Vizag: ఇక బంద్‌! రోడ్డు రోలర్‌తో తొక్కించి సైలెన్సర్ల ధ్వంసం

Visakhapatnam City Police Crush Modified 631 Silencers, Warns Bikers - Sakshi

బీచ్‌రోడ్డులో 631 లౌడ్‌ సైలెన్సర్ల ధ్వంసం

మోడిఫైడ్‌ సైలెన్సర్లు వాడితే చర్యలు

విశాఖ నగర సీపీ సీహెచ్‌ శ్రీకాంత్‌ 

పెదవాల్తేరు (విశాఖ తూర్పు): నగరంలో శబ్ధ కాలుష్యం, వాయు కాలుష్యానికి కారణమవుతున్న 631 లౌడ్‌ సైలెన్సర్లను ధ్వంసం చేయించామని నగర పోలీస్‌ కమిషనర్‌ సీహెచ్‌ శ్రీకాంత్‌ వెల్లడించారు. బీచ్‌రోడ్డులోని పోలీస్‌ మెస్‌ ఆవరణలో ఆదివారం రోడ్డు రోలర్‌తో సైలెన్సర్లను ధ్వంసం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వాహనదారులు మోడిఫైడ్‌ సైలెన్సర్లను వాడరాదని కోరారు. బీచ్‌రోడ్డులో యువకులు బైక్‌ రేసింగ్‌లకు పాల్పడుతున్నారని ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. దీంతో స్పెషల్‌ డ్రైవ్‌ ద్వారా ఏడు వాహనాలను, 12 మంది యువకులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. 


బీచ్‌రోడ్డులో బైక్‌ రేసింగ్‌లు పాల్పడే యువకులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ విషయంలో తల్లిదండ్రులు కూడా అప్రమత్తంగా వుండి తమ కుమారులపై నిఘా వుంచాలని సూచించారు. హెల్మెట్‌ లేకుండా బైక్‌లు నడుపుతూ ప్రమాదాలకు గురై ఇటీవల చాలా మంది ప్రాణాలు కోల్పోయారని విచారం వ్యక్తం చేశారు. అందువల్ల ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మట్‌ ధరించాలని సూచించారు. మద్యపానం చేసి వాహనాలు నడపరాదని ఆయన కోరారు. 


మద్యం సేవించి వాహనాలు నడిపి పట్టుబడేవారితో కోర్టు ఆదేశాలతో కమ్యూనిటీ సర్వీస్‌ చేయిస్తున్నామని గుర్తు చేశారు. ఆయా జంక్షన్లలో వీరిచేత ప్లకార్డుల సాయంతో ట్రాఫిక్‌ నియంత్రణపై అవగాహన కల్పిస్తున్నామని వివరించారు. ఇప్పటి వరకు నగరంలోని పోలీస్‌ స్టేషన్ల పరిధిలో 205 మందితో కమ్యూనిటీ సర్వీస్‌ చేయించామన్నారు. కార్యక్రమంలో ట్రాఫిక్‌ ఏడీసీపీ ఆరిబుల్లా, ట్రాఫిక్‌ ఏసీపీ – 1 కుమారస్వామి, ట్రాఫిక్‌ ఏసీపీ – 2 శరత్‌కుమార్, ఈస్ట్‌ ట్రాఫిక్‌ సీఐ ఏవీ లీలారావు, ఎస్‌ఐ అసిరితాత, తదితరులు పాల్గొన్నారు. (క్లిక్‌: విశాఖలో ఇగ్లూ థియేటర్‌ ఎక్కడ ఉందో తెలుసా?)

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top