Medchal: విషాదం.. చెరువులోకి మునిగి టీచర్‌తోపాటు ఐదుగురు విద్యార్థుల మృతి

6 Youngsters Died After Drown In Lake Water At Jawahar Nagar - Sakshi

సాక్షి, మేడ్చల్‌: ఈత సరదా ఐదుగురు విద్యార్థుల ప్రాణాలను బలితీసుకుంది. వారిని రక్షించడానికి వెళ్లిన మదరసా టీచర్‌ సైతం మృత్యువాత పడ్డారు. మేడ్చల్‌ జిల్లా జవహర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ విషాదకర ఘటన జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. హైదరాబాద్‌ కాచిగూడ ప్రాంతానికి చెందిన హనీఫా మదరసాలో చదువుకునే దాదాపు 40 మంది విద్యార్థులు శనివారం డీసీఎం వాహనంలో వారి టీచర్‌ యహియా (25)తో కలసి జవహర్‌నగర్‌ కార్పొరేషన్‌ పరిధిలోని మల్కారంలో ఓ గృహప్రవేశానికి హజరయ్యారు.

ఉదయం 11 గంటల సమయంలో కొందరు ఫంక్షన్‌ జరుగుతున్న ఇంట్లోకి వెళ్లగా మరికొందరు బయట ఆడుకుంటున్నారు. వీరిలో ఆరుగురు విద్యార్థులు సమీపంలో ఉన్న ఎర్రగుంట చెరువులో సరదాగా ఈతకు వెళ్లారు. నీటిలోకి దిగిన విద్యార్థులు ఈతరాక ఒక్కొక్కరుగా మునిగిపోయారు. వీరిని గమనించిన ఉపాధ్యాయుడు యహియా వేగంగా వచ్చి నీళ్లలోకి దిగి పిల్లలను కాపాడేప్రయత్నం చేశారు. అయితే పిల్లలు ఆయనను గట్టిగా పట్టుకోవడంతో అందరూ ఒక్కసారిగా నీటిలో మునిగిపోయారు. వీరిలో ఒక విద్యార్థిని అక్కడే ఉన్న స్థానికుడు రక్షించి ఒడ్డుకు చేర్చాడు.

ఈ లోగా టీచర్‌ యహియాతో పాటు ఐదుగురు విద్యార్థులు.. ఇస్మాయిల్‌ (11), జాఫర్‌ (10), సోహెల్‌ (09), అయాన్‌ (09), రియాన్‌(12)లు మృత్యువాతపడ్డారు. విషయం తెలుసుకున్న కుషాయిగూడ ఏసీపీ సాధన రశ్మీ పెరుమాల్, జవహర్‌నగర్‌ సీఐ చంద్రశేఖర్‌ ఘటనా స్థలానికి చేరుకుని ఈతగాళ్లను రప్పించి మృతదేహాలను బయటకు తీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.  
చదవండి: నా భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నావా?.. వీడియో బయటపెడతా

భయాందోళనలో తోటి విద్యార్థులు  
మదరసా నుంచి గృహప్రవేశానికి వచి్చన విద్యార్థులు సరదాగా గడుపుతున్న సమయంలో టీచర్‌తోపాటు ఐదుగురు స్నేహితులు జలసమాధి అయిన విషయం తెలుసుకుని భయాందోళనకు గురయ్యారు. తోటి విద్యార్థులు నీటిలో మునిగిపోయారని కన్నీరుమున్నీరయ్యారు.  

ఆగ్రహించిన స్థానికులు  
ఎర్రగుంట చెరువులో పలుమార్లు ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నా అధికారుల్లో ఎలాంటి చలనం లేదంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే పలువురు విద్యార్థులు ఆ ప్రాంతంలోని చెరువుల్లో మునిగి చనిపోయారని, వాటి చుట్టూ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.  

అంబర్‌పేటలో విషాదఛాయలు
మేడ్చల్‌ జిల్లా జవహర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మల్కారం ఎర్రగుంట చెరువులో శనివారం ఈతకు వెళ్లి మృతి చెందిన ఐదుగురు విద్యార్థులు అంబర్‌పేట నియోజకవర్గం హడ్డికార్ఖానా, సుందర్‌నగర్, నెహ్రూనగర్‌ ప్రాంతాలతో పాటు అంబర్‌పేటకు చెందినవారు కావడంతో ఆయా ప్రాంతాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. కాచిగూడ పోలీసులు హడ్డికార్ఖానా ప్రాంతంలోని మదరసా ప్రాంతానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుల కుటుంబాలను ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, గోల్నాక కార్పొరేటర్‌ దూసరి లావణ్య శ్రీనివాస్‌గౌడ్‌లు పరామర్శించారు.

కాగా, గాంధీ ఆస్పత్రి మార్చురీ వద్దకు మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. తమ పిల్లల మృతదేహాలను చూసి భోరున విలపించారు. ఈ సందర్భంగా మృతదేహాలకు పోస్టుమార్టం వద్దని ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. కొందరు మార్చురీ అద్దాలను ధ్వంసం చేశారు. అయితే ఎమ్మెల్యే, కార్పొరేటర్‌ నచ్చజెప్పడంతో వారు శాంతించారు.    

చదవడి: ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు వ్యతిరేకంగా వచ్చాయని.. యువకుడు మృతి

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top