గురువుల ముసుగులో కీచకులు | - | Sakshi
Sakshi News home page

గురువుల ముసుగులో కీచకులు

Nov 19 2026 2:55 AM | Updated on Nov 19 2026 2:55 AM

వి.కోట బాలికల హైస్కూల్‌లో హెచ్‌ఎం, పీజీటీ వికృత చేష్టలు ఆలస్యమైతే గేటు బయటే విద్యార్థినులు, మహిళా టీచర్లకు అసభ్యకర మెసేజ్‌లు హెచ్‌ఎంపై నాలుగుసార్లు విచారణ జరిగినా కాపాడుతున్న ఇద్దరు కీలక అధికారులు నివేదికలు మార్చి కలెక్టర్‌కు తప్పుడు సమాచారం

చిత్తూరు కలెక్టరేట్‌ : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో కొంతమంది గురువుల ముసుగులో కీచకులు తయారవుతున్నారు. మండల కేంద్రమైన వి.కోటలో ఉన్న ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఆందోళనకర విషయాలు వెలుగుచూస్తున్నాయి. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన హెచ్‌ఎం దామోదరనాయుడు బరితెగించి విద్యార్థినుల భవిష్యత్తుతో, మహిళా ఉపాధ్యాయుల ఆత్మగౌరవంతో చెలగాటమాడుతున్నాడనే ఆరోపణలు తీవ్రరూపం దాల్చాయి. అధికార పార్టీకి చెందిన కీలక నేతల పేర్లు, సామాజిక వర్గపు అండదండలను అడ్డు పెట్టుకుని అతను చేస్తున్న అరాచకాలకు హద్దు లేకుండా పోతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆ హెచ్‌ఎంపై వచ్చిన ఆరోపణలపై 2025 నవంబర్‌ నుంచి ఇప్పటి వరకు నాలుగు సార్లు విచారణ చేశారు. హెచ్‌ఎంకు వైఎస్‌ఆర్‌ కడప జిల్లా ఆర్జేడీ శామ్యూల్‌ షోకాజ్‌ నోటీస్‌ సైతం జారీచేశారు. అధికారులు చర్యలు తీసుకోకుండా నివేదికలు మార్చి ఆ హెచ్‌ఎంను కాపాడుతున్నారు.

నివేదికలు చెబుతున్న అక్షర సత్యం

వి.కోట మండలానికి చెందిన పిల్లల తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గత ఏడాది నవంబర్‌ నుంచి ఈ పాఠశాలలో హెచ్‌ఎం దామోదరనాయుడు వ్యవహార శైలిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. బాలికలు కాస్త ఆలస్యంగా వస్తే గేట్లు వెయ్యడం, చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే విద్యార్థినులను గంటల తరబడి బయట నిలబెట్టడంతో వారి భద్రతను, చదువును ప్రమాదంలోకి నెడుతున్నాడని ఫిర్యాదులు చేశారు. మహిళా ఉపాధ్యాయుల పట్ల ఆయన ప్రవర్తన అభ్యంతరకరంగా ఉంటోందని విచారణలో తేలింది. సహచర సిబ్బందికి అనుచితమైన, అసభ్యకరమైన వాట్సాప్‌ మెసేజ్‌లు పంపుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు అధికారుల ప్రాథమిక విచారణలో స్పష్టమైంది.

నాలుగు సార్లు విచారించినా చర్యలు శూన్యం!

హెచ్‌ఎం వికృత చేష్టలపై 2025 నవంబర్‌ నుంచి ఇప్పటి వరకు నాలుగు సార్లు వివిధ స్థాయిల్లో విచారణలు జరిగాయి. వైఎస్‌ఆర్‌ కడప జిల్లా ఆర్జేడీ శామ్యూల్‌ సైతం హెచ్‌ఎంకు షోకాజ్‌ నోటీస్‌ జారీచేశారు. డీఈవో లక్ష్మినారాయణ, డీవైఈవో ఇందిర సైతం క్షేత్రస్థాయిలో విచారణ జరిపి నివేదికలు సమర్పించారు. ఆ హెచ్‌ఎంపై చర్యలు మాత్రం తీసుకోలేదు. తాజాగా అదే పాఠశాలలో పనిచేస్తున్న పీజీటీ రమేష్‌ విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని ఫిర్యాదులు వచ్చాయి. ఈ ఘటనపై విచారణ చేసిన చిత్తూరు డీవైఈవో ఇందిర అతని వికృత చేష్టలు నిజమని, అలాగే ఘటనలో హెచ్‌ఎం ప్రభావం సైతం ఉందని నివేదికలో స్పష్టం చేశారు. ఆ నివేదికలను జిల్లా విద్యాశాఖ అధికారులు మార్చి కలెక్టర్‌కు పంపినట్లు తెలిసింది. హెచ్‌ఎంపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాల్సింది పోయి మరొక పాఠశాలకు బదిలీ చేయాలని కలెక్టర్‌కు పంపిన నివేదికల్లో సిఫార్సు చేశారు. ఇలా నివేదికలు మారుస్తున్న విద్యాశాఖ అధికారుల తీరుపై విమర్శలు వెలువెత్తుతున్నాయి.

అండగా ఉన్నదెవరు?

‘ప్రభుత్వం మనది.. నిన్నెవరు సస్పెండ్‌ చేస్తారు చూస్తాం’ అంటూ విద్యాశాఖలో పనిచేస్తున్న ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు కీలక అధికారులు హెచ్‌ఎంకు అభయం ఇస్తున్నారనే ఆరోపణలున్నాయి. మహిళా ఉపాధ్యాయులు, బాలికలు తమకు అన్యాయం జరిగిందని కన్నీరుమున్నీరవుతున్నా, అధికార పార్టీ నాయకుల అండదండలతో కొందరు అధికారులు ఈ అరాచకాలను కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తుండడం విద్యాశాఖ వర్గాల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమవుతోంది. ప్రభుత్వ పాఠశాలలను దేవాలయాలుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యతలో ఉన్న ప్రధానోపాధ్యాయుడే ఇలాంటి పనులకు పాల్పడుతుంటే విద్యార్థుల భవిష్యత్తు ఏమైపోవాలని విద్యావేత్తలు, విద్యార్థి సంఘాల నాయకులు మండిపడుతున్నారు. తక్షణమే సంబంధిత హెచ్‌ఎంపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. వి.కోట బాలికల హైస్కూల్‌ హెచ్‌ఎంపై ఉన్న ఆరోపణలను విద్యాశాఖతో సంబంధం లేని అధికారులతో సమగ్ర విచారణ చేయిస్తే వాస్తవాలు బయట పడతాయని విద్యావేత్తలు వెల్లడిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement