విధి మిగిల్చిన విషాదం

Couple Died Of Current Shock At Allur Sitarama Raju District - Sakshi

సజావుగా సాగిపోతున్న ఆ కుటుంబంపై విధి కన్నెర్రజేసింది. విద్యుదాఘాతం రూపంలో భార్యాభర్తలను కబళించింది. తల్లిదండ్రులను దూరం చేయడంతో నాలుగేళ్ల చిన్నారి ఆనాథగా మిగిలిపోయింది. మంగళవారం ఉదయం స్థానిక విద్యుత్‌శాఖ క్వార్టర్లలో చోటుచేసుకున్న ఈ హృదయ విదారక ఘటన అందరినీ కంటతడి పెట్టించింది. 
అరకులోయ రూరల్‌: మండలంలోని కంఠభంసుగుడ గ్రామానికి చెందిన   గొల్లోరి డొంబుదొర (36), పార్వతి (33) దంపతులు స్థానిక విద్యుత్‌ శాఖ క్వార్టర్‌లో నివాసం ఉంటున్నారు. వీరికి నాలుగేళ్ల వింధ్య అనే కుమార్తె ఉంది.  డొంబుదొర గిరిజన సహకార సంస్థ మినీ సూపర్‌ బజార్‌లో దినసర వేతన కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం పార్వతి దుస్తులు ఉతికింది.

వాటిని ఆరబెట్టేందుకు డొంబుదొర ప్రయత్నించాడు. వైరుపై దుస్తులు ఆరబెడుతుండగా దానికి విద్యుత్‌ సరఫరా ఉండటంతో షాక్‌కు గురయ్యాడు. అతను కేకలు పెట్టడంతో రక్షించేందుకు పార్వతి ప్రయత్నించింది. ఆమె కూడా విద్యుదాఘాతానికి గురైంది. ఇద్దరు సంఘటన స్థలంలోనే స్పృహకోల్పోయారు. పరిస్థితిని గమనించిన చుట్టుపక్కల వారు 108 వాహనంలో స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో ఆస్పత్రి, విద్యుత్‌ క్వార్టర్ల వద్ద విషాదఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రలు విద్యుదాఘాతంతో మృతి చెందడంతో కుమార్తె వింధ్య పరిస్థితి దయనీయంగా మారింది. 

బాధిత చిన్నారిని ఆదుకుంటాం: ఐటీడీఏ పీవో గోపాలకృష్ణ 
విద్యుదాఘాతంతో భార్యాభర్తలు మృతి చెందిన ఘటనలో బాధిత చిన్నారిని ఆదుకుంటామని ఐటీడీఏ పీవో ఆర్‌.గోపాలకృష్ణ మంగళవారం తెలిపారు. గొల్లోరి డొంబుదొర, పార్వతి మృతి చెందడం దురదృష్టకరమన్నారు. కుటుంబానికి ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలిపారు. తల్లిదండ్రులను కోల్పోయిన నాలుగేళ్ల చిన్నారిని ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని పీవో తెలిపారు. ఐటీడీఏ తరపున పూర్తి సహాయ సహాకారాలు అందిస్తామన్నారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమశాఖ మంత్రి పీడిక రాజన్నదొర, గిరిజన సంక్షేమశాఖ సంచాలకులు గంధం చంద్రుడు జరిగిన సంఘటనపై విచారం వ్యక్తం చేశారని పీవో తెలిపారు. బాధిత కుటుంబానికి సంతాపం తెలిపారని పీవో ప్రకటనలో పేర్కొన్నారు.  

(చదవండి: ఊరుకాని ఊరులో.. ఇది కదా మానవత్వం అంటే!)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top