ఉత్తుత్తి కంపెనీలు.. ఊళ్లు దాటిన వేల కోట్లు

CA Arrested By ED In Rs 1, 100 Crore Money Laundering Case - Sakshi

రూ.1,100 కోట్లను పక్క దేశాలకు తరలించేందుకు సహకరించిన చార్టెడ్‌ అకౌంటెంట్‌ 

621 కంపెనీలు సృష్టించిన సీఏ రవికుమార్‌ అరెస్టు 

సాక్షి, హైదరాబాద్‌: చైనా, హాంకాంగ్‌లకు చెందిన గేమింగ్, డేటింగ్‌ యాప్స్‌ కేసులో ఈడీ సంచలన విషయాలు బయటపెట్టింది. యాప్స్‌ నిర్వహిస్తున్న కంపెనీల లావాదేవీలు చూస్తున్న చార్టెడ్‌ అకౌంటెంట్‌ రవికుమార్‌.. రూ.1,500లకో సంతకంతో వేల కోట్లు దేశం దాటేలా సహకరించాడని వెల్లడించింది. షెల్‌ కంపెనీల లావాదేవీలకు బోగస్‌ సర్టిఫికెట్లు జారీ చేసి రూ.1,100 కోట్లు చైనా, హాంకాంగ్‌ చేరేలా చేశాడని చెప్పింది.

హెయిర్‌ మర్చంట్స్‌.. క్రిప్టో కరెన్సీ రూపంలో 
ఢిల్లీకి చెందిన చార్టెట్‌ అకౌంటెంట్‌ రవికుమార్‌.. చైనా, హాంకాంగ్‌కు చెందిన లింక్యూన్‌ టెక్నాలజీ ప్రైవేట్‌ లిమిటెడ్, డోకిపే టెక్నాలజీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీల లావాదేవీలు చూస్తున్నాడు. సంబంధిత కంపెనీలు మన దేశంలో డేటింగ్, గేమింగ్‌ యాప్‌ల ద్వారా వేల కోట్లు వసూలు చేసి మోసం చేశాయి. ఈ డబ్బు ను మనీలాండరింగ్‌ ద్వారా రవికుమార్‌ దేశం దాటించినట్టు ఈడీ గుర్తించింది.

నకిలీ ఎయిర్‌ వే బిల్లులు, సీసీ కెమెరాల క్లౌడ్‌ స్టోరేజ్‌ మెయింటెనెన్స్‌ పేరుతో నకిలీ బిల్లులు సృష్టించి ఎస్‌బీఐ, ఎస్‌బీఎమ్‌ బ్యాంకుల ద్వారా రూ.1,100 కోట్ల డబ్బును రవికుమార్‌ దేశం దాటించినట్టు ఈడీ గుర్తించింది. కొంత డబ్బును హవాలా రూపంలో హెయిర్‌ మర్చంట్స్, క్రిప్టో కరెన్సీ పేరుతో సింగపూర్‌కు మళ్లించినట్టు తేల్చింది.  

సంతకానికి రూ. 1,500
మనీ లాండరింగ్‌ ద్వారా రూ.1,100 కోట్లను దేశాన్ని దాటించేందుకు చైనా, హాంకాంగ్‌లో ఉన్న మాఫియా నేతృత్వంలో రవికుమార్‌ 621 బోగస్‌ కంపెనీలు సృష్టించాడని, అలాగే బోగస్‌ ఫామ్‌ 15 సీబీ సర్టిఫికెట్లు జారీ చేశాడని ఈడీ గుర్తించింది. చార్టెడ్‌ అకౌంటెంట్‌గా బ్యాలెన్స్‌ షీట్లను చూడకుండానే షెల్‌ కంపెనీలకు సంతకాలు చేశాడంది.

ఈ మొత్తం వ్యవహారంలో రవికుమార్‌ తన ప్రతి సంతకానికి రూ.1,500 చొప్పున తీసుకున్నట్టు గుర్తించింది. బోగస్‌ కంపెనీల సృష్టికర్తలు ప్రస్తుతం పరారీలో ఉన్నారని, రవికుమార్‌ను అరెస్ట్‌ చేసి నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టామని ఈడీ తెలిపింది. రవికుమార్‌ను విచారించేందుకు కోర్టు 5 రోజుల కస్టడీకి అనుమతించినట్టు చెప్పింది.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top