ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Four Assassinated In Road Accident At Prakasam - Sakshi

ముందు ఆగి ఉన్న లారీని అదుపు తప్పి ఢీకొన్న కారు

ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం

రెండు గంటలు శ్రమించి మృతదేహాల వెలికితీత 

మృతులంతా పశ్చిమ గోదావరి జిల్లావాసులు

సాక్షి, ప్రకాశం : వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి ముందు ఆగి ఉన్న లారీని ఢీకొని నలుగురు దుర్మరణం చెందిన ఘటన మార్టూరు జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున జరిగింది. తిరుపతి వెంకన్న దర్శనం చేసుకుని తిరిగి వెళ్తున్న రెండు జంటలు ఈ ప్రమాదంలో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాయి. పోలీసులు, 108 సిబ్బంది, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు జిల్లా కోర్టులో అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా పనిచేసే రేకందారు కనక మహాలక్ష్మి (58), బలిజ సత్యనారాయణ(63) భార్యభర్తలు. అదే కోర్టులో అడ్వొకేట్‌గా పనిచేసే వీరి సమీప బంధువు పర్వతనేని విజయలక్ష్మి (58), ఉయ్యూరు రవీంద్రనాథ్‌ చౌదరి అలియాస్‌ చినబాబు (60)లు దంపతులు.

ఈ రెండు కుటుంబాలు ఏలూరు పట్టణంలోని ఫతేబాద్‌ కాలనీ అగ్రిగోల్డ్‌ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నాయి. చినబాబుకు గతంలో భార్య మరణించగా గత సంవత్సరం ఆగస్టు 5వ తేదీన విజయలక్ష్మితో వివాహమైంది. ఈ రెండు కుటుంబాలతో పాటు కనక మహాలక్ష్మి మేనల్లుడు అయిన ఎం.సందీప్‌తో కలిసి మొత్తం ఐదుగురు నాలుగు రోజుల క్రితం కారులో వెంకన్న దర్శనం కోసం తిరుపతి వెళ్లారు. తిరిగి ఏలూరు ప్రయాణం కాగా చినబాబు డ్రైవింగ్‌ చేస్తున్నాడు. కారు గురువారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో స్థానిక అంబేడ్కర్‌ కాలనీ ఎదురు జాతీయ రహదారిపై రోడ్డు పక్కన నిలిపి ఉంచిన లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు లారీ 50 మీటర్లకు పైగా ముందుకు దూసుకెళ్లి.. వెనుక భాగంలో ఇరుక్కుపోయిన కారును సైతం తనతో లాక్కొని వెళ్లిందంటే ప్రమాదం ఏ స్థాయిలో జరిగి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. 

చెమటోడ్చిన అధికారులు
ప్రమాదం జరిగిన వెంటనే ఎస్‌ఐ శివకుమార్, ఏఎస్‌ఐ వెంకటేశ్వర్లు, హెడ్‌ కానిస్టేబుల్‌ కోటేశ్వరరావు, కానిస్టేబుల్‌ రమణ, నారాయణలతో కలిసి ప్రమాద స్థలానికి చేరుకున్నారు. అప్పటికే కారులో ఉన్న ఐదుగురులో నలుగురు మృతి చెందగా ఐదో వ్యక్తి సందీప్‌ కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నట్లు అధికారులు గుర్తించారు. హైవే అధికారుల క్రేన్‌ ద్వారా లారీ నుంచి కారును విడగొట్టేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది. అనంతరం భారీ క్రేన్‌ సహాయంతో లారీ నుంచి కారును విడగొడుతూ కారు వెనుక సీట్లో సందీప్‌ను అతి కష్టం మీద బయటకు రప్పించారు. అప్పటికే సిద్ధంగా ఉంచిన 108 వాహనంలో సందీప్‌కు ఆక్సిజన్‌ అమర్చి గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు.

లారీ నుంచి విడిపించిన కారు డోర్లు ఎంతకు రాకపోవడంతో ఎస్‌ఐ, ఏఎస్‌ఐలు స్వయంగా గునపాలతో కారు డోర్లు ధ్వంసం చేసి సుమారు రెండు గంటల పాటు శ్రమించి ఛిద్రమైన నలుగురు మృతదేహాలను వెలికితీశారు. వేళకాని వేళ.. స్థానికులు అందుబాటులో లేకపోవడంతో పోలీసు అధికారులే అన్నీ తామై వ్యవహరించారు. మూడున్నర గంటల సమయంలో ఇంకొల్లు సీఐ అల్తాఫ్‌ హుస్సేన్, ఐదున్నర గంటలకు చీరాల డీఎస్పీ శ్రీకాంత్, మధ్యాహ్నం ఒంటి గంటకు ఏఎస్పీ రవిచంద్ర చీరాల మోటారు వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ అమర్‌ నాయక్‌లు ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని సందర్శించి ఎస్‌ఐ శివకుమార్‌ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. సాయంత్రం 5 గంటలు సమయంలో నలుగురు మృతదేహాలకు మార్టూరు ప్రభుత్వాస్పత్రిలో సూపరింటెండెంట్‌ డాక్టర్‌ పద్మావతి పోస్టుమార్టం నిర్వహించగా అధికారులు మృతదేహాలను బంధువులకు అప్పగించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.  ( యూపీలో మరో నిర్భయ)

గురువారం తెల్లవారుజామున ప్రకాశం జిల్లా మార్టూరుకు సమీపంలోని జాతీయరహదారిపై ఆగి ఉన్న లారీని వారి కారు ఢీకొట్టింది. దీంతో నలుగురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కారులోనే మృతదేహలు చిక్కుకుపోవడంతో పోలీసులు, హైవే సిబ్బంది శ్రమించి బయటకు తీశారు. గాయపడినవారిని ఆసుపత్రికి తరలించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top