పెళ్లి వద్దని చెప్పింది.. వేడి నీరు పోసేశారు | Faridabad Woman Marriage Denial And Pour Boil Water | Sakshi
Sakshi News home page

రూ.3 లక్షలకు బేరం.. వృద్ధుడితో పెళ్లి చేయాలనుకున్నారు కానీ

Aug 21 2026 2:47 AM | Updated on Aug 21 2026 2:48 AM

Faridabad Woman Marriage Denial And Pour Boil Water

ఓ వృద్దుడితో పెళ్లికి నిరాకరించిందని ఓ యువతిపై వేడినీరు పోసి దాడి చేసిన ఘటన కలకలం రేపింది. హర్యానాలోని కురేషీపూర్‌ గ్రామంలో ఈ సంఘటన జరగ్గా ప్రస్తుతం ఆ యువతి ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్‌ ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతోంది. ఆమె ఛాతీ, ప్రైవేట్‌ భాగాలకు తీవ్ర గాయాలైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

బాధితురాలు, ఆమె మేనమామ చెప్పినదాని ప్రకారం.. బిహార్‌లోని సహాపూర్‌కు చెందిన యువతికి రెండేళ్ల క్రితం కురేషీపూర్‌కు చెందిన రోహిత్‌తో పెళ్లయింది. ఇతడు ఓ ప్రైవేట్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు. ధర్మేంద్ర, లలిత అనే దంపతులు.. తల్లిదండ్రుల్లా చూసుకుంటామని చెప్పి రెండు నెలల క్రితం సదరు యువతిని తమ వద్దకు తీసుకెళ్లారు. తర్వాత రోహిత్- ఆమె విడాకులు తీసుకునేలా చేశారు. రూ.3 లక్షలకు ఆశపడి తమ దగ్గరే ఉన్న ఈ యువతిని ఓ వృద్ధుడికి ఇచ్చి పెళ్లి చేసేయాలని చూశారు.

కానీ ఈ పెళ్లి సదరు యువతి వ్యతిరేకించడంతో ఆగస్టు 16న తెల్లవారుజామున 4 గంటల టైంలో ధర్మేంద్ర, లలిత కలిసి ఆమెపై వేడి నీరు పోసి గాయపరిచాడు. చికిత్స కోసం బయటకు వెళ్లకుండా అడ్డుకుని, ఓ గదిలో బంధించి తాళం వేసి మొబైల్‌ ఫోన్‌ కూడా లాక్కున్నారు. ఇదంతా తన సోదరి ద్వారా తెలుసుకున్న యువతి మేనమాన పంకజ్.. పోలీసులతో కలిసి ఆగస్టు 18న కురేషీపూర్‌కు వెళ్లాడు. అయినా సరే ఇంటి తలుపులు తెరవలేదు. తర్వాత రోజు మళ్లీ వెళ్లారు. ఈసారి పోలీసుల సహాయంతో తాళం పగులగొట్టి గదిలో ఉన్న యువతిని బయటకు తీసుకొచ్చారు. తొలుత ఆమెని ఫరీదాబాద్‌లోని ఓ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్‌ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

యువతిపై జరిగిన దాడి, ఆమెను గదిలో నిర్బంధించిన ఘటనతో పాటు రూ.3 లక్షలకు వృద్ధుడికి పెళ్లి చేయాలన్న ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆమె వాంగ్మూలం ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement