కృష్ణానది ఏటిపాయలో ప్రమాదం

Accident in Krishna River at Etipaya - Sakshi

ఇద్దరు మృతి.. ఒకరు గల్లంతు

మద్యం సేవించి నదిలో ఈతకు దిగిన స్నేహితులు

పెనమలూరు: మిత్రులంతా కలసి  సరదాగా మద్యం సేవించి ఈతకు దిగి ప్రమాదవశాత్తు మృతి చెందిన ఘటన కృష్ణాజిల్లా పెనమలూరు మండలం చోడవరం ఘాట్‌ కృష్ణానదిలో చోటుచేసుకుంది. పెనమలూరు సీఐ ఆర్‌.గోవిందరాజు తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడ అజిత్‌ సింగ్‌నగర్‌లోని జారా రెస్టారెంట్‌ యజమాని అబ్దుల్‌రహీంబాషా (34) గురువారం రాత్రి తాను కొత్తగా కొన్న ఏపీ 39 ఆర్‌క్యూ 0786 కారులో విజయవాడ క్రీస్తురాజపురానికి చెందిన మిత్రులు ఈవెంట్స్‌ నిర్వహించే షేక్‌ ఖలీషా అలియాస్‌ పండు (30), కస్తూరిబాయిపేటకు చెందిన తాళ్లూరి కిరణ్‌ (37)తో కలిసి గురువారం రాత్రి చోడవరం ఘాట్‌ వద్దకు వచ్చారు. వీరు ఘాట్‌ సమీపంలో కృష్ణానది పాయ వద్ద మద్యం సేవించారు. ఆ తరువాత ముగ్గురు కృష్ణానదిలో ఈతకు దిగారు. ఈతకు దిగిన ముగ్గురు నదిలో గల్లంతయ్యారు. 

ఉదయం వెలుగు చూసిన ఘటన..  
కాగా శుక్రవారం ఉదయం నదిలో చేపలు పట్టడానికి వచ్చిన వ్యక్తులకు నది పాయవద్ద ఖరీదైన కారు, మద్యం సీసాలు, దుస్తులు కనబడ్డాయి. వారికి అనుమానం వచ్చి నదిలో చూడగా అప్పటికే ఖలీషా మృతదేహం నదిలో తేలుతూ కనబడింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు రంగంలోకి దిగి కారు వివరాలు మహిళా సంరక్షణ కార్యదర్శుల వాట్సాప్‌ గ్రూప్‌లో పెట్టారు.

గ్రూపుల్లో ఈ సమాచారం వ్యాపించడంతో కారు యజమాని అబ్దుల్‌రహీంబాషా వివరాలు తెలిశాయి. దీంతో కుటుంబ సభ్యులు నది వద్దకు చేరుకున్నారు. నది ఒడ్డున ఉన్న దుస్తులు, చెప్పులు చూసి తమ వారేనని ధ్రువీకరించారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు వెంటనే గజ ఈతగాళ్లను, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను రంగంలోకి దించారు. నీటిలో తేలుతున్న ఖలీషాను ఆ తరువాత వీరి గాలింపులో కారు యజమాని రహీంబాషా మృతదేహాన్ని బయటకు తీశారు. గల్లంతైన కిరణ్‌ ఆచూకీ తెలియలేదు.  గల్లంతైన కిరణ్‌ కోసం శనివారం నదిలో గాలిస్తామని అధికారులు తెలిపారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top