Fake SBI Call Center: ఉత్తుత్తి బ్యాంక్‌.. ఓటీపీ చెప్పాడు.. క్షణాల్లోనే రూ.1,64,612 మాయం

Cyberabad Police Busts Fake SBI Call Center Run From Delhi - Sakshi

ఎస్‌బీఐ కాల్‌ సెంటర్‌ పేరిట దోచేశారు

ఢిల్లీ ఉత్తమ్‌నగర్‌ కేంద్రంగా కార్యకలాపాలు 

33 వేల మంది కస్టమర్లకు వల  

రూ.వందల కోట్లు కొట్టేసిన ముఠా 

కస్టమర్‌ కేర్‌ నంబర్‌ స్పూఫింగ్‌   

నిందితుల్ని అరెస్ట్‌ చేసిన సైబరాబాద్‌ పోలీసులు 

సాక్షి, హైదరాబాద్‌: ‘ఓ వ్యక్తికి ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డ్‌ కస్టమర్‌ కేర్‌ నంబర్‌ +18601801290 నుంచి ఫోన్‌ వచ్చింది. మీ పాత క్రెడిట్‌ కార్డ్‌ గడువు ముగియనుంది. కొత్త కార్డ్‌ జారీ కోసం కాల్‌ చేస్తున్నామని చెప్పాడు. పాత కార్డ్‌ మీద ఉన్న 16 అంకెల నంబర్, సీవీవీ, కార్డు గడువు వివరాలను కోరాడు. కొత్త కార్డ్‌ యాక్టివేషన్‌ కోసం వచ్చిన ఓటీపీ చెప్పాలని సూచించాడు. అది చెప్పేసిన క్షణాల్లోనే సదరు ఉద్యోగి కార్డ్‌ నుంచి రూ.1,64,612 డెబిట్‌ అయ్యాయి. బాధితుడు తేరుకునేలోపే సైబర్‌ నేరస్తులు కార్డ్‌లోని మొత్తాన్ని కొట్టేశారు. దీంతో సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించాడు’ 

కూపీ లాగితే.. 
కేసు నమోదు చేసుకొని రంగంలోకి దిగిన సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌... బాధితుడి ఫోన్‌కు ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డ్‌ కస్టమర్‌ కేర్‌ నంబర్‌తో ఎలా మోసం చేశారని కూపీ లాగారు. కస్టమర్‌ కేర్‌ నంబర్‌ను కాల్‌ స్పూఫింగ్‌ చేసి సైబర్‌ నేరస్తులు వల వేశారని పసిగట్టారు. కాల్‌ స్పూఫింగ్‌ అప్లికేషన్లను వినియోగిస్తూ 14 మందితో ఢిల్లీ ఉత్తమ్‌నగర్‌ కేంద్రంగా సాగిస్తున్న నకిలీ క్రెడిట్‌ కార్డ్‌ కాల్‌ సెంటర్‌ గుట్టు రట్టు చేశారు. ఈ ముఠాలో ప్రధాన సూత్రధారి ఢిల్లీవాసి నిఖిల్‌ మదన్‌కు కాల్‌ స్పూఫింగ్‌ అప్లికేషన్లను విక్రయించిన మోస్ట్‌ వాంటెడ్‌ సైబర్‌ నేరస్తుడు యూపీ మొరాదాబాద్‌కు చెందిన ఫర్మాన్‌ హుస్సేన్‌ కూడా ఉన్నాడు. కేసు వివరాలను గురువారం సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర వెల్లడించారు. 

ఫర్మాన్‌ హుస్సేన్‌కు టెక్నాలజీపై మంచి పట్టుండటంతో సొంతంగా ప్రోస్పోక్‌హెచ్‌డీ.కామ్, రౌండ్‌2హెల్‌.ఓఆర్‌జీ అనే రెండు కాల్‌ స్పూఫింగ్‌ వెబ్‌సైట్లను అభివృద్ధి చేశాడు. ఫర్మాన్‌ నుంచి మోసిఫ్, సిల్వర్‌ డైలర్, రౌండ్‌2హెల్, ఐటెల్‌ మొబైల్‌ డైలర్‌ అనే నాలుగు కాల్‌ స్పూఫింగ్‌ అప్లికేషన్ల తాలుకు పెయిడ్‌ సరీ్వస్‌లను బిహార్‌ సరన్‌కు చెందిన ముర్షీద్‌ ఆలం కొనుగోలు చేసి.. వాటిని ఉత్తమ్‌నగర్‌కు చెందిన నిఖిల్‌ మదన్‌కు విక్రయించాడు. ఇతను 14 మందితో కలిసి ఉత్తమ్‌నగర్‌లో ఎస్‌బీఐ నకిలీ క్రెడిట్‌ కార్డ్‌ కాల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశాడు. బ్యాంకింగ్‌ రంగంలో అనుభవం, మంచి పరిచయాలు ఉన్న నిఖిల్‌.. ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్ల పేరు, ఫోన్‌ నంబర్, చిరునామా తదితర వివరాలను డైరెక్ట్‌ సేల్‌ ఏజెంట్స్‌ (డీఎస్‌ఏ) నుంచి సేకరించారు. 
ఎస్‌బీఐ కస్టమర్‌ కేర్‌ నంబర్లు 18601801290, 01139020202 స్పూఫింగ్‌ చేసి కస్టమర్‌కు ఫోన్‌ చేయడం మొదలుపెట్టారు. క్రెడిట్‌ కార్డ్‌ పరిమితి పెంపు, బీమా సౌకర్యం కలి్పస్తామని, రివార్డ్‌ పాయింట్స్‌ పెంపు, కొత్త కార్డ్‌ జారీ చేస్తామని మాయమాటలు చెప్పి.. కస్టమర్ల నుంచి కార్డ్‌ వివరాలను సేకరిస్తారు. వీటిని ఉపయోగించి ఆన్‌లైన్‌ లావాదేవీలు నిర్వహిస్తారు.  
ప్రధాన నిందితుడు నిఖిల్‌ మదన్, ఫర్మాన్‌ హుస్సేన్, దీపాన్షు మదన్, పింకీ కుమారి, రోహిత్‌ మాథూర్, హితేష్‌ చోప్రా, వికాస్, సంజయ్‌ కుమార్, ప్రభాత్‌ కుమార్‌ సింగ్, సంక్షం రాజ్, అనూజ్‌ కుమార్, సమీర్‌ మిశ్రా, ముర్షిద్‌ ఆలం, గౌరవ్‌లను అరెస్ట్‌ చేశారు.  
ఏడాది కాలంగా ఈ నకిలీ కాల్‌ సెంటర్‌ దేశంలోని 33 వేల మందికి ఫోన్‌ చేయగా.. 14 వేల కాల్స్‌ గుర్తించారు. ఈ ముఠాపై 5 వేల వరకు కేసులు ఉన్నాయి.  ఫర్మాన్‌ హుస్సేన్‌ మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌. తొలిసారిగా సైబరాబాద్‌ పోలీసులకు చిక్కాడు. 23 మందికి కాల్‌ స్పూఫింగ్‌ యాప్స్‌ విక్రయించాడు. రూ.3 కోట్లు కొట్టేసిన నకిలీ ఆర్‌బీఎల్‌ క్రెడిట్‌ కార్డ్‌ కాల్‌ సెంటర్‌ కేసులోనూ ప్రధాన నిందితుడు దీపక్‌ చౌదరి, విశాల్‌ కుమార్‌లకు మోసిప్, సిల్వర్‌ డైలర్‌ కాల్‌ స్పూఫింగ్‌ యాప్స్‌ విక్రయించాడు.  
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top