చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో ఇంటర్మీడియట్ విద్యార్థుల భవిష్యత్తుపై చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరితో నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఏటా ఫిబ్రవరిలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ (ప్రయోగపూర్వక) పరీక్షలు ప్రారంభమవుతాయి. విద్యా సంవత్సరం ముగింపు దశకు వస్తున్నా ఇప్పటివరకు ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులకు కనీసం ప్రాక్టికల్ రికార్డు పుస్తకాలు సైతం అందజేయకపోవడం చంద్రబాబు సర్కారు వైఫల్యానికి పరాకాష్టగా నిలుస్తోంది.
ఇంకెప్పుడు అందిస్తారు?
సాధారణంగా జూన్, జూలైలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలతో పాటు ప్రాక్టికల్ రికార్డు పుస్తకాలను అందించాల్సి ఉంటుంది. అప్పుడే ప్రయోగశాలల్లో (ల్యాబ్స్‌లో) ప్రయోగాలు చేస్తూ, రికార్డులను సక్రమంగా రాసుకుని విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధం కావడానికి వీలవుతుంది. కానీ, ప్రస్తుతం నవంబర్ నెలాఖరుకు చేరుకుంటున్నా ఇప్పటివరకు రికార్డు పుస్తకాల జాడే లేదు. దీంతో ఎంపీసీ, బైపీసీ, ఒకేషనల్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. అసలు రికార్డు పుస్తకాలు ఎప్పుడు అందజేస్తారు? వాటిని పూర్తి చేసి విద్యార్థులు ఎప్పుడు నేర్చుకోవాలి? ఫిబ్రవరిలో నిర్వహించే ప్రాక్టికల్ పరీక్షల్లో భాగంగా ల్యాబ్స్‌లో ఏం ప్రయోగాలు చేయాలి? అంటూ విద్యార్థులు నిలదీస్తున్నారు.
పేద బిడ్డపై చిన్నచూపు
జిల్లాలోని కార్పొరేట్, ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో భారీగా ఫీజులు వసూలు చేసి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్న యాజమాన్యాలు, విద్యార్థులతో సకాలంలో ప్రాక్టికల్స్ రికార్డులు రాయించుకుంటున్నాయి. కానీ, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోని నిరుపేద విద్యార్థులకు మాత్రం కనీస అభ్యాసన సామగ్రిని సైతం సమకూర్చడంలో చంద్రబాబు సర్కారు విఫలమైంది. ఈ క్రమంలోనే పేద బిడ్డలపై చిన్నచూపు చూడడం సరికాదని విద్యావేత్తలు మండిపడుతున్నారు.
చిత్తూరు, తిరుపతి జిల్లాలో విద్యార్థులకు ఇవ్వాల్సిన ప్రాక్టికల్ రికార్డు పుస్తకాలు
చంద్రబాబు సర్కారు అలసత్వం కారణంగా పేద బిడ్డల భవిత ప్రశ్నార్థకంగా మారింది. ప్రధానంగా ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఇప్పటి వరకు ప్రాక్టికల్స్‌కు సంబంధించిన రికార్డు పుస్తకాలు అందించకపోవడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రైవేట్ కళాశాలల్లో ల్యాబ్ ప్రయోగాలు పూర్తి చేయించి రికార్డులు రాయిస్తుంటే.. ప్రభుత్వ కాలేజీల పిల్లల చేతికి పుస్తకాలు అందని దుస్థితి దాపురించింది. ప్రాక్టికల్స్‌కు కేవలం రెండు నెలలు మాత్రమే సమయం ఉండడంతో రికార్డులు రాసే సమయం సరిపోని పరిస్థితి ఏర్పడింది.
చిత్తూరు తిరుపతి
బోటనీ 1,115 1,076
జూవాలజీ 1,115 1,076
ఫిజిక్స్ 1,944 1,931
కెమిస్ట్రీ 1,944 1,931
ఒకేషనల్ విద్యార్థులకు 8,550 6,312
మొత్తం 14,668 12,326


