బాలికపై లైంగిక దాడి

Fake Baba Physical Assult On Girl In Adilabad - Sakshi

సాక్షి, నేరడిగొండ(ఆదిలాబాద్‌): మండలంలోని ఇస్పూర్‌ మథురతండాకు చెందిన బాలికపై ఓ స్వామీజీ లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటనలో యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. నేరడిగొండ ఎస్సై భరత్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మల్‌ జిల్లా సారంగాపూర్‌ మండలం దుర్గానగర్‌కు చెందిన జాదవ్‌ ఆత్మారాం మహరాజ్‌(26) ఏడేళ్లుగా రాజుర గ్రామ శివారులోని గుట్టపై ఆశ్రమం ఏర్పాటు చేసుకుని ఉంటున్నాడు. గుట్టపై శివాలయంలో పూజలకు భక్తులు వెళ్తుంటారు. వేసవి కాలం కావడం, ఆ ఆశ్రమం వద్ద నీటి సౌకర్యం లేకపోవడంతో ఇస్పూర్‌ మథురతండా గ్రామస్తులు మహరాజ్‌ను గ్రామంలోని ఆలయం వద్ద గల ఆశ్రమంలో ఉంచారు.

ఈ నెల 16న రాత్రి 8 గంటల ప్రాంతంలో ప్రసాదం మహరాజ్‌కు ఇచ్చి రావాలని బాలికను తల్లిదండ్రులు పంపించారు. బాలిక వెళ్లి అరగంట అయినా తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఆశ్రమానికి వెళ్లి చూడగా తలుపులు వేసి ఉన్నాయి. స్థానికుల సహాయంతో తలుపులను బద్దలు కొట్టారు. లోపల బాలిక అపస్మారక స్థితిలో పడిఉండడంతో ఇంటికి తీసుకెళ్లారు. స్పృహలోకి వచ్చిన తర్వాత స్వామీజీ తనపై అఘాయిత్యం చేశాడని తల్లిదండ్రులకు తెలిపింది. సోమవారం సాయంత్రం బాలిక తల్లిదండ్రులు గ్రామస్తులతో కలిసి నేరడిగొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అర్ధరాత్రి సమయంలో మహరాజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు ఎస్సై తెలిపారు.

చదవండి: ఫేక్‌ ఆఫీసర్‌..! రహస్యంగా తీసిన వీడియోలతో బ్లాక్‌మెయిల్

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top