
విజయనగరం: జిల్లాలోని ద్వారపూడి గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కారు డోర్ లాక్ పడటంతో నలుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం ఉదయం ఈ నలుగురు చిన్నారులు ఆడుకునేందుకు బయటకు వెళ్లారు. తల్లిదండ్రులంతా ఉదయం నుంచి వెతికినప్పటికీ కనిపించలేదు.
అయితే గ్రామంలో మహిళా మండల కార్యాలయం వద్ద ఆగి ఉన్న ఒక కారులోకి నలుగురు చిన్నారులు సరదాగా కూర్చునేందుకు వెళ్లి కారు డోర్ వేశారు. దీంతో కారు డోర్ లాక్ పడడంతో ఊపిరి ఆడక మంగి బుచ్చిబాబు, భవాని దంపతుల కుమారుడు ఉదయ్ (8), బుర్లు ఆనంద్ ఉమా దంపతుల ఇద్దరు కుమార్తెలు చారుమతి (8) చరిష్మా (6), కంది సురేష్ అరుణ దంపతుల కుమార్తె మనస్విని మృతి చెందారు.
ఉదయం ఆడుకోవడానికి వెళ్లిన చిన్నారులు ఇలా మృత్యువాత పడటంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. తమ బిడ్డలు చనిపోవడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. మృతిచెందిన చిన్నారులపై పడి వారు రోదిస్తున్న తీరు వర్ణనాతీతం. చిన్నారుల తల్లిదండ్రుల్ని బంధువులు ఓదార్చడానికి ప్రయత్నిస్తున్నా వారిని ఆపడం కష్టసాధ్యంగా మారింది.