
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): టీడీపీ నేత వర్ల రామయ్య తనయుడు, కృష్ణాజిల్లా పామర్రు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి వర్ల కుమార్‌రాజా (రాజా)పై కేసు నమోదైంది. డివిజన్ అభివృద్ధి పనుల కోసం నిర్మించిన శిలాఫలకం దిమ్మె కూల్చివేయడం, పనులు చేస్తున్న కాంట్రాక్టర్‌ను చంపేస్తానని బెదిరించిన ఘటనపై విజయవాడలోని భవానీపురం పోలీసులు కుమార్‌రాజాపై కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. విజయవాడ విద్యాధరపురం 44వ డివిజన్ చిన్న సాయిబాబా గుడి ఎదురుగా అంబేడ్కర్ నగర్‌లో మంచినీటి పైపులైన్ నిర్మాణానికి రూ.50 లక్షలు మంజూరయ్యాయి.
ఈ పనుల శంకుస్థాపన కోసం అంబేడ్కర్ నగర్ ఆర్చి వద్ద శిలాఫలకం ఏర్పాటుచేసేందుకు కాంట్రాక్టర్ శేఖర్ దిమ్మె నిర్మాణ పనులు ప్రారంభించారు. ఇంత లో వర్ల కుమార్‌రాజా అక్కడకు వచ్చి శిలాఫలకం నిర్మాణం చేయొద్దంటూ అడ్డుకున్నారు. ఆర్చికి అడ్డువస్తుందంటూ వాగ్వాదానికి దిగి చంపేస్తానంటూ కాంట్రాక్టర్‌ను బెదిరించారు. అంతటితో ఆగక దిమ్మెను కూల్చివేశారు. ఈ విషయాన్ని కాంట్రాక్టర్ శేఖర్ ఇంజినీరింగ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మున్సిపల్ ఏఈ ఇస్సార్ అహ్మద్ భవానీపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ ఘటనలో కుమార్‌రాజాపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత డివిజన్ అభివృద్ధి పనులు చేపడుతుంటే జీర్ణించుకోలేక ఇలా ధ్వంస రచన చేయడంపై కాలనీ వాసులు మండిపడుతున్నారు. పేదలకు తాగునీరు అందడం వర్ల రామయ్య, ఆయన తనయుడుకు ఇష్టంలేదా అని ప్రశ్నిస్తున్నారు.