ఏఎస్పీకి నాలుగు వారాల జైలుశిక్ష

ASP Was Sentenced To Four Weeks In Jail - Sakshi

విజయవాడ ఏసీపీగా పనిచేసిన కాలంలో కోర్టును తప్పుదోవ పట్టించినందుకు..

సాక్షి, అమరావతి: కోర్టు ఆదేశాలను అమలు చేయకపోవడమే కాకుండా కోర్టు ధిక్కార కేసులో కోర్టును తప్పుదోవ పట్టించేలా వ్యవహరించినందుకు గతంలో విజయవాడ  ఏసీపీగా పని చేసిన (ప్రస్తుత శ్రీకాకుళం స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో ఏఎస్పీ) కె.శ్రీనివాసరావుకు హైకోర్టు 4 వారాల జైలు శిక్ష, రూ.1,000 జరిమానా విధించింది. జరిమానా చెల్లించని పక్షంలో మరో వారం రోజులు జైలు శిక్ష అనుభవించాలని తేల్చి చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ శుక్రవారం తీర్పు వెలువరించారు. ఈ ఆదేశాల అమలును వారం రోజుల పాటు నిలిపేయాలని శ్రీనివాసరావు తరఫున ప్రభుత్వ న్యాయవాది (హోం) వి.మహేశ్వరరెడ్డి అభ్యర్థించగా.. తీర్పు అమలును వారం నిలిపివేస్తూ ఉత్తర్వులిచ్చారు.

లెక్చరర్‌ ఫిర్యాదుతో..
గుంటూరుకు చెందిన బి.ఝాన్సీలక్ష్మి అనే లెక్చరర్‌ 2015లో కె.కోటేశ్వరరావు, ఎ.రమాదేవి అనే ఇద్దరు లెక్చరర్లపై కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేయడం లేదని, చార్జిషీట్‌ దాఖలు చేయడం లేదంటూ ఆమె 2016లో హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు విచారణ వేగంగా పూర్తి చేసి సంబంధిత కోర్టులో తుది నివేదిక దాఖలు చేయాలని అప్పటి సౌత్‌ జోన్‌ ఏసీపీని ఆదేశించింది.

ఆ ఆదేశాలను ఏసీపీ శ్రీనివాసరావు అమలు చేయడం లేదంటూ ఝాన్సీలక్ష్మి 2017లో కోర్టు ధిక్కార పిటిషన్‌ దాఖలు చేయగా.. సాక్ష్యాధారాలు లేనందున కేసు మూసివేశామని, సంబంధిత కోర్టులో తుది నివేదిక దాఖలు చేశామని 2017లో హైకోర్టుకు తెలియజేశారు. దీంతో హైకోర్టు కోర్టు ధిక్కార పిటిషన్‌ను మూసివేస్తూ ఉత్తర్వులిచ్చింది. అయితే, పోలీసులు దాఖలు చేసిన తుది నివేదిక సర్టిఫైడ్‌ కాపీ ఇవ్వాలంటూ ఝాన్సీలక్ష్మి సంబంధిత కోర్టులో దరఖాస్తు చేశారు. తుది నివేదిక దాఖలు చేయలేదని కోర్టు వర్గాలు ఆ దరఖాస్తును తోసిపుచ్చాయి. తుది నివేదిక దాఖలు చేయకుండా దాఖలు చేసినట్టు చెప్పి కోర్టు ధిక్కార వ్యాజ్యాన్ని మూసివేయించారంటూ ఏసీపీ శ్రీనివాసరావుపై ఝాన్సీలక్ష్మీ 2018లో మరో కోర్టు ధిక్కార పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ పైవిధంగా తీర్పునిచ్చారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top