రహదారులపై మృత్యు ఘోష.. వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 9 మంది మృతి | Sakshi
Sakshi News home page

రహదారులపై మృత్యు ఘోష.. వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 9 మంది మృతి

Published Fri, Nov 4 2022 1:39 AM

9 People Died In Different Road Accidents In Telangana - Sakshi

జోగిపేట (అందోల్‌)/ధారూరు: రాష్ట్రంలో రహ దారులు నెత్తురోడాయి. గురువారం జరిగిన వే ర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 9 మంది మృత్యువాత పడ్డారు. వికారాబాద్‌ జిల్లా ధారూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతిచెందగా, సంగారెడ్డి జిల్లాలో జాతీయ రహదారిపై దట్టమైన పొగమంచు కారణంగా దారికనిపంచక జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించారు. దీంతో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

దారి కనిపించక కుటుంబం బలి
జీడిమెట్లలో నివాసం ఉంటున్న ఓ కుటుంబం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లా షాపూర్‌ నుంచి హైదరాబాద్‌కు కారులో బయలుదేరింది. ఉదయం 6.30 గంటల ప్రాంతంలో జోగిపేట వైపు నుంచి వస్తున్న నారాయణఖేడ్‌ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు రాంసానిపల్లి వద్ద జాతీయ రహదారిపై వారి వాహనాన్ని బలంగా ఢీకొంది.

పొగమంచు కారణంగా ఎదురుగా వచ్చే వాహనం కనిపించకపోవడంతో స్పీడ్‌గా వస్తున్న బస్సు కారును ఢీకొట్టి సుమారు 200 అడుగుల దూరం ఈడ్చుకెళ్లింది. కారు ముందుభాగం బస్సుకింద ఇరుక్కుపోయి నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో జీడిమెట్ల సుభాష్‌నగర్‌కు చెందిన ఎలక్ట్రిషియన్‌ దిలీప్‌ (50), భార్య వినోద (44), కూతురు సుప్రతిక (24), మనవరాలు కాన్షీ (ఏడాదిన్నర) అక్కడికక్కడే మృతి చెందారు.

ప్రమాదం జరగగానే అక్కడే రోడ్డు పక్కన పనిచేస్తున్న కూలీలు కారు వద్దకు పరుగెత్తివెళ్లి చూడగా, చిన్నారితోపాటు దిలీప్, వినోద మృతి చెందారు. తీవ్రగాయాలపాలైన సుప్రతిక కొట్టు మిట్టాడుతోంది. ఆమెను కాపాడేందుకు కారు డోర్లు తెరిచేందుకు ప్రయత్నించినా రాలేదు. చివరకు ఆమె కూడా పది నిమిషాల్లో మృత్యు ఒడిలోకి జారుకుంది.

కారు డోర్లు ఇరుక్కు పోవడంతో ఆమెను కాపాడలేకపో యామని ప్రత్యక్షసాక్షులు చెప్పారు. కళ్ల ముందే జరిగిన ఈ ఘోరమైన ఘటనను మరిచిపోలేక పోతున్నా మన్నారు. తల్లి ఒడిలోనే చిన్నారి తనువు చాలించడం అక్కడున్న వారి హృదయాలను కలిచి వేసింది. జేసీబీ, క్రేన్‌ సహాయంతో గంటకుపైగా శ్రమించి కారులో ఇరుక్కున్న మృతదేహాలను బయటికి తీశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జోగిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు సీఐ నాగరాజు తెలిపారు.

వద్దన్నా వెళ్లాడు..
దిలీప్‌ కూతురు సుప్రతిక, అల్లుడు ప్రదీప్‌రెడ్డికి మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతు న్నాయి. దీంతో గత నెల 31న అడ్వొకేట్‌తో మాట్లాడేందుకు కుటుంబంతోసహా మహారాష్ట్ర లోని స్వగ్రామమైన షాపూర్‌కు వెళ్లారు. కుమా రుడు వంశీని అక్కడే ఉంచి హైదరాబాద్‌కు తిరిగి వస్తుండగా ఇంతలోనే ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కుటుంబసభ్యులంతా మృతి చెందడంతో వంశీ అనాథయ్యాడు.

వంశీ ఇంటర్‌ సెకండియర్‌ చదువుతున్నాడు. మహారాష్ట్రలోని షాపూర్‌కు వెళ్లిన దిలీప్‌ తన స్నేహితుడైన సంజీవరెడ్డి వద్దనే ఉన్నారు. తెల్లవారుజామున 4.30 గంటలకు జీడిమెట్లకు వెళ్లేందుకు సిద్ధ మయ్యారు. ఇంతపొద్దున ఎందుకు, టిఫిన్‌ చేసి 8 గంటలకు బయలుదేరండి అని చెప్పినా వినకుండా వెళ్లాడని సంజీవరెడ్డి జోగిపేటలో ఆవేదనతో చెప్పారు. తమ ఇంటి నుంచి బయ లుదేరిన రెండు గంటల్లోనే చనిపోయాడన్న వార్త దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. 

నిద్రమత్తులో లారీ నడిపి..
వికారాబాద్‌ జిల్లా ధారూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమా దంలో ఐదుగురు మృతిచెందగా.. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. పెద్దేముల్‌ మండలం రేగొండికి చెందిన ఆటో డ్రైవర్‌ జమీర్‌ తన ఆటోలో 10 మందిని ఎక్కించుకుని వికారాబాద్‌కు బయలుదేరాడు. వీరిలో ఎనిమిది మంది అడ్డా కూలీలున్నారు.

వీరంతా వికారాబాద్‌లోని ఓ క్రషర్‌ మిషన్‌లో పనిచేస్తారు. బాచారం గ్రామ సమీపంలోకి రోడ్డు మలుపు వద్ద అతివేగంతో ఎదురుగా వచ్చిన లారీ వీరి ఆటోను ఢీకొట్టి కొద్ది దూరం లాక్కెళ్లింది. ప్రమాదంలో డ్రైవర్‌ జమీర్‌ (35), హేంలానాయక్‌ (45), రవి (40) అక్కడికక్కడే మృతిచెందారు. క్షతగాత్రులను తొలుత వికారాబాద్‌ ఆస్పత్రికి తరలించగా అక్కడ నేనావత్‌ కిషన్‌(40) తుదిశ్వాస వదిలాడు.

పరిస్థితి విషమంగా ఉండటంతో మిగిలిన వారిని హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆస్పత్రికి తరలించగా అక్కడ నెనావత్‌ వినోద్‌ (35) మృతి చెందాడు. ప్రస్తుతం ఆరుగురు నిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. లారీ డ్రైవర్‌ ఎం.కుమార్‌ (28) నిద్రమత్తులో ఉండటంతోనే ప్రమాదం జరిగిన ట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగినా పట్టనట్లు వ్యవహరించిన డ్రైవర్‌ కుమార్‌.. అదే లారీని నడుపుకొంటూ తాండూరు వరకు సుమారు 30 కిలోమీటర్లు వెళ్లాడు.

అక్కడ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఎస్పీ కోటిరెడ్డి, డీఎస్‌పీ సత్యనా రాయణ, సీఐ తిరుపతిరాజు, ఎస్‌ఐ నరేందర్‌ ఘటనాస్థలానికి వెళ్లి విచారణ జరిపారు. తండాకు చెందిన ముగ్గురు మృతిచెందడంతో మదనంతపూర్‌లో విషాద ఛాయలు అలుముకు న్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే 108కు సమాచారం ఇచ్చినా సకాలంలో రాలేదని, దీంతో క్షతగాత్రులను తరలించేందుకు పోలీసులు ఇబ్బంది పడినట్లు స్థానికులు చెప్పారు. 

ఆపకపోతే ప్రాణాలు దక్కేవి
మదనంతాపూర్‌ వద్ద కూలీలను ఎక్కించుకున్న ఆటో డ్రైవర్‌ జమీర్‌.. క్రషర్‌లో పనిచేసే టిప్పర్‌ డ్రైవర్‌ శ్రీనివాస్‌ కోసం బాచారం వద్ద ఐదు నిమిషాలు ఆపాడు. అక్కడి నుంచి వెళ్లిన నిమిషాల వ్యవధిలోనే ప్రమాదం చోటుచేసుకుంది. ఇక్కడ ఆపకపోయి ఉంటే ఆటో సురక్షితంగా బాచారం మలుపు దాటి ఉండేదని బాధిత కుటుంబ సభ్యులు రోదించారు.  

Advertisement
 
Advertisement
 
Advertisement