ఈ దొంగోడు..భలే టక్కరోడు.. ఒక్క బంగారు గాజే చాలు..!

Funny Thief: Only One Gold Bangle Theft - Sakshi

తల్లిదండ్రుల వద్ద నిద్రిస్తున్న చిన్నారులే లక్ష్యం

తిరుమల : చిన్నారులనే లక్ష్యంగా చేసుకుని బంగారు నగలు చోరీ చేసే  దొంగను పోలీసులు అరెస్ట్‌ చేశారు. సోమవారం తిరుమల వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో తిరుమల అదనపు ఎస్పీమునిరామయ్య విలేకరులకు తెలిపిన వివరాలు.. కర్నూలులోని అశోక్‌నగర్‌కు చెందిన హంసపురం అనంతరాజు (34) గత ఏడాది మార్చి నుంచి ఈ ఏడాది జూలై 27వ తేదీ వరకు ప్రతి శుక్ర, శనివారాల్లో తిరుమలకు వచ్చేవాడు.

అన్నదాన సత్రం ఏరియాలో భక్తుల చెంత నిద్రిస్తున్న చిన్నపిల్లల చేతిలోని విలువైన బంగారు గాజులను చోరీ చేసేవాడు.  ప్రధానంగా చిన్నారుల రెండు చేతులకు బంగారు గాజులు ఉంటే ఒక గాజును మాత్రమే చోరీ చేసేవాడు. దీంతో తల్లిదండ్రులు చిన్నారులు ఒక గాజును ఎక్కడైనా పడేసుకున్నారని భావించి పోలీసులకు ఫిర్యాదు చేసేవారు కాదు. అయితే గతనెల 27న తిరుమల వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఓ ఫిర్యాదుదారుడు ఒక బంగారు గాజు చోరీపై ఫిర్యాదు చేశారు. దీంతో కేసును నమోదు చేసిన స్టేషన్‌ సీఐ జగన్మోహన్‌రెడ్డి దర్యాప్తు చేపట్టి నిందితుడు హంసపురం అనంతరాజును అరెస్ట్‌ చేసి అతని వద్ద నుంచి ఒక బంగారు గాజును స్వా«దీనం చేసుకున్నారు. ఏడాది కాలంలో  ఏడుసార్లు బంగారు గాజులను చోరీ చేశాడని, వాటిని తిరుపతిలోని ఓ కుదువ దుకాణంలో తాకట్టు పెట్టినట్లు తేలింది. ఆ దుకాణానికి పోలీసులు నోటీసు జారీ చేశారు. ఆ ఆభరణాలను స్వా«దీనం చేసుకుని బాధితులకు అందజేస్తామని సీఐ చెప్పారు. సమావేశంలో టీటీడీ వీజీఓ బాలిరెడ్డి, తిరుమల డీఎస్పీ ప్రభాకర్, టూ టౌన్‌ సీఐ చంద్రశేఖర్, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top