలా అటు ఇథనాల్, ఇటు హష్‌ ఆయిల్‌ రెండింటి దందా చేస్తూ కొన్నాళ్లుగా రెచ్చిపోతున్న ఇతడికి గోవాలో కూడా నెట్‌వర్క్‌ ఉన్నట్లు అనుమానిస్తున్నారు. 

చిక్కడపల్లిలో సరఫరా చేస్తుండగా...
ప్రవీణ్‌ కుమార్‌కు నగరంలో ఉన్న పెడ్లర్లలో పటాన్‌చెరు, కూకట్‌పల్లి ప్రాంతాలకు చెందిన పి.మోహన్‌ యాదవ్, పి.కళ్యాణ్, బి.సురేష్‌ కీల కం. ఇటీవల ఏజెన్సీ నుంచి హష్‌ ఆయిల్‌ తెచ్చిన ఇతడు దాన్ని చిన్న డబ్బాల్లో ప్యాక్‌చేసి పెడ్లర్స్‌కు సరఫరా చేస్తున్నాడు. మంగళవారం చిక్కడపల్లి వద్దకు ఈ ముగ్గురికీ ఇచ్చేందుకు 60 డబ్బాలు తీసుకువచ్చాడు.

దీనిపై హెచ్‌–న్యూ ఇన్‌స్పెక్టర్‌ పి.రమేష్‌రెడ్డికి సమాచారం అందింది. ఆయన ఆదేశాల మేరకు ఎస్సై సి.వెంకటరాములు నేతృత్వంలోని బృందం వలపన్ని నలుగురినీ పట్టు కుంది. వీరి నుంచి హష్‌ ఆయిల్‌తో పాటు 400 లీటర్ల ఈథర్, వాహనం స్వాధీనం చేసుకున్నా రు. నిబంధనలకు విరుద్ధంగా పెట్రోలియం ఈథర్‌ను వికయ్రించిన  కూకట్‌పల్లి ప్రశాంతినగర్‌కు చెందిన నర్మద ట్రేడర్స్, మహాలక్ష్మీ కెమికల్‌ ట్రేడర్స్‌పై కేసులు నమోదు చేశారు.

ప్రవీణ్‌పై గతంలోనూ కేసులు
కాగా,  ప్రవీణ్‌పై గతంలో రెండు కేసులు నమోదై నట్టు పోలీసులు గుర్తించారు. 2015లో కూకట్‌ పల్లిలో ఓ చిన్నారిని కిడ్నాప్‌ చేసి డబ్బు డిమాండ్‌ చేసిన ముఠాలో సభ్యుడిగా కేసు నమోదైంది. 2020లో కూకట్‌పల్లిలోనే గంజాయి అమ్ముతూ పట్టుబడిన కేసు విచారణలో ఉంది. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top