హత్య కేసులో నిందితునికి జీవితఖైదు

Defendant Sentenced To Life Imprisonment In Murder Case - Sakshi

విశాఖ లీగల్‌: యువకుడిని అతి దారుణంగా హత్య చేసిన వ్యక్తికి యావజ్జీవ జైలు శిక్ష, వెయ్యి రూపాయల జరిమాన విధిస్తూ నగరంలోని 11వ అదనపు జిల్లా న్యాయమూర్తి లాలం శ్రీధర్‌ సోమవారం తీర్పు చెప్పారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా 3 నెలలు సాధారణ జైలు శిక్ష అనుభవించాలని ఆ తీర్పులో పేర్కొన్నారు. అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ సలాది శ్రీనివాసు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. నిందితుడు పడాల నాగరాజు(42) ఉమ్మడి విశాఖ జిల్లా కొయ్యూరు మండలం చట్టుబంద గ్రామానికి చెందిన వాడు. వృత్తి వ్యవసాయం.

మృతుడు కె.మల్లేశ్వరరావు (28) కూడా అదే గ్రామానికి చెందినవాడు. నేరం జరగడానికి 6 నెలల ముందు నాగరాజు కూలి పనుల నిమిత్తం చెన్నై వెళ్లాడు. గ్రామానికి తిరిగి వచ్చిన తర్వాత అతని ఇంట్లో ఆధార్‌ కార్డు, రేషన్‌ కార్డు, రేడియో, ఇంట్లోని కొన్ని వస్తువులు కనిపించలేదు. వాటిని మల్లేశ్వరరావు దొంగలించినట్లు అనుమానం వ్యక్తం చేశాడు. ఈ విషయంలో ఇద్దరూ గొడవ పడ్డారు. 2015 జూన్‌ 3న రాత్రి మల్లేశ్వరరావు లోతభీమయ్యకు చెందిన జీడి మామిడితోటలోని పూరిపాకలో నిద్రపోతున్నాడు. ఇదే అదునుగా నాగరాజు అర్ధరాత్రి 12 గంటల సమయంలో పెద్ద కర్రతో మల్లేశ్వరరావుపై దాడి చేసి తల, భుజం, ముక్కుపై బలంగా కొట్టాడు.

తీవ్ర గాయాలతో బాధపడుతున్న మల్లేశ్వరరావును అతని బంధువులు నర్సీపట్నం ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి విశాఖ తరలించారు. చికిత్స పొందుతూ జూన్‌ 4న మరణించాడు. మృతుని తండ్రి కొయ్యూరి లక్ష్మయ్య ఫిర్యాదు మేరకు కొయ్యూరు పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ జి.సోమశేఖర్, నర్సీపట్నం ఉప పోలీస్‌ సూపరింటెండెంట్‌ బి.సత్య ఏసుబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. హత్యా నేరంతోపాటు, గిరిజన చట్టం 3(2)(5) కింద కూడా నేరం రుజువుకావడంతో న్యాయమూర్తి రెండు నేరాల్లో యావజ్జీవ జైలు శిక్ష విధించారు. అయితే 2 శిక్షలు ఏకకాలంలో అమలు చేయాలని ఆ తీర్పులో స్పష్టం చేశారు.  

(చదవండి: ఇక బంద్‌! రోడ్డు రోలర్‌తో తొక్కించి సైలెన్సర్ల ధ్వంసం)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top