ఐదు రోజులు ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడి.. 

Chinese Student Dies After Overworking For A Gaming Company - Sakshi

అతిగా పనిచేసి ప్రాణాలు కోల్పోయిన ఇంటర్న్‌షిప్‌ ఉద్యోగి 

బీజింగ్‌: తాను పనిచేసే మీడియా కంపెనీ కోసం లైవ్‌–స్ట్రీమింగ్‌లో ఏకధాటిగా గేమ్‌ ఆడుతూ ఒక ఉద్యోగి ప్రాణాలు కోల్పోయిన ఘటన చైనాలో చోటుచేసుకుంది. నవంబర్‌ 10నాటి దుర్ఘటన వివరాలను ‘ది పేపర్‌’వార్తాసంస్థ తన కథనం ప్రచురించింది. లీ హావో అనే విద్యార్థి హెనాన్‌ రాష్ట్రంలోని పింగ్‌డింగ్‌షాన్‌ వొకేషన్, ట్రైనింగ్‌ కళాశాలలో వచ్చే ఏడాది జూన్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేయనున్నాడు. కోర్సు ముగిసేలోపు కాలేజీ నిబంధనల ప్రకారం ఏదైనా గేమ్స్‌ సంబంధ మీడియా సంస్థలో ఇంటర్న్‌షిప్‌ పూర్తిచేయాలి.

అందుకోసం క్విన్‌యీ కల్చర్‌ అండ్‌ మీడియా కంపెనీలో తాత్కాలిక ఉద్యోగిగా చేరి ఆన్‌లైన్‌లో గేమ్స్‌ ఆడే లైవ్‌–స్ట్రీమర్‌గా విధుల్లో చేరాడు. మొదట్లో ఉదయ సమయంలో పనిచేసిన ఇతను తర్వాత కంపెనీ ఆదేశాల మేరకు రాత్రిళ్లు గేమ్స్‌ ఆడేవాడు. 3,000 యువాన్ల జీతం రావాలంటే 26 రోజుల్లో 240 గంటలపాటు ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడాలి. నెలకు 15 చొప్పున షార్ట్‌ వీడియోలను అప్‌లోడ్‌ చేయాలి.

ప్రతి రోజూ రాత్రి తొమ్మిదింటి నుంచి ఉదయం ఆరింటిదాకా ఏకధాటిగా ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడాలి. దీంతో లీ హావో గత ఐదు రోజులుగా ఏకధాటిగా గేమ్స్‌ ఆడుతూ శ్వాస పీల్చుకోవడం ఇబ్బందై కుప్పకూలిపోయాడు. ఇతడిని ఆస్పత్రికి తరలించినా అప్పటికే ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు ధృవీకరించారు. ఘటనపై కంపెనీ మాత్రం తమకేం సంబంధం లేదని స్పష్టంచేసింది. ‘‘ బాధితుని కుటుంబానికి 5,000 యువాన్లు(దాదాపు రూ.58,750) నగదు సాయం అందిస్తాం’’అని కంపెనీ చేతులు దులిపేసుకుంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top