కరోనా విలయం: తండ్రి చితిపై దూకేసిన కుమార్తె | corona: Daughter Jumps On Father Body During Cremation In Rajasthan | Sakshi
Sakshi News home page

కరోనా విలయం: తండ్రి చితిపై దూకేసిన కుమార్తె

May 5 2021 3:51 PM | Updated on May 5 2021 6:01 PM

corona:  Daughter Jumps On Father Body During Cremation In Rajasthan - Sakshi

ఫైల్‌ పోటో

రాజస్థాన్‌లో షాకింగ్‌ ఉదంతం ఒకటి కలకలం రేపింది.  కరోనాతో మృతి చెందిన  తండ్రి మరణాన్ని తట్టుకోలేని  ఓ కుమార్తె ఆయన  చితిపై  దూకేసింది.  

రాజస్థాన్: దేశంలో రెండో దశలో రోజువారీ రికార్డు స్థాయిలో  కరోనా వైరస్‌  కేసులు నమోదవుతున్నాయి. అటు మరణాలు కూడా అదే స్థాయిలో ప్రకంపలు పుట్టిస్తోంది. ఈ మహమ్మారి సంక్షోభం అనేక కుటుంబాల్లో సృష్టిస్తున్న విలయం అంతాకాదు ఇంతాకాదు. శాశ్వతంగా తమకు దూరమైన ఆప్తులకు కనీసం కడసారి వీడ్కోలు చెప్పేందుకు కూడా వీలులేక అల్లా‍డిపోతున్నాయి.ఈ క్రమంలో రాజస్థాన్‌లో షాకింగ్‌ ఉదంతం ఒకటి కలకలం రేపింది. కరోనాతో మృతి చెందిన  తండ్రి మరణాన్ని తట్టుకోలేని ఓ కుమార్తె ఆయన  మండుతున్న చితిపై దూకేసింది. ఇటీవలే  తల్లి కూడా ప్రాణాలు కోల్పోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన కుమార్తె తండ్రి చితిలో దూకి ఆత్మహత్యకు యత్నించిన ఘటన పలువురిని కంట తడిపెట్టించింది. రాజస్థాన్‌ బార్మెర్ జిల్లా రాయ్ కాలనీలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. 

పాక్ సరిహద్దుల్లో  బార్కర్‌ జిల్లా రాయ్ కాలనీలో నివాసం ఉంటున్న దామోదర్ దాస్‌ (73) ఇటీవల కరోనా బారిన పడ్డారు. ఈయనకు ముగ్గురు కుమార్తెలు. భార్య ఇటీవలే కన్నుమూసింది. దీంతో ముగ్గురు కుమార్తెలు ఆయనను కంటికి రెప్పలా కాపాడుకున్నారు. ఈ క్రమంలో తండ్రిని ఆసుపత్రిలో చేర్పించి  చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఆరోగ్యం విషమించి ఆయన కన్ను మూశారు. దీంతో కుటుంబ సభ్యులు, గ్రామపంచాయితీ సిబ్బంది, అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. బంధువుల సమక్షంలో  దామెదర్‌ చిన్న కుమార్తె శారద(34) తండ్రి చితికి నిప్పంటించారు. ఇంతలో అందరూ చూస్తుండగానే ఆమె కాలుతున్న చితిపైకి దూకేసింది. దీంతో అక్కడున్నవారంతా హతాశులయ్యారు. వెంటనే తేరుకుని ఆమెను తప్పించి ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే శారదకు 70 శాతానికి పైగా గాయాలయినట్లు వైద్యులు తెలిపారు. ఆమెను కాపాడే క్రమంలో మరో ఇద్దరికి కూడా గాయాలయ్యాయి. ఈ ఘనటపై వివరాలను పరిశీలిస్తున్నామని దర్యాప్తు కొనసాగుతోందని అధికారి ఆనంద్ సింగ్ వెల్లడించారు. బాధితురాలిని మెరుగైన చికిత్స నిమిత్తం జోధ్‌పూర్‌కు తరలించినట్టు  చెప్పారు. గాయపడిన మరో ఇద్దరిని  సమీప ఆసుపత్రికి తరలించినట్లు  తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement