అచ్చెన్న బరితెగింపు

Atchannaidu Kinjarapu Threats for forced Unanimous in Nimmada - Sakshi

నిమ్మాడలో బలవంతపు ఏకగ్రీవం కోసం బెదిరింపులు 

దారికి రాలేదని సోదరుడి కుమారుడు కింజరాపు అప్పన్నపై దౌర్జన్యం 

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/టెక్కలి: ఒకవైపు.. బలవంతపు ఏకగ్రీవాలను సహించబోమంటూ కూడబలుక్కున్నట్లుగా ఎస్‌ఈసీ నిమ్మగడ్డ, టీడీపీ అధినేత చంద్రబాబు ఒకే వేవ్‌ లెంగ్త్‌తో చెబుతుంటారు. ఆ పార్టీ నేతలు మాత్రం బలవంతపు ఏకగ్రీవాలే కాదు.. ప్రత్యర్థులను బెదిరిస్తూ భౌతిక దాడులతో అంతం చేసేందుకూ వెనుకాడటం లేదు. ఇదీ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలపై టీడీపీ దుర్నీతి!

నిమ్మాడలో అచ్చెన్న నియంతృత్వం..
ఏపీ టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు తన స్వగ్రామం శ్రీకాకుళం జిల్లాలోని నిమ్మాడలో ఎప్పటిలాగే నియంతృత్వ పోకడలకు తెర తీశారు. బలవంతంగా ఏకగ్రీవం చేసుకునేందుకు అరాచకానికి ఒడిగట్టారు. తమకు పోటీగా సర్పంచ్‌ పదవికి బరిలో నిలిచారనే అక్కసుతో వరుసకు తన సోదరుడి కుమారుడైన కింజరాపు అప్పన్నపై పార్టీ శ్రేణులను దాడులకు పురిగొల్పారు. నామినేషన్‌ కేంద్రంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. అప్పన్న వెనక్కి తగ్గకపోవడంతో అచ్చెన్నాయుడు సోదరుడు హరిప్రసాద్‌ నామినేషన్‌ కేంద్రంలోకి చొరబడి వీరంగం సృష్టించాడు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ నేతల దాడిలో టెక్కలి సీఐ నీలయ్య దుస్తులు చిరిగిపోయాయి. సమాచారం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు భారీగా తరలిరావడం, పోలీసులు బందోబస్తు కల్పించడంతో ఎట్టకేలకు ఆదివారం సాయంత్రం కింజరాపు అప్పన్న నామినేషన్‌ దాఖలు చేయగలిగారు. 

ఇదేమైనా రాష్ట్రపతి పదవా? అంటూ ఎద్దేవా
నిమ్మాడ పంచాయతీని బలవంతంగా ఏకగ్రీవం చేసుకునేందుకు అచ్చెన్నాయుడు తన సోదరుడు హరిప్రసాద్‌ కుమారుడు సురేష్‌ను బరిలోకి దించారు. ఆయనకు పోటీగా ఏ ఒక్కరూ నామినేషన్‌ వేయకుండా జాగ్రత్తపడ్డారు. అయితే టీడీపీ హయాంలో అచ్చెన్నాయుడు వల్ల పలు ఇబ్బందులకు గురైన కింజరాపు అప్పన్న సర్పంచ్‌గా పోటీకి దిగారు. దీంతో ఆయన ఇంటికి అచ్చెన్నాయుడు తన బంధువులను పంపి వార్నింగ్‌ ఇచ్చారు. అయితే అప్పన్న వెనక్కి తగ్గకపోవడంతో నేరుగా ఫోన్‌ చేసి బెదిరించారు. గత ప్రభుత్వంలో మీవల్లే తన భార్య ఉద్యోగం పోయిందంటూ అప్పన్న ఫోన్‌లోనే ఆవేదన వ్యక్తం చేయగా ‘‘సర్పంచ్‌ పదవి ఏమైనా రాష్ట్రపతి పదవా?..’’ అంటూ అచ్చెన్న ఎద్దేవా చేశారు. ఈ నేపథ్యంలో అప్పన్న టెక్కలి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్‌ వద్దకు వచ్చి నామినేషన్‌ వేస్తానని, తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ క్రమంలో ఆయన అప్పన్న నామినేషన్‌ కార్యక్రమానికి హాజరయ్యేందుకు అంగీకరించారు. 

నామినేషన్‌ కేంద్రంలోనే దాడి..
నామినేషన్‌ కేంద్రానికి వచ్చిన అప్పన్నపై టీడీపీ మద్దతుదారుడిగా పోటీ చేస్తున్న కింజరాపు సురేష్‌ తండ్రి హరిప్రసాద్‌ దూషణలకు దిగారు. దువ్వాడ శ్రీనివాస్‌ తదితరులను దుర్భాషలాడారు. అనంతరం హరిప్రసాద్, సురేష్, అచ్చెన్నాయుడు అనుయాయులు నామినేషన్‌ కేంద్రంలోకి చొచ్చుకెళ్లి అప్పన్న, దువ్వాడ శ్రీనివాస్‌లను గెంటేసి దాడికి దిగారు. నామినేషన్‌ కేంద్రం బయట నిరీక్షిస్తున్న వాన ఆదినారాయణ కారును ధ్వంసం చేయడమే కాకుండా భౌతిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆయన ఆభరణాలు కూడా పోయాయి. దువ్వాడ శ్రీనివాస్‌పై కూడా దాడి చేసేందుకు ప్రయత్నించడంతో ఆయన అనుచరులు కారులో తరలించారు.

అప్పన్న, దువ్వాడ శ్రీనివాస్, వాన ఆదినారాయణ రెప్పపాటులో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. గ్రామంలో కనిపించిన కొత్త వ్యక్తులపై టీడీపీ శ్రేణులు దాడులకు పాల్పడ్డాయి. ఈ ఘటనలను చిత్రీకరిస్తున్న వారి ఫోన్లను లాక్కున్నారు. ఈ సమాచారం తెలియడంతో వైఎస్సార్‌ సీపీ శ్రేణులు అక్కడకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం అప్పన్నతోపాటు మరో ఇద్దర్ని పోలీసు వాహనంలో తరలించి నామినేషన్‌ వేయించారు. అచ్చెన్నాయుడు ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు అప్పన్న సిద్ధమయ్యారని దువ్వాడ శ్రీనివాస్‌ పేర్కొన్నారు. నిమ్మాడలో అచ్చెన్న అనుచరుల దౌర్జన్యకాండపై ఆయన కోటబొమ్మాళి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

రేపు నిమ్మాడకు విజయసాయిరెడ్డి... 
వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి ఫిబ్రవరి 2న నిమ్మాడకు రానున్నారు. అప్పన్నను పరామర్శించి అండగా నిలుస్తామని భరోసా ఇవ్వనున్నారు. 

అచ్చెన్నపై ఈసీ చర్యలు తీసుకోవాలి: ధర్మాన
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): నామినేషన్‌ వేసేందుకు వెళ్లిన వారిని అడ్డుకుని బెదిరింపులకు పాల్పడిన కింజరాపు అచ్చెన్నాయుడు, ఆయన అనుచరులపై ఎన్నికల కమిషన్‌  చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ ఆదివారం  డిమాండ్‌ చేశారు.  గ్రామాల్లో అలజడులు రేపేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top