Sakshi News home page

ఉద్యోగం పేరుతో రూ.కోటీ ఇరవై లక్షలు.. 40 మందికి టోకరా

Published Sat, Apr 15 2023 4:02 PM

Guntur Man Cheats Rs 1 Crore 20 Lakh 40 Unemployed Youth - Sakshi

పెదకాకాని: ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగులను మోసగించిన ఘటన తాజాగా వెలుగు చూసింది. ఉద్యోగాల పేరుతో రూ.కోటీ ఇరవై లక్షలు మోసపోయారు. బాధితుల కథనం.. గుంటూరు జిల్లా పెదకాకాని పరిధిలోని కంతేరు అడ్డరోడ్డులో ఉన్న ఐజేఎం అపార్ట్‌మెంట్స్‌లో విజయవాడ ట్రెజరీ డిపార్ట్‌మెంట్‌లో జాయింట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్న దావులూరి మాల్యాద్రి నివాసం ఉంటున్నాడు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్‌ డీఎస్సీ నిర్వహించి ఉద్యోగాలు ఇచ్చింది. కాంట్రాక్ట్‌ పద్ధతిలో వికలాంగ పిల్లలకు విద్యాబోధన చేస్తున్న మాత జయప్రకాష్‌రెడ్డికి దావులూరి మాల్యాద్రి పరిచయం అయ్యాడు. డీఎస్సీలో మిగిలిపోయిన పోస్టులకు సంబంధించి ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించాడు.

తనకు మధ్యవర్తిగా లాజర్‌ అనే వ్యక్తిని పరిచయం చేశాడు..
జయప్రకాష్‌రెడ్డి కాకినాడ జిల్లా, కాజులూరు మండలం, దుగ్గుదూరు గ్రామం కావడంతో ఆయన పరిచయం ఉన్న మరో ఏడుగురితో కలసి మొత్తం ఎనిమిది మంది లాజర్‌ను కలిశారు. ఒక్కొక్క పోస్టుకు రూ.3 లక్షల అవుతుందని ముందుగా అడ్వాన్స్‌ లక్ష చొప్పున చెల్లించాలని లాజర్‌ చెప్పడంతో 8 లక్షలు చెల్లించారు. ఎక్కువ మందిని చూసుకోవడం ద్వారా ఖర్చులు తగ్గుతాయని చెప్పడంతో శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల్లో ప్రైవేటు టీచర్లుగా పనిచేస్తున్న మరో 32 మందిని పరిచయం చేశారు.

40 మంది నుంచి ఫోన్‌ పే, గూగుల్‌ పే, బ్యాంక్‌ అకౌంట్‌ ద్వారా చెల్లించారు. వారి వద్ద నుంచి దావులూరి మాల్యాద్రి, లాజరు అతడి భార్య అరుణ వసూలు చేశారు. ఏ ఒక్కరికీ ఉద్యోగం రాకపోగా అదిగో ఇదిగో వస్తుంది అంటూ కాలయాపన చేస్తున్నారు. గట్టిగా నిలదీయడంతో అందరికీ ఉద్యోగాలు వచ్చే వరకూ షూరిటీగా నోట్లు, 100 స్టాంప్‌ పేపరుపైనా దావులూరి మాల్యాద్రి సంతకం చేసి ఇవ్వడం జరిగింది. అనంతరం కొంతకాలానికి డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో మీకు ఉద్యోగాలు ఇప్పించం, చేతనైంది చేసుకోండి అంటూ దుర్భాషలాడాడు.

అలానే ఉద్యోగానికి నగదు చెల్లించిన వారిలో ఒకరైన ఎం.రాజేష్‌ బావ బి. వెంకటేశ్వరరావు(కానిస్టేబుల్‌) నిన్ను నమ్మి డబ్బులు చెల్లించాం, నీ చెక్‌ ఇవ్వాలని మాత జయప్రకాష్‌రెడ్డి ఇంటిపైకి వచ్చి భార్య పిల్లల్ని బెదిరిస్తున్నాడు. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెబితే ఆశపడి 40 మంది అభ్యర్థులు ఒక్కొక్కరూ రూ.3 లక్షల చొప్పున చెల్లించి మోసపోయామని, మాకు మా కుటుంబసభ్యులకు ప్రాణరక్షణ కల్పించాలని, మోసపోయిన నగదు ఇప్పించాలని బాధితులు పెదకాకాని పోలీసుస్టేషన్‌లో శుక్రవారం ఫిర్యాదు చేశారు.

Advertisement

What’s your opinion

Advertisement