అయ్యో.. పాపం.. నలుగురిని బలిగొన్న నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ | Sakshi
Sakshi News home page

అయ్యో.. పాపం.. నలుగురిని బలిగొన్న నిర్లక్ష్యపు డ్రైవింగ్‌

Published Thu, Jan 20 2022 3:44 PM

Auto Rickshaw calvert Road Accident Kadem Adilabad District - Sakshi

కడెం(ఖానాపూర్‌): నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ నలుగురి ప్రాణాలను బలితీసుకుంది. బాధిత కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. బిడ్డను చూసేందుకు వెళ్తున్న ఓ తండ్రిని, ఇతర పనుల నిమిత్తం వెళ్తున్న మరో ముగ్గురు మహిళలను అన్యాయంగా పొట్టనబెట్టుకుంది ఆటో రూపంలో వచ్చిన రహదారి ప్రమాదం. హృదయ విదారకమైన ఈ ఘటన నిర్మల్‌ జిల్లా కడెం మండలంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కడెం నుంచి ఎనిమిది మంది ప్రయాణికులతో బయలుదేరిన ఆటో చిన్నబెల్లాల్‌ వైపు వెళ్తుండగా పెద్ద బెల్లాల్‌ సబ్‌స్టేషన్‌ మూలమలుపు వద్ద అదుపుతప్పి కల్వర్టుపై నుంచి కింద పడింది.

పది అడుగుల పై నుంచి ఆటో కింద పడడంతో పెద్దబెల్లాల్‌ గ్రామానికి చెందిన చీమల శాంత(45), లింగాపూర్‌ పంచాయతీ పరిధి మల్లన్నపేట్‌ గ్రామానికి చెందిన బోడ మల్లయ్య(60), కన్నాపూర్‌ పంచాయతీ పరిధి చిన్నక్యాంప్‌ గ్రామానికి చెందిన కొండ్ర శంకరవ్వ(48) అక్కడికక్కడే దుర్మరణం చెందారు. తీవ్రంగా గాయపడిన దస్తురాబాద్‌ మండలం గొడిసెర్యాలకు చెందిన శ్రీరాముల లక్ష్మి(60) నిర్మల్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది.

అలాగే ఆటోలో ప్రయాణిస్తున్న అక్షయ్, కోల శ్రీనుతోపాటు డ్రైవర్, మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను నిర్మల్, జగిత్యాల ఆసుపత్రులకు తరలించారు. ఘటనా స్థలాన్ని ఖానాపూర్‌ సీఐ ఆజయ్‌బాబు, ఎస్సై రాజు పరిశీలించారు. డ్రైవర్‌ అజాగ్రత్త వల్లే ప్రమాదం జరిగిందని, ఘటనపై పూర్తి విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు. మల్లయ్య తన బిడ్డను చూసేందుకు చిన్నబెల్లాల్‌ వెళ్తున్నాడు. చీమల శాంత, కొండ్ర శంకరవ్వ బొర్నపల్లికి, శ్రీమంతుల లక్ష్మి జగిత్యాల వైపు పని నిమిత్తం వెళ్తున్నారు. లక్ష్మికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు. శాంతకు నలుగురు కూతుళ్లు, భర్త ఉన్నారు.

డ్రైవర్‌ నిర్లక్ష్యంతోనే..
నిబంధనల ప్రకారం నలుగురు మాత్రమే ప్రయాణించాల్సిన ఆటోలో ఎనిమిది మంది ప్రయాణికులతో వెళ్తున్నారు. మండల కేంద్రానికి చెందిన ఆటో డ్రైవర్‌తో పాటు, బెల్లాల్‌ గ్రామానికి చెందిన అతడి స్నేహితుడు పలుమార్లు రన్నింగ్‌లోనే ఆటో స్టీరింగ్‌ను మార్చుకుంటూ అతి వేగంగా వెళ్లడం వల్లే ప్రమాదం జరిగినట్లు సమాచారం. అయితే ఈ ఆటోను నడిపిస్తున్న ఇద్దరు యువకులు మైనర్లేనని స్థానికులు పేర్కొన్నారు.

ఊపిరాడక మరణించారా?
మూలమలుపు వద్ద రహదారికి కొద్దిపాటి ఎత్తులో ఉన్న కల్వర్టు రక్షణ గోడను ఎక్కి సుమారు పది అడుగులో లోతులో ఆటో పడిపోయింది. పక్కనే ఉన్న చెరువు నుంచి పొలాలకు సాగునీటిని అందించే ఈ కాలువగుండా కొద్దిపాటి నీరు ప్రవహిస్తోంది. క్షతగాత్రులు ఆటో కింద పడిపోగా బురద నీటిలో కురుకుపోవడం వల్ల శ్వాస అందక మృతిచెంది ఉండవచ్చని అంబులెన్స్‌ సిబ్బంది పేర్కొన్నారు.

మిన్నంటిన కుటుంబ సభ్యుల రోదనలు
ప్రమాదంలో మృతిచెందిన నలుగురి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ‘నాన్న.. నన్ను చూసేందుకు వచ్చినవా.. ఏమైంది నాన్న.. లే నాన్న.. నీ బిడ్డ వచ్చింది సూడు నాన్న..’ అంటూ బోడ మల్లయ్య కూతురు విలపించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. ‘బిడ్డా..మమ్ములను విడిచిపెట్టి పోయినవా.. నీ బిడ్డలు కూడా గుర్తు రాలేదా.. వాళ్లకు ఏం జెప్పినవ్‌..’ అంటూ కొండ్ర శంకరవ్వ తల్లి రోదించింది.

Advertisement
Advertisement