MLA Raja Singh Arrest: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ అరెస్ట్‌

BJP MLA Rajasingh Arrest Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ అరెస్ట్‌ అయ్యారు. ఎల్లారెడ్డిపేట వెళ్తుండగా రాజాసింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేటలో టీఆర్‌ఎస్‌ వర్సెస్‌ బీజేపీ అన్నట్లు ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గత రాత్రి  టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య ఇంటిపై బీజేపీ నేతల దాడి చేశారు. తోట ఆగయ్య ఇంటిని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకే రవిశంకర్ సందర్శించి ఆగయ్యను పరామర్శించారు. 

ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ.. ఒక మంత్రిగా ఆగయ్యను పరామర్శించేందుకు రాలేదు, ఒక కార్యకర్తగా, ఒక కుటుంబ సభ్యునిగా పరామర్శించేందుకు వచ్చానని తెలిపారు.  బీజేపీలో అసమ్మతి, పార్టీలో లుకలుకల వల్లనే టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరుతున్నారని, అక్కసుతో దాడులకు దిగుతున్నారని మండిపడ్డారు. గోపి అనే వ్యక్తి తుపాకీ పట్టుకొని, కొంతమంది బీజేపీ కార్యకర్తలు కట్టెలు పట్టుకొని దాడికి వచ్చారని దుయ్యబట్టారు.

బడుగు బలహీన వర్గాల మీద యూపీ, గుజరాత్, బీహార్ సంసృతిని నమ్ముకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము పిలుపునిస్తే బీజేపీ బలమెంత? అని ప్రశ్నించారు. మీరు(బీజేపీ) దాడులు చేసి మమ్మల్ని రెచ్చ గొడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తపైన దాడులకు దిగినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. బీజేపీ వాళ్లు పిడికెడు.. మేం పుట్టెడు మంది ఉన్నామని మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ అన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top