Karnataka: బుల్లెట్‌ను ఢీకొని వంతెన గోడమీదకు దూసుకెళ్లిన కారు

Car Accident Tragedy In Karnataka - Sakshi

సాక్షి, బొమ్మనహళ్లి (కర్ణాటక): ఇటీవల ఆడి కారు ప్రమాదంలో ఏడుగురు మృత్యువాత పడిన దుర్ఘటన మరువకముందే మరో రోడ్డు బీభత్సం చోటుచేసుకుంది. బెంగళూరులో బొమ్మనహళ్ళి–ఎలక్ట్రానిక్‌ సిటీ మధ్యలోనున్న వంతెన పైన మంగళవారం రాత్రి జరిగిన ప్రమాదంలో ఇద్దరు టెక్కీలు వంతైన పై నుంచి కింద పడి దుర్మరణం చెందారు. మృతులు తమిళనాడుకు చెందిన ప్రీతం (30), కృతికా రామన్‌ (28)గా పోలీసులు గుర్తించారు.  

వంతెన మీద ఆగడమే తప్పయింది..  
ఎలక్ట్రానిక్‌ సిటీ ట్రాఫిక్‌ పోలీసులు తెలిపిన ప్రకారం.. ప్రీతం జేపీ నగరలో నివాసం ఉంటూ సర్జాపుర రోడ్డులోని ఒక ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాడు. కృతికా రామన్‌ మహాదేవపురలో నివాసం ఉంటోంది. ఇద్దరూ మంచి స్నేహితులు. మంగళవారం రాత్రి 9:45 సమయంలో ఇద్దరూ బెంగళూరు నుంచి రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌పై హోసూరు వైపు వెళ్తున్నారు. సరిగ్గా వంతెనపైకి రాగానే బైక్‌లో ఏదో సమస్య రావడంతో నిలిపి చూడసాగారు.  

మృత్యుశకటమైన కారు..  
ఇంతలో ఒక మారుతి బాలెనో కారు వేగంగా వచ్చి ప్రీతం, కృతికాలను ఢీకొట్టడంతో వారు 50 అడుగుల దూరం ఎగిరి వంతెన పై నుంచి కింద సర్వీసు రోడ్డుపై పడిపోయారు. వంతెన ఎత్తు సుమారు 40 అడుగుల పైనే ఉంటుంది. ఇద్దరూ క్షణాల్లో మృత్యువాత పడ్డారు. దీంతో రోడ్డుపై పెద్దసంఖ్యలో జనం పోగయ్యారు. మృతదేహాల నుంచి రక్తం రోడ్డుపై ధారలు కట్టడం, వాహనాల విడిభాగాలు చెల్లాచెదురుగా పడిపోవడంతో భయానకంగా కనిపించింది. కారు వంతెన గోడను సగం వరకూ ఎక్కి నిలిచిపోయింది. 

కారులోని ఇద్దరికి గాయాలు..  
కారు నడుపుతున్న బెంగళూరు ఆనేకల్‌వాసి నితీష్‌ (23), అతని స్నేహితుడు తీవ్రంగా గాయపడ్డారు. కొంతసేపటికి పోలీసులు చేరుకుని మృతదేహాలను సెయింట్‌జాన్స్‌ ఆస్పత్రికి, క్షతగాత్రులను ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మద్యం మత్తులో కారును వేగంగా నడపడమే కారణమని అనుమానిస్తున్నారు. జంట బ్రిడ్జి పై నుంచి కింద పడడం అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయింది. ట్రాఫిక్‌ జాయింట్‌ కమిషనర్‌ బీఆర్‌. రవికాంత్‌గౌడ ఘటనాస్థలిని పరిశీలించారు. కేసు దర్యాప్తులో ఉంది.   

చదవండి: Hyderabad: తొమ్మిదేళ్ల బాలికను షెటర్‌లోకి తీసుకెళ్లి..
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top