తగులబెట్టిన కారు డిక్కీలో బీజేపీ నేత శవం

BJP Leader Dead Body In Burned Car - Sakshi

మెదక్‌ జిల్లాలో కలకలం రేపిన హత్య 

వెల్దుర్తి మండలం మంగళపర్తి గ్రామ శివారులో ఘటన 

పూర్తిగా కాలిపోయిన మృతదేహం, కారు 

హతుడు మెదక్‌ పట్టణానికి చెందిన శ్రీనివాస్‌గా గుర్తింపు 

వెల్దుర్తి, మెదక్‌ జోన్‌: మెదక్‌ జిల్లా వెల్దుర్తి మండలం మంగళపర్తి గ్రామశివారులో (యశ్వంతరావ్‌పేట రెవెన్యూ పరిధిలో) దారుణ హత్య జరిగింది. తగులబెట్టిన హోండాసిటీ కారు డిక్కీలో కన్పించిన శవం కలకలం రేపింది. హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని డిక్కీలో బెట్టి కారును తగులబెట్టారా? లేక సజీవదహనం చేశారా అనేది తెలియలేదు. ఎక్కడో హత్యచేసి మంగళపర్తి శివారులో కారుతో పాటు దహనం చేసినట్టుగా భావిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. కారుపై ఉన్న రిజిస్ట్రేషన్‌ నంబర్‌ ఆధారంగా హత్యకు గురైన వ్యక్తి మెదక్‌ పట్టణానికి చెందిన బీజేపీ నేత ధర్మాకర్‌ శ్రీనివాస్‌ (45) అలియాస్‌ కటికె శ్రీనుగా గుర్తించారు. సోమవారం రాత్రి సుమారు 10:30 సమయంలో జరిగినట్టుగా భావిస్తున్న ఈ హత్యోదంతం మంగళవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. మెదక్‌ ఏఎస్పీ కృష్ణమూర్తి, తూప్రాన్‌ డీఎస్పీ కిరణ్‌ కుమార్‌తో పాటు క్లూస్‌ టీం సంఘటన స్థలంలో వివరాలు సేకరించింది.  

సెల్‌ఫోన్‌లో చిత్రీకరించిన ఆటో డ్రైవర్‌ 
వెల్దుర్తి–నర్సాపూర్‌ ప్రధాన రహదారిలో మంగళపర్తి గ్రామ శివారులో ప్రధాన రహదారి పక్కన సోమవారం రాత్రి 10:30 సమయంలో కారు తగలబడడాన్ని మంగళపర్తి గ్రామానికి చెందిన ఓ ఆటోడ్రైవర్‌ మొదట గుర్తించాడు. నర్సాపూర్‌ నుంచి తన ఆటోలో స్నేహితుడితో కలిసి ఇంటికి వస్తూ కారు తగలబడుతున్న దృశ్యాలను తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడు.

అదేరాత్రి గ్రామానికి చెందిన ఓ వాట్సాప్‌ గ్రూపులో పోస్ట్‌ చేశాడు. స్థానిక సర్పంచ్‌ రామకృష్ణారావు ఇచ్చిన సమాచారంతో మంగళవారం ఉదయం  వెల్దుర్తి ఎస్‌ఐ మహేందర్‌ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించగా కారు డిక్కీలో శ్రీనివాస్‌ మృతదేహం కన్పించింది. దీంతో మెదక్‌ పట్టణంలోని శ్రీనివాస్‌ ఇంటికి వెళ్లిన పోలీసులు కుటుంబసభ్యుల నుంచి కొంత సమాచారం సేకరించారు. 9వ తేదీన శ్రీనివాస్‌ ఇంట్లో నుంచి ఎన్నిగంటలకు వెళ్లాడు? ఎప్పటివరకు ఫోన్‌ ఆన్‌లో ఉంది? తదితర వివరాలు తెలుసుకున్నారు. శ్రీనివాస్‌ డైరీతో పాటు ఇంటివద్ద ఉన్న సీసీ టీవీ పుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  

పెట్టుడు పళ్ల ఆధారంగా గుర్తింపు 
మృతదేహం పూర్తిగా కాలిపోయి ఉండడం, శరీరంపై ఆనవాళ్లు కూడా సరిగా కన్పించకపోవడంతో వైద్య సిబ్బంది సంఘటనా స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించారు. శ్రీనివాస్‌కు మూడు పెట్టుడు దంతాలు ఉన్నాయని వైద్యులు నిర్ధారించారు. అయితే మొదట తన భర్తకు రెండే పెట్టుడు పళ్లు ఉన్నాయని, మృతదేహం తన భర్తది కాదని చెప్పిన శ్రీనివాస్‌ భార్య హైందవి కాసేపటికి మాటమార్చింది.

మృతదేహం తన భర్తదేనని, వివాహేతర సంబంధాల వల్ల తమ మధ్య తరచు గొడవలు జరిగేవని చెప్పింది. ఇద్దరు మహిళలతో తన భర్తకు సంబంధం ఉందని, వారి కుటుంబసభ్యులే ఈ హత్య చేసి ఉంటారని లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసింది. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో ఉన్న గొడవలు కూడా హత్యకు కారణమై ఉండవచ్చని పేర్కొంది. వెల్దుర్తి మండల పరిధిలోని మారెపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళపై అనుమానం వ్యక్తం చేసింది. శ్రీనివాస్‌కు ముగ్గురు పిల్లలు ఉన్నారు.  

నాలుగు బృందాల ఏర్పాటు: తూప్రాన్‌ డీఎస్పీ 
మంగళపర్తి హత్యోదంతం కేసును త్వరలోనే ఛేదిస్తామని తూప్రాన్‌ డీఎస్పీ కిరణ్‌కుమార్‌ చెప్పారు. హంతకులను పట్టుకోవడానికి నాలుగు బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. హతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నామన్నారు. శ్రీనివాస్‌ను ఎక్కడో హత్యచేసి తీసుకొచ్చి మంగళపర్తి శివారులో కారుతో పాటు దహనం చేసి ఉంటారని చెప్పారు. సోమవారం సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో అతని సెల్‌ ఫోన్‌ స్విచ్చాఫ్‌ అయ్యిందన్నారు.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top